చీరాల రైల్వే స్టేషన్లో రెండున్నర గంటలపాటు వాగ్వాదాలు, తోపులాటలు
చీరాల: బెర్తు విషయంలో ప్రయాణికుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గుంటూరు పట్టణానికి చెందిన సుశీల, లలితకుమారి తెనాలి నుంచి చెన్నై వెళ్లేందుకు అహ్మదాబాద్ - చెన్నై నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. వీరికి ఎస్-8 బోగీలో 61, 62 బెర్తులు కేటాయించారు. తెనాలిలో సుశీల సోదరుడు శవరం శ్రీనివాసరావు వీరిని రైలు ఎక్కించాడు. అప్పటికే వీరికి కేటాయించిన బెర్తుల్లో అహ్మదాబాద్‌కు చెందిన ప్రయాణికులు కూర్చొని ఉన్నారు. వారితో మాట్లాడుతున్న శ్రీనివాసరావుతో అహ్మదాబాద్‌కు చెందిన మరో ప్రయాణికుడు కుమారన్ వచ్చి గొడవకు దిగాడు. అంతలోనే హిందీ ప్రయాణికుల బంధువులు శ్రీనివాసరావు, సుశీలపై దాడిచేశారు. బాధితులు చీరాల రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కుమరన్‌ను ఆర్పీఎఫ్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో చీరాల నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న రైలును అహ్మదాబాద్‌కు చెందిన ప్రయాణికులు స్వర్ణ గేటు ప్రాంతంలో చైను లాగి ఆపేశారు. తమవాడిని పోలీసులు విడుదల చేయాలని ఆందోళనకు దిగారు.ఒక దశలో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. చివరకు పోలీసులు ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తమ అదుపులో ఉన్న ప్రయాణికుడిని వదిలివేసిన తర్వాత ఆందోళనకారులు శాంతించారు.