
సాక్షి, ప్రకాశం/అమరావతి: చీరాలలో ఈ నెల 18న ఎస్సై దాడిలో మృతి చెందిన యువకుడు కిరణ్ కేసు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ నుంచి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఎంవో కార్యాలయం సేకరిచింది. యువకుడి మృతి కేసుపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మృతుడు కిరణ్ కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: పిల్లి సుభాష్)
ఈ ఘటనపై ఎస్పీ సిద్దార్థ్ కౌసల్ వివరణ ఇస్తూ.. చీరాల యువకుడు కిరణ్‌పై ఎస్సై విజయ్ కుమార్ దాడి చేశారనడం అవాస్తవమని తెలిపారు. ఈ నెల 18న చీరాల 2 టౌన్ పరిధిలో కిరణ్, అబ్రహం షైన్ అనే ఇద్దరు యువకులు మాస్క్ లేకుండా బైక్‌పై తిరుగుతుండగా ఎస్సై విజయ కుమార్ ఆపి యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పారు. మద్యం మత్తులో ఉన్న కిరణ్, అబ్రహం షైన్‌లు పోలీసులతో వాగ్వాదానికి దిగారని తెలిపారు. దీంతో యువకులను పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా కిరణ్ కిందకు దూకడంతో తలకి బలమైన గాయం అయిందని చెప్పారు. అనంతరం హాస్పీటల్‌కు తరలించారని, చికిత్స అందిస్తున్న క్రమంలో కిరణ్ నిన్న(మంగళవారం) మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు.