Medak rail accident
-
స్పృహలోకి వచ్చిన దర్శన్
హైదరాబాద్: 'మాసాయిపేట' దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు శుక్రవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 20 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఐదుగురు విద్యార్థులకు వెంటిలేటర్ల ద్వారా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. 40 మంది వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. 2,3 రోజుల్లో కొందరిని డిశ్చార్జ్ చేస్తామని యశోద వైద్యులు చెప్పారు. విద్యార్థి దర్శన్ గౌడ్ స్పృహలోకి వచ్చాడని తెలిపారు. ఈరోజు దర్శన్ పుట్టినరోజు కావడంతో అతడితో కేక్ కట్ చేయించారు. -
గార్డ్ రూము అడ్డుగా ఉండడంతో...
హైదరాబాద్: 'మాసాయిపేట' దుర్ఘటనపై నాందేడ్-కాచిగూడ ప్యాసింజర్ రైలు డ్రైవర్ స్పందించాడు. నిన్న ఉదయం 9:15 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని 'సాక్షి'తో చెప్పాడు. 300 మీటర్ల నుంచే తాము విజిల్ ఇచ్చామని తెలిపాడు. అయితే బస్సు ఆకస్మాత్తుగా ట్రాక్‌పైకి బస్సు వచ్చిందని, గార్డ్ రూము అడ్డుగా ఉండడంతో బస్సును గుర్తించలేకపోయామని వెల్లడించాడు. బ్రేక్ వేసేందుకు ప్రయత్నించామని కాని రైలు వేగం వల్ల ప్రమాదం జరిగిందని ట్రైన్ డ్రైవర్ వివరించాడు. రైలు కనపడకుండా అడ్డుగా మారిన గది.. గేటు లేకుండా దిష్టిబొమ్మలా మిగిలిన ఆ గది ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ట్రాక్ దాటేందుకొచ్చే వాహనదారులు దగ్గరికొచ్చాక.. రైలు ఇంజిన్ సరిగ్గా ఎంతదూరంలో ఉందో కనిపించకుండా ఆ గది అడ్డుగా మారింది. ఇంజిన్ కాస్త దూరంగానే ఉండిఉంటుందన్న భావనతో కొందరు వాహనదారులు వేగంగా వాహనాన్ని పట్టాలెక్కించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆ గది కట్టకముందు అడపాదడపా జరిగే ప్రమాదాలు.. ఆ తర్వాత తరచూ జరుగుతున్నాయి. గది నిర్మాణం తర్వాత దాదాపు 25కుపైగా ప్రమాదాలు జరిగాయన్నది స్థానికుల కథనం. అందులో ఈ స్కూలు బస్సు దుర్ఘటన అతిపెద్దది. ఒకవేళ గేటు ఏర్పాటు చేయటంలో మరింత జాప్యం జరిగేపక్షంలో వెంటనే ఆ గదిని కూల్చేయాలని వారు అధికారులను కోరుతుండటం గమనార్హం. -
ముగ్గురి పరిస్థితి అత్యంత విషమం
హైదరాబాద్: 'మాసాయిపేట' ఘటనలో గాయపడిన 20 మంది విద్యార్థులకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు విద్యార్థుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందన్నారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు సాయిరామ్, సుచితాగౌడ్, సందీప్, శరత్, సాత్విక, వరుణ్‌గౌడ్, నభీరా ఫాతిమా, శ్రావణి, హారీశ్, మహిపాల్‌రెడ్డి, అభినందు, సద్భావన్దాస్, శిరీషా, వైష్ణవి, దర్శన్ అలియాస్ ధనుష్‌గౌడ్, కరుణాకర్, శివకుమార్, ప్రశాంత్, నితుషా, తరుణ్. మేల్కోండి.. ప్రాణాలు కాపాడండి! -
ప్రమాద స్థలం వద్ద ఉద్రిక్తత
* బాధితులకు న్యాయం చేయాలని అంబులెన్సులను అడ్డుకున్నఆందోళనకారులు * పోలీసుల లాఠీచార్జి... పలువురికి గాయాలు రామాయంపేట, చేగుంట, వెల్దుర్తి: రైలు ప్రమాదంలో చిన్నారులు మృతి చెందిన సంఘటన ఈ ప్రాంతవాసులను కలచివేసింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు వేలాది మంది సంఘటన స్థలానికి తరలివచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టంకోసం అంబులెన్సుల్లో తరలిస్తుండగా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేవరకు మృతదేహాలను తరలించరాదని భారీ ఎత్తున జనం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు నిరసనకారులను నిలువరించే ప్రయత్నం చేస్తుండగా వారు రాళ్లతో దాడిచేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లను అడ్డుకున్న వందలాదిమంది యువకులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. మరో పక్క ఏబీవీపీ విద్యార్థులు కూడా ధర్నాకు దిగారు. దీంతో భారీ బందోబస్తు మధ్య అంబులెన్సులను మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లాఠీచార్జి సందర్భంగా కొందరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. నిరసనకారుల రాళ్లదాడిలో తూప్రాన్ సీఐ సంజయ్‌కుమార్, గన్‌మన్ నరేంద్రతోపాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అంబులెన్స్‌ల అద్దాలు పగిలాయి. తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, రామాయంపేట సీఐ గంగాధర్, చేగుంట, వెల్దుర్తి ఎస్ఐలు నచ్చజెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. -
‘గేటు’ పెట్టిస్తాం ఓటేయండి.. ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: ఓటు కోసం కోటి మాటలు చెప్పే నేతలు ఆ తర్వాత ప్రజలను పట్టించుకోరనే విషయం... మాసాయిపేట ప్రమాదం నేపథ్యంలో మరోసారి రుజువైంది. గురువారం ప్రమాదం జరిగిన మాసాయిపేట లెవల్ క్రాసింగ్‌తోపాటు దానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణపల్లి, డిల్లాయ్, కూచారం తండాల వ ద్ద కూడా కాపలా లేని క్రాసింగ్‌లు ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాయి. గేట్లు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు రైల్వే అధికారులను కోరినా వారు పట్టించుకోకపోవటంతో విసిగిపోయిన ఆ ప్రాంతాల ప్రజలు... గత సాధారణ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. దీంతో కంగారుపడ్డ నేతలు... రైల్వే అధికారులను ఒప్పించి మరీ వెంటనే గేట్లు ఏర్పాటు చేయిస్తామని, ఓట్లేయాలని బతిమాలారు. దీంతో ప్రజలు ఓట్లేశారు. కానీ నేతలు మాత్రం తామిచ్చిన హామీని మరచిపోయారు. -
కేంద్రం కంటితుడుపు.. రూ. 2 లక్షల పరిహారం
రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన రైల్వే మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: మెదక్ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన ప్రమాదంపై కేంద్రం నామమాత్రంగా స్పందించింది. ఈ ఘటన పై రైల్వే మంత్రి సదానంద గౌడ లోక్‌సభలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటన చేశారు. తెలంగాణలో జరిగిన ఘటన దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు సభకు తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అయితే మానవీయకోణంలో ఆలోచించి ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 20 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ పరిహారం చాలా తక్కువగా ఉందని టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఇది సరికాదని, పరిహారం పెంచాలని నిలదీశారు. దీంతో రైల్వే మంత్రి స్పందించారు. ఇది సాధారణంగా ప్రకటించే పరిహారమని, మరింత నష్టపరిహారం, ఇతర సహాయాలను తర్వాత రైల్వే శాఖ చేపడుతుందని వివరణ ఇచ్చారు. కాగా, బాధితులకు రూ. ఐదు లక్షల నష్టపరిహారం అందించాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఇటు లోక్‌సభలో ఎంపీలు జితేందర్ రెడ్డి, అహ్లూవాలియా కూడా ఇదే డిమాండ్ చేశారు. -
పచ్చడి మెతుకులు.. చితికిన బతుకులు
మాసాయిపేట నుండి సాక్షి ప్రతినిధి: చెల్లాచెదురైన స్కూలు బ్యాగులు...చిందర వందరగా పడి ఉన్న పుస్తకాలు...పాత పలకలు... తెగిపోయిన బూట్లు... పగిలిన టిఫిన్ బాక్స్‌లు...ఏ టిఫిన్ బాక్స్‌లో చూసినా పచ్చడి మెతుకులే. మాసాయిపేట ప్రమాదస్థలివద్ద కనిపించిన దృశ్యాలివి. గురువారం ఘటనాస్థలికి వెళ్లిన సాక్షి ప్రతినిధి అక్కడ పడి ఉన్న టిఫిన్ బాక్సుల్లో కొన్నింటిని తెరిచి చూడగా దాదాపుగా అన్నింట్లోనూ పచ్చడి మెతుకులు, కారంతో కలిపిన ముద్దలే కన్పించాయి. ఆ చిన్నారి విద్యార్థుల సామాజిక స్థితి, పేదరికానికి అద్దం పట్టే ఈ దృశ్యాలు అక్కడి వారిని కలచి వేశాయి. పేదరికంతో అల్లాడుతున్నా... ఇంగ్లిష్ చదువులు చదివితే మంచి ఉద్యోగాలొస్తాయని, తద్వారా తలరాతలు మారతాయనే ఆశతోనే ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నో స్కూలుకు పంపుతున్నారు. అందుకు స్తోమత లేకపోయినా రెక్కలు ముక్కలు చేసుకుని కొందరు. అప్పోసొప్పో చేసి మరికొందరు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివిస్తున్నారు. అయితే తమ పిల్లల జీవితాలను విధి బలి తీసుకోవడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
అంతులేని వేదన..
* తల్లిదండ్రులకు గర్భశోకం * ఇంటి దీపాలను కోల్పోయి.. ఆశలు బుగ్గిపాలు * దుఃఖసాగరంలో కుటుంబాలు వారంతా కాయకష్టం చేసే బడుగు జీవులు. స్వేదం చిందించైనా తమ పిల్లలను పెద్ద చదువులు చదివించాలని ఆశపడ్డారు. కష్టాలు దిగమింగుతూ వేలాదిగా ఫీజులు చెల్లిస్తూ.. కన్న బిడ్డల భవిష్యత్తుపై కలలు కంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఒక్కసారిగా విధి కన్నెర్ర జేయడంతో ఆ కుటుంబాలన్నీ పెను విషాదంలో మునిగిపోయాయి. రేపటి పౌరులు అర్ధాంతరంగా కన్నుమూయడంతో తల్లిదండ్రులు తీరని దుఃఖంలో కూరుకుపోయారు. మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో చిన్నారులను కోల్పోయిన కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మూడు కుటుంబాల్లో ఇద్దరేసి చొప్పున పిల్లలు చనిపోయారు. ఇక ఆసుపత్రుల్లో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల హృదయ వేదన గుండెలను ద్రవింపజేస్తున్నది. మాసాయిపేట పరిసర గ్రామాల్లోని ఏ ఇంటి ముందు చూసినా విషాద ఛాయలే. భగవంతుడా.. మాకెందుకీ శాపమంటూ బాధిత కుటుంబాలు బోరుమంటున్నాయి. టాటా చెప్పి పోయిండు: వంశీతాత మల్లయ్య ‘పొద్దున్నే బువ్వపెట్టి, యూనిఫాం వేసి ముస్తాబు చేసి 8.30 గంటలకు మనవడిని ఎత్తుకుని కోడలితో కలసి రోడ్డుపైకి వచ్చి స్కూలు బస్సు ఎక్కించాను. బస్సు లోపల నుంచి టాటా చెబుతూ గాలిలో ముద్దు(ప్లయింగ్ కిస్) ఇచ్చిండు. గంటలోపలే పిడుగులాంటి వార్త విన్నాం’ అని ఈ దుర్ఘటనలో మృతిచెందిన వంశీ (07) తాత మల్లయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. వెల్దుర్తి మండలం వెంకటాయపల్లికి చెందిన మల్లయ్య కుమారుడు మల్లేష్, కోడలు హేమలత వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు పిల్లలు. వంశీ కాకతీయ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. మనవడిని తానే మృత్యుశకటం ఎక్కించానని మల్లయ్య బావురుమన్నాడు. ఒక్క నిమిషం ఆగి ఉంటే.. ఒక్క నిమిషం ఆగి ఉంటే నీరుటి వంశీ ప్రాణాలు దక్కేవి. ఇస్లాంపూర్ ఎంపీటీసీ నీరుటి అమృతాసుదర్శన్కు ఇద్దరు పిల్లలు. కొడుకు వంశీ ఏడో తరగతి, కూతురు వెన్నెల నాలుగో తరగతి చదువుతున్నారు. వంశీ పెదనాన్న మల్లేశానికి ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో ఆయన్ను చూడటానికి వంశీ మంగళవారం ఇస్లాంపూర్ వచ్చాడు. గురువారం బడికి వెళ్లేందుకని బయలుదేరగా.. తండ్రి సుదర్శన్ పని మీద అదే గ్రామం వచ్చాడు. పని చూసుకొని వచ్చాక తన బండి మీదనే స్కూలుకు తీసుకుని వెళ్తానని చెప్పి సుదర్శన్ గ్రామంలోకి వెళ్లిపోయాడు. సరే అని చెప్పిన వంశీ.. స్కూలు బస్సు రాగానే ఎక్కి కూర్చున్నాడు. మరు నిమిషమే సుదర్శన్ అక్కడికి వచ్చాడు. బస్సులో వెళ్లిపోయాడని స్థానికులు చెప్పడంతో ఆయన దాని వెనకాలే బయలుదేరి వెళ్లాడు. కొద్దిసేపటికే ఘోరం చోటు చేసుకుంది. మూడు కుటుంబాల్లో ఇద్దరు మృతి తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో రామాయపల్లి యాదగిరి-సంతోష దంపతులకు ముగ్గురు బిడ్డలు దివ్య, చరణ్, త్రిష ఉన్నారు. యాదగిరి ఓ ప్రైవేటు సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఫీజుల భారం మోస్తూ ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నాడు. గురువారం నాడు రైలు ఢీకొన్న బస్సులోనే ఇతని ముగ్గురు పిల్లలూ ఉన్నారు. వారిలో దివ్య, చరణ్ దుర్మరణం చెందారు. త్రిష చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. గుండ్రెడ్డిపల్లికి చెందిన రాములు-వసంత దంపతుల పిల్లలు సుమన్, విద్య. పేదరికంలో ఉన్నా వారి భవిష్యత్తు కోసం ప్రైవేటు స్కూల్లో చేర్పించారు. ఇప్పుడు చిన్నారులిద్దరూ విగత జీవులయ్యారు. తండ్రి గుండె తల్లడిల్లింది కిష్టాపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ వలి యుద్దీన్, వజిత దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు గౌసియా యూకేజీ, కుమారుడు రశీద్ ఎల్కేజీ చదువుతున్నారు. రైలు ప్రమాదంలో చిన్నారులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలంలో విగత జీవులుగా పడి ఉన్న కన్నబిడ్డలను చూసి తండ్రి వలియుద్దీన్ అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. నా చెల్లికి తీవ్ర గాయాలు: తేజస్విని మా చెల్లి సాత్విక మొదటి తరగతి, నేను తొమ్మిదవ తరగతి ఒకే స్కూల్లో చదువుతున్నాము. ప్రతి రోజు నేను ఆటోలో వెళతాను. చెల్లి మాత్రం బస్సులో వస్తుంది. మేము ముందుగా వెళ్లిపోయాం. తర్వాత ఈ ఘటన జరిగింది. మేమంతా అల్లారుముద్దుగా చూసుకునే మా చెల్లికి దెబ్బలు తగిలాయి. ఒక్కగానొక్క కుమార్తె: సరోజ నా భర్త లేడు. ఒక్కగానొక్క కుమార్తె వైష్ణవే జీవితంగా బతుకుతున్నా. ఆరవ తరగతి చదువుతోంది. ఎంతో సంతోషంగా పాఠశాలకు వెళ్లిన బిడ్డను ఇలా చూస్తే కడుపుతరుక్కుపోతుంది. నా బిడ్డ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. నవ్వు ఇంకా కళ్లలోనే: సుజాత నా కొడుకు హరీష్‌ను నేనే బస్సు దగ్గరకు తీసుకుని వెళ్లి వదలి పెట్టాను. బాయ్ మమ్మీ అంటూ నవ్వుతూ టాటా చెప్పాడు. ఆ నవ్వు కళ్ల ముందు కదులుతూనే ఉంది. అలా వెళ్లిన కొద్ది సేపటికే గాయాలతో ఆస్పత్రికి రావడం చూస్తే కాళ్లూచేతులు ఆడటం లేదు. డాక్టర్లు కాలు విరిగిందని చెప్పారు. బిడ్డకు ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది. ఆ 5 రూపాయల కోసం ఆగి ఉంటే.. జక్కుల యాదగిరి, సంతోష దంపతుల కుమారుడు చరణ్ స్కూలుకు వెళ్లే ముందు ఐదు రూపాయలు కావాలని మారాం చేశాడు. అవి తెచ్చేందుకు తల్లి ఇంట్లోకి వెళ్లింది. అదే సమయంలో బస్సు రావడంతో చరణ్ వెళ్లిపోయాడు. బయటకు వచ్చిన తర్వాత బస్సుతో పాటు తల్లి కొద్దిదూరం పరిగెత్తినా.. డ్రైవర్ గమనించలేదు. ఒకవేళ ఆ 5 రూపాయల కోసం బస్సును ఆపి ఉంటే అందరి ప్రాణాలు నిలిచేవని స్థానికులు చెబుతున్నారు. - సాక్షి నెట్వర్క్ -
మృతులు, క్షతగాత్రుల వివరాలు
మెదక్: పాఠశాల బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన 16 మందిని గుర్తించారు. మృతుల్లో 14 మంది విద్యార్థులు, బస్సు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. మృతి చెందిన విద్యార్థులు గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, ఇస్లాంపూర్, కిష్టాపూర్ ప్రాంతాలకు చెందిన వారు. క్షతగాత్రుల్లో అల్లీపూర్, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్ చెందిన వారు ఉన్నారు. వీరంతా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. 16 మంది మృతుల వివరాలు... చింతలసుమన్ (12), విద్య (7), చింతల చరణ్(4), దివ్య (7)- గుండ్రెడ్డిపల్లి నీరుడి వంశీ (12), చింతల భువన(6), తుమ్మ వంశీ (13) , గొల్ల మనీష్- ఇస్లాంపూర్ వంశీ (7), శృతి (5)- వెంకటాయపల్లి ఎం.డి.రశీద్ (7), వజియా (4), విశాల్ (6), ధనుష్‌గౌడ్ (7)- కిష్టాపూర్ బస్సు డ్రైవర్ భిక్షపతి (50) వర్గల్ మండలం వేలూరు గణేష్ గౌడ్ (25), బస్ హెల్పర్, ఘనాపూర్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు ప్రశాంత్ (6), శివభూషణ్ (6), రుచికాగౌడ్(6)- వెంకటాయపల్లి సందీప్ (5), సాత్విక (6), శ్రావణి (6), సాయిరామ్(4)- వెంకటాయపల్లి మహిపాల్‌రెడ్డి (4), వరుణ్‌గౌడ్ (7), దర్శన్(6)- వెంకటాయపల్లి బి.మితూష (7), వైష్ణవి (7)- ఇస్లాంపూర్ సద్భావన్దాస్(3)- అల్లీపూర్ తరుణ్ (7), కరుణాకర్ (12), శరత్ (6)- గుండ్రెడ్డిపల్లి నబీరాఫాతిమా (9), శిరీష (8), అభినందు (9), హరీష్ (7) గుండ్రెడ్డిపల్లి -
క్షమాపణ కోరిన కాకతీయ గ్రూప్ చైర్మన్
హైదరాబాద్: మెదక్ జిల్లాలో తమ పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ఘటనపై కాకతీయ గ్రూప్ చైర్మన్ సీతారామిరెడ్డి ఎట్టకేలకు స్పందించారు. ఘటనలో తమ తప్పులేదని సాక్షితో అన్నారు. రైల్వే తప్పిదమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. స్కూల్ బస్సు పూర్తి కండీషన్లో ఉందని, స్కూల్‌ను నిబంధనల ప్రకారమే నడుపుతున్నామని చెప్పారు. అన్నీ స్కూళ్లకు పర్మిషన్లు ఉన్నాయని తెలిపారు. జరిగిన ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. చనిపోయిన విద్యార్థులు తన పిల్లలు లాంటివారని గద్గర స్వరంతో అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను క్షమాపణ కోరారు. -
చిన్నారులకు పవన్ కళ్యాణ్ పరామర్శ
హైదరాబాద్: మెదక్ జిల్లాలో పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ఘటనపై సినీ నటుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.... రైలు ప్రమాద దుర్ఘటనలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. పిల్లలు సురక్షితంగా స్కూల్ వెళ్లలేని పరిస్థితులు నెలకొనడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు నష్టపరిహారంతోనే సరిపెట్టకుండా భవిష్యత్ లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. -
ఆలస్యంగా స్పందించిన స్కూల్ యాజమాన్యం
మెదక్: తమ పాఠశాల బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనపై తుప్రాన్ కాకతీయ టెక్నో స్కూల్ యాజమాన్యం ఆలస్యంగా స్పందించింది. స్కూల్‌కు సంబంధించిన ఫోన్లన్నీ స్విచ్చాఫ్ చేసి ఉన్నాయి. కాకతీయ స్కూల్ గ్రూపునకు చెందిన 96662 22288 నంబరుకు ఫోన్ చేస్తే తమకు సంబంధం లేదని చెబుతున్నారు. తుప్రాన్ బ్రాంచ్‌ను తమ వెబ్సైట్లో ఫ్రాంచైజ్ స్కూల్‌గా కాకతీయ స్కూల్స్ గ్రూపు పేర్కొంది. మరోవైపు అజ్ఞాతంలోకి కాకతీయ గ్రూప్ చైర్మన్ సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయింది. ఈ వార్త ప్రసారం కాగానే ఆయన సాక్షి' టీవీకి ఫోన్ చేసి మాట్లాడారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాపలా లేని రైల్వే గేటు దాటుతుండగా కాకతీయ టెక్నో స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 18 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్, క్లీనర్ కూడా మృతి చెందారు. -
మేల్కోండి.. ప్రాణాలు కాపాడండి!
గుండెలు పిండేసే విషాదం. హృదయాలను ద్రవింపచేసే ఘోర ప్రమాదం. పాపపుణ్యమెరుగని పసివాళ్ల ప్రాణాలను మృత్యుశకటం చిదిమేసిన ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చదువుల కోసం బ్యాగులు భుజాన వేసుకుని బస్సు ఎక్కిన చిన్నారులు కానరానిలోకాలకు వెళ్లిపోయారు. వెళ్లొస్తామంటూ ఉత్సాహంగా వెళ్లిన తమ బంగారు కొండలను రైలు రాక్షసుడు కానరాని లోకాలకు ఎత్తుకుపోయాడని తెలియగానే తల్లడిల్లుతున్న తల్లిదండ్రుల శోకాగ్నికి చల్లార్చడం ఎవరి తరం? తెలుగువారిపై విధి పగబట్టినట్టుగా కన్పిస్తోంది. రెండు నెలల వ్యవధిలో నాలుగు విషాద ఘటనలు దాదాపు వంద మంది తెలుగువారిని పొట్టనపెట్టుకున్నాయి. నీరు, నిప్పుతో పాటు విధి కూడా తెలుగువారిపై కక్ష గట్టినట్టు కనబడుతోంది. మనవారికి జరుగుతున్న వరుస ప్రమాదాలు చూస్తుంటే ఈ భావనే కలుగుతోంది. తెలుగు ప్రజలంటే విధికి ఎందుకంత కోపం? మెదక్ జిల్లాలో గురువారం(జూలై 24) జరిగిన ఘోర ప్రమాదం 20 మంది పసివాళ్ల ప్రాణాలు తీసింది. నాందేడ్ ప్యాసిజర్ రైలు రూపంలో వచ్చి మృతువు కాటేసింది. స్కూల్‌కు వెళ్లాల్సిన చిన్నారులను శవాలుగా మార్చింది. తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చింది. విహారయాత్రకు వెళ్లిన 24 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను జూన్ 8న బియాస్ నది మింగేసింది. జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో చలరేగిన దావాగ్ని 22 మందిని బుగ్గిచేసింది. నగరం ఘటన జరిగిన మరునాడే చెన్నైలో భవనం కూలిన దుర్ఘటనలో 61 మంది శిథిలాల కింద సమాధయ్యారు. మృతుల్లో సగం మందిపైగా తెలుగువారుండడం మరో విషాదం. ఈ నాలుగు విషాద ఘటనలు- పాలకుల నిష్క్రియ, అధికారుల నిర్లక్ష్యాన్ని సజీవ సాక్ష్యాలు. వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పాలకులు, అధికారులు మొద్దునిద్ర వదలడం లేదు. ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారు. దయచేసి మేల్కోండి. అమాయకుల ప్రాణాలు కాపాడండి.