అంతులేని వేదన.. | Medak train accident: Prima facie evidence points at school bus | Sakshi
Sakshi News home page

అంతులేని వేదన..

Published Fri, Jul 25 2014 3:00 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

అంతులేని వేదన.. - Sakshi

అంతులేని వేదన..

* తల్లిదండ్రులకు గర్భశోకం
* ఇంటి దీపాలను కోల్పోయి.. ఆశలు బుగ్గిపాలు
* దుఃఖసాగరంలో కుటుంబాలు

 
వారంతా కాయకష్టం చేసే బడుగు జీవులు. స్వేదం చిందించైనా తమ పిల్లలను పెద్ద చదువులు చదివించాలని ఆశపడ్డారు. కష్టాలు దిగమింగుతూ వేలాదిగా ఫీజులు చెల్లిస్తూ.. కన్న బిడ్డల భవిష్యత్తుపై కలలు కంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఒక్కసారిగా విధి కన్నెర్ర జేయడంతో ఆ కుటుంబాలన్నీ పెను విషాదంలో మునిగిపోయాయి. రేపటి పౌరులు అర్ధాంతరంగా కన్నుమూయడంతో తల్లిదండ్రులు తీరని దుఃఖంలో కూరుకుపోయారు. మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో చిన్నారులను కోల్పోయిన కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మూడు కుటుంబాల్లో ఇద్దరేసి చొప్పున పిల్లలు చనిపోయారు. ఇక ఆసుపత్రుల్లో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల హృదయ వేదన గుండెలను ద్రవింపజేస్తున్నది. మాసాయిపేట పరిసర గ్రామాల్లోని ఏ ఇంటి ముందు చూసినా విషాద ఛాయలే. భగవంతుడా.. మాకెందుకీ శాపమంటూ బాధిత కుటుంబాలు బోరుమంటున్నాయి.
 
  టాటా చెప్పి పోయిండు: వంశీతాత మల్లయ్య
 ‘పొద్దున్నే బువ్వపెట్టి, యూనిఫాం వేసి ముస్తాబు చేసి 8.30 గంటలకు మనవడిని ఎత్తుకుని కోడలితో కలసి రోడ్డుపైకి వచ్చి స్కూలు బస్సు ఎక్కించాను. బస్సు లోపల నుంచి టాటా చెబుతూ గాలిలో ముద్దు(ప్లయింగ్ కిస్) ఇచ్చిండు. గంటలోపలే పిడుగులాంటి వార్త విన్నాం’ అని ఈ దుర్ఘటనలో మృతిచెందిన వంశీ (07) తాత మల్లయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. వెల్దుర్తి మండలం వెంకటాయపల్లికి చెందిన మల్లయ్య కుమారుడు మల్లేష్, కోడలు హేమలత వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు పిల్లలు. వంశీ కాకతీయ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. మనవడిని తానే మృత్యుశకటం ఎక్కించానని మల్లయ్య బావురుమన్నాడు.
 
 ఒక్క నిమిషం ఆగి ఉంటే..
 ఒక్క నిమిషం ఆగి ఉంటే నీరుటి వంశీ ప్రాణాలు దక్కేవి. ఇస్లాంపూర్ ఎంపీటీసీ నీరుటి అమృతాసుదర్శన్‌కు ఇద్దరు పిల్లలు. కొడుకు వంశీ ఏడో తరగతి, కూతురు వెన్నెల నాలుగో తరగతి చదువుతున్నారు. వంశీ పెదనాన్న మల్లేశానికి ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో ఆయన్ను చూడటానికి వంశీ మంగళవారం ఇస్లాంపూర్ వచ్చాడు. గురువారం బడికి వెళ్లేందుకని బయలుదేరగా.. తండ్రి సుదర్శన్ పని మీద అదే గ్రామం వచ్చాడు. పని చూసుకొని వచ్చాక తన బండి మీదనే స్కూలుకు తీసుకుని వెళ్తానని చెప్పి సుదర్శన్ గ్రామంలోకి వెళ్లిపోయాడు. సరే అని చెప్పిన వంశీ.. స్కూలు బస్సు రాగానే ఎక్కి కూర్చున్నాడు. మరు నిమిషమే సుదర్శన్ అక్కడికి వచ్చాడు. బస్సులో వెళ్లిపోయాడని స్థానికులు చెప్పడంతో ఆయన దాని వెనకాలే బయలుదేరి వెళ్లాడు. కొద్దిసేపటికే ఘోరం చోటు చేసుకుంది.
 
 మూడు కుటుంబాల్లో ఇద్దరు మృతి
 తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో రామాయపల్లి యాదగిరి-సంతోష దంపతులకు ముగ్గురు బిడ్డలు దివ్య, చరణ్, త్రిష ఉన్నారు. యాదగిరి ఓ ప్రైవేటు సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఫీజుల భారం మోస్తూ ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నాడు. గురువారం నాడు రైలు ఢీకొన్న బస్సులోనే ఇతని ముగ్గురు పిల్లలూ ఉన్నారు. వారిలో దివ్య, చరణ్ దుర్మరణం చెందారు. త్రిష చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. గుండ్రెడ్డిపల్లికి చెందిన రాములు-వసంత దంపతుల పిల్లలు సుమన్, విద్య. పేదరికంలో ఉన్నా వారి భవిష్యత్తు కోసం ప్రైవేటు స్కూల్‌లో చేర్పించారు. ఇప్పుడు చిన్నారులిద్దరూ విగత జీవులయ్యారు.
 
 తండ్రి గుండె తల్లడిల్లింది
 కిష్టాపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ వలి యుద్దీన్, వజిత దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు గౌసియా యూకేజీ, కుమారుడు రశీద్ ఎల్‌కేజీ చదువుతున్నారు. రైలు ప్రమాదంలో చిన్నారులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలంలో విగత జీవులుగా పడి ఉన్న కన్నబిడ్డలను చూసి తండ్రి వలియుద్దీన్ అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.
 
 నా చెల్లికి తీవ్ర గాయాలు: తేజస్విని
 మా చెల్లి సాత్విక మొదటి తరగతి, నేను తొమ్మిదవ తరగతి ఒకే స్కూల్‌లో చదువుతున్నాము. ప్రతి రోజు నేను ఆటోలో వెళతాను. చెల్లి మాత్రం బస్సులో వస్తుంది. మేము ముందుగా వెళ్లిపోయాం. తర్వాత ఈ ఘటన జరిగింది. మేమంతా అల్లారుముద్దుగా చూసుకునే మా చెల్లికి దెబ్బలు తగిలాయి.
 
 ఒక్కగానొక్క కుమార్తె: సరోజ
 నా భర్త లేడు. ఒక్కగానొక్క కుమార్తె వైష్ణవే జీవితంగా బతుకుతున్నా. ఆరవ తరగతి చదువుతోంది. ఎంతో సంతోషంగా పాఠశాలకు వెళ్లిన బిడ్డను ఇలా చూస్తే కడుపుతరుక్కుపోతుంది. నా బిడ్డ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.
 
 నవ్వు ఇంకా కళ్లలోనే: సుజాత
 నా కొడుకు హరీష్‌ను నేనే బస్సు దగ్గరకు తీసుకుని వెళ్లి వదలి పెట్టాను. బాయ్ మమ్మీ అంటూ నవ్వుతూ టాటా చెప్పాడు. ఆ నవ్వు కళ్ల ముందు కదులుతూనే ఉంది. అలా వెళ్లిన కొద్ది సేపటికే గాయాలతో ఆస్పత్రికి రావడం చూస్తే కాళ్లూచేతులు ఆడటం లేదు. డాక్టర్లు కాలు విరిగిందని చెప్పారు. బిడ్డకు ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది.
 
 ఆ 5 రూపాయల కోసం ఆగి ఉంటే..
 జక్కుల యాదగిరి, సంతోష దంపతుల కుమారుడు చరణ్ స్కూలుకు వెళ్లే ముందు ఐదు రూపాయలు కావాలని మారాం చేశాడు. అవి తెచ్చేందుకు తల్లి ఇంట్లోకి వెళ్లింది. అదే సమయంలో బస్సు రావడంతో చరణ్ వెళ్లిపోయాడు. బయటకు వచ్చిన తర్వాత బస్సుతో పాటు తల్లి కొద్దిదూరం పరిగెత్తినా.. డ్రైవర్ గమనించలేదు. ఒకవేళ ఆ 5 రూపాయల కోసం బస్సును ఆపి ఉంటే అందరి ప్రాణాలు నిలిచేవని స్థానికులు చెబుతున్నారు.
 - సాక్షి నెట్‌వర్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement