పచ్చడి మెతుకులు.. చితికిన బతుకులు
మాసాయిపేట నుండి సాక్షి ప్రతినిధి: చెల్లాచెదురైన స్కూలు బ్యాగులు...చిందర వందరగా పడి ఉన్న పుస్తకాలు...పాత పలకలు... తెగిపోయిన బూట్లు... పగిలిన టిఫిన్ బాక్స్‌లు...ఏ టిఫిన్ బాక్స్‌లో చూసినా పచ్చడి మెతుకులే. మాసాయిపేట ప్రమాదస్థలివద్ద కనిపించిన దృశ్యాలివి. గురువారం ఘటనాస్థలికి వెళ్లిన సాక్షి ప్రతినిధి అక్కడ పడి ఉన్న టిఫిన్ బాక్సుల్లో కొన్నింటిని తెరిచి చూడగా దాదాపుగా అన్నింట్లోనూ పచ్చడి మెతుకులు, కారంతో కలిపిన ముద్దలే కన్పించాయి.
ఆ చిన్నారి విద్యార్థుల సామాజిక స్థితి, పేదరికానికి అద్దం పట్టే ఈ దృశ్యాలు అక్కడి వారిని కలచి వేశాయి. పేదరికంతో అల్లాడుతున్నా... ఇంగ్లిష్ చదువులు చదివితే మంచి ఉద్యోగాలొస్తాయని, తద్వారా తలరాతలు మారతాయనే ఆశతోనే ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నో స్కూలుకు పంపుతున్నారు. అందుకు స్తోమత లేకపోయినా రెక్కలు ముక్కలు చేసుకుని కొందరు. అప్పోసొప్పో చేసి మరికొందరు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివిస్తున్నారు. అయితే తమ పిల్లల జీవితాలను విధి బలి తీసుకోవడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.