భోజనానికి వెళ్లినందుకు జరిమానా..
- కుల పెద్దల తీర్మానాన్ని కాదన్నందుకు 20 కుటుంబాలకు శిక్ష
- పకాశం జిల్లాలోని మత్స్యకార గ్రామంలో ఘటన
చీరాల: ఆధునిక సమాజంలో ఇంకా కుల పంచాయితీలు రాజ్యమేలుతున్నాయి. చిన్నపాటి కారణాలకే దురాయి పేరుతో కులపెద్దలు వేసే జరిమానాలు చెల్లించలేక అనేక మంది అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బాయపాలెం మత్స్యకార గ్రామానికి చెందిన 20 కుటుంబాలు.. గ్రామానికి సమీపంలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చెందిన క్రిస్టల్ సీఫుడ్ కంపెనీలో కూలి పనులకు వెళ్తుంటారు. కంపెనీ ప్రారంభం రోజైన ఫిబ్రవరి 27న ఆ సంస్థలో పనిచేస్తున్న 20 కుటుంబాల వారు మాత్రమే గ్రామం నుంచి భోజనాలకు రావాల్సిందిగా సంస్థ నిర్వాహకులు ఆహ్వానించారు. దీనిపై ఆగ్రహం చెందిన మత్స్యకారపెద్దలు గ్రామం నుంచి ఎవరూ భోజనాలకు వెళ్లకూడదని తీర్మానించారు.
అయితే సంస్థలో పనిచేస్తున్న కుటుంబాల వారు తీర్మానాన్ని ధిక్కరించి భోజనాలు చేశారు. దీంతో తమ మాట కాదని భోజనం చేసినందుకుగాను వారిని కుల పెద్దలు రచ్చబండకు పిలిచారు. అందరికీ కలిపి రూ. 10 వేలు జరిమానా విధించారు. నెలరోజులైనా జరిమానా కట్టకపోవడంతో గురువారం మళ్లీ కుల పెద్దలు రచ్చబండ వద్దకు బాధితులను పిలిచారు. ఈ సందర్భంగా తమను ప్రశ్నించిన కొందరిని కొట్టారు. భయపడిన ఆరుగురు గ్రామం నుంచి పారిపోయి పక్కనే ఉన్న కఠారివారిపాలెం చేరుకుని అక్కడి పెద్దలను కలిశారు. దీంతో సమీపంలో ఉన్న మత్స్యకార గ్రామాల కులపెద్దలు శుక్రవారం 20 కుటుంబాల వారిని పిలిచి కులపెద్దలు వేసిన జరిమానా సరైనదేనని చెప్పారు. కుల కట్టుబాటును పాటించని కారణంతో ఈ సారి ఒక్కో కుటుంబానికి రూ. 8 వేలు చొప్పున జరిమానా వేశారు. దానిని నెల రోజుల్లోగా చెల్లించాలని తీర్పు చెప్పారు. కూలి పనులు చేసుకునే తమకు రూ. 8 వేలు చెల్లించే స్థోమత లేదని 20 కుటుంబాల వారు వాపోతున్నారు.