
సాక్షి, విజయవాడ: నగరంలోని ప్రముఖ మేరీ స్టెల్లా కళాశాలలో 30 మంది విద్యార్థినులు ఒకేసారి అస్వస్థతకు లోనవ్వటం కలకలం రేపుతోంది. గురువారం ఉదయంపూట సుమారు 30 మంది విద్యార్థినులు ఒక్కసారిగా అనారోగ్యం పాలవడంతో వారిని సెయింట్ ఆన్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందన్న అనుమానాన్ని కళాశాల యాజమాన్యం కొట్టిపారేసింది. వైరల్ ఫీవర్స్ వల్లే విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారని కళాశాల యాజమాన్యం పేర్కొంది.
ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘నిన్న రాత్రి 50 మంది స్టెల్లా కళాశాల విద్యార్థినులు వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చారు. అందులో 35 మందిని ఉదయానికల్లా పంపించేశాం. మిగతా 15 మంది ఇంకా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. వారికి అన్ని టెస్ట్‌లు నిర్వహించాం. ఫుడ్ పాయిజన్ అని తేలలేదు. అయితే కలుషిత తాగునీటి వల్ల వాంతులు, విరేచననాలు, కడుపునొప్పితో బాధపడుతున్నారని భావిస్తున్నాం. అతికొద్దిమందికే గొంతునొప్పి, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. సాయంత్రం మరో పదిమంది విద్యార్థినులను డిశ్చార్జ్ చేస్తాం. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేద’ని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment