ప్రమాద స్థలం వద్ద ఉద్రిక్తత
* బాధితులకు న్యాయం చేయాలని అంబులెన్సులను అడ్డుకున్నఆందోళనకారులు
* పోలీసుల లాఠీచార్జి... పలువురికి గాయాలు
రామాయంపేట, చేగుంట, వెల్దుర్తి: రైలు ప్రమాదంలో చిన్నారులు మృతి చెందిన సంఘటన ఈ ప్రాంతవాసులను కలచివేసింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు వేలాది మంది సంఘటన స్థలానికి తరలివచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టంకోసం అంబులెన్సుల్లో తరలిస్తుండగా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేవరకు మృతదేహాలను తరలించరాదని భారీ ఎత్తున జనం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు నిరసనకారులను నిలువరించే ప్రయత్నం చేస్తుండగా వారు రాళ్లతో దాడిచేశారు.
ఈ సందర్భంగా అంబులెన్స్‌లను అడ్డుకున్న వందలాదిమంది యువకులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. మరో పక్క ఏబీవీపీ విద్యార్థులు కూడా ధర్నాకు దిగారు. దీంతో భారీ బందోబస్తు మధ్య అంబులెన్సులను మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లాఠీచార్జి సందర్భంగా కొందరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. నిరసనకారుల రాళ్లదాడిలో తూప్రాన్ సీఐ సంజయ్‌కుమార్, గన్‌మన్ నరేంద్రతోపాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అంబులెన్స్‌ల అద్దాలు పగిలాయి. తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, రామాయంపేట సీఐ గంగాధర్, చేగుంట, వెల్దుర్తి ఎస్‌ఐలు నచ్చజెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు.