సరికొత్త అడుగులు
Published Tue, Dec 31 2013 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
నయాసాల్ సే షురూ... ‘నవ’ నియమాలు పాటించాలి ఇక అంతా ఆనందమయజీవితమే
కొత్త సంవత్సరంలో రెగ్యులర్‌గా వాకింగ్, ఎక్స్‌ర్‌సైజ్‌కు వెళతామని, మద్యం, సిగరేట్ లాంటి అలవాట్లుంటే మానేస్తామని శపథాలు చేయడం, తెల్లారేసరికి.. మరోసారి చూద్దాంలే అని వాయిదాల పర్వానికి ప్రాధాన్యమిచ్చే వారే ఎక్కువ. పాత అలవాట్లను కొనసాగించడం మామూలే అవుతున్నది. ఇక నుంచైనా కొత్త సంవత్సరంలోనైనా చెడు అలవాట్లకు చెల్లుచీటి ఇచ్చి, మంచి వాటిని వంట పట్టించుకునేందుకు మరో 24గంటల సమయం ఉంది. ఏదైనా ఓపని క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు చేస్తే తెలియకుండానే అది అలవాటుగా మారుతుందని వ్యక్తిత్వ వికాస నిపుణుల అభిప్రాయం. ఈ జనవరి నుంచి ఓ తొమ్మిది అలవాట్లను మనసులో అనుకొని తప్పకుండా పాటిస్తే అంతులేని ఆత్మసంతృప్తి మీ సొంతం. ఆ ‘నవ’ అలవాట్లు ఏమిటంటే..
సమయ పాలన..
మీరు ఎంతో నైపుణ్యం కలిగిన ఉద్యోగైనా కావచ్చు, చేయి తిరిగిన వ్యాపారైనా కావచ్చు. సమయ పాలన లేకపోతే రాణించడం కష్టం. మీ సమయమేకాదు. ఇతరుల సమయం కూడా ఎంతో ముఖ్యమని గుర్తించాలి. వృథాకబుర్లను కట్టిపెట్టాలి. పనులను వాయిదా వేసే విధానానికి నేటి నుంచే చెక్‌పెట్టాలి.
అప్‌డేట్ కావాలి..
కంప్యూటర్ యుగంలో టైప్‌రైటర్‌తో పనిచేస్తానంటే కుదరదు. ఈ రోజున్న పోకడ రేపటికి మారడం సహజం. పోటీ ప్రపంచంలో కొత్త విషయాలు నేర్చుకునేందుకు ముందుండాలి. అప్పుడే సక్సెస్ వెన్నంటి ఉంటుంది. అప్‌డేట్‌కావాలి. సమయం లేదని సాకులు చెప్పకుండా ప్రయత్నిస్తూ పోతే విజేతలుగా ఉంటారు.
సానుకూల ఆలోచనలు..
చిన్నపాటి సమస్యలకే కుంగిపోరాదు. తొందరపాటు నిర్ణయాల నుంచి బయటకు రావాలి. సానుకూల ఆలోచనాదృక్పథం అవసరం. ఇంటా, బయటా ఇబ్బందులెదురైతే సహకారాత్మక ధోరణితో పరిష్కరించుకునే అలవాటు చేసుకోవాలి. నిరంతరం ప్రయత్నం చేయడం వారానే ఇది సాధ్యం. ప్రతి ఒక్కరూ భావావేశానికి లోనుకాకుండా సహకారాత్మక వైఖరితో విమర్శలు తిప్పికొట్టడం విజేత లక్షణం.
ఒత్తిడిని జయించండి ఇలా..
ఈ రోజుల్లో ఒత్తిడి లేని జీవితాలు లేనేలేవని చెప్పవచ్చు. ఒత్తిడికి చిత్తవ్వకుండా విజేతలుగా నిలవాలి. చెప్పినంత సులువుకాక పోవచ్చు. కానీ ప్రయత్నిస్తే కష్టమేమీకాదు. సంకల్పబలముండాలి. మంచి వారితో స్నేహం, నలుగురితో కలివిడిగా మెలగడం, మంచి పుస్తకాల పఠనం, యోగా చేయడం, వారాంతంలో రిలాక్స్ అయ్యేపనులు, సానుకూల దృక్పథం.. ఇలాంటివన్నీ ఒత్తిడి నుంచి దూరం చేయవచ్చు
ఆరోగ్యమే అంతులేని ఆస్తి
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన ఆస్తిలేదు. సమస్యలు చుట్టు ముట్టే వరకు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించి, వచ్చిన తరువాత ఆందోళన చెందడం కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. రోజుకు అరగంటైనా వ్యాయామం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచే ప్రారంభిద్దాం. కొత్త సంవత్సరంలో అలవాటుగా మార్చుకుందాం.
దురలవాట్లకు స్వస్తి
మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి రుచించదు. మద్యం, సిగరేట్, జూదం ఇలాంటి చెడు అలవాట్లు నిండా ముంచుతాయి. దురలవాట్లకు ఈ కొత్త సంవత్సరం నుంచైనా స్వస్తి పలకాలి అనుకుంటాం. కానీ వదులుకోలేక పోతున్నాం అని సమర్థించుకోకండి అలా అంటే కారణం మీమనస్సును నిగ్రహంలో ఉంచుకోలేకపోవడమేనని గుర్తించాలి.
పొదుపు మంత్రం
పొదుపా...ఆ...అప్పుడే ఏం తొందర. తర్వాత చేద్దాం లే అని భావించే వారు ఎక్కువ. జీతం వచ్చిందా, ఖర్చు చేశామా, అనే ధోరణి సరికాదు. అవసరం ఎప్పుడూ చెప్పిరాదు. అలాంటపుడు ఆదుకునేది పొదుపే. ఎంత చిన్న వయస్సు నుంచి పొదుపు ఆరంభిస్తే అంతమంచిది. వంద రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలైనా పొదుపు చేయాలనే ప్రణాళిక ఉండాలి.
ఎవరికి వారే ఉంటే..
ప్రపంచీకరణ వల్ల పెరిగిన జీవన వేగంలో ఎవరికి వారే అనే ధోరణి పెరిగింది. అపార్టుమెంట్ల సంస్కృతి వచ్చాక పక్కింటి వారు కూడా తెలియని పరిస్థితి. అక్కడ ఏం జరిగినా మనకేం సంబంధం అనే విధంగా లైఫ్‌స్టైల్ మారింది. వాస్తవానికి బాధను పంచుకుంటే సగం ఊరటలభిస్తుంది. ఆపదలోని వారిని ఆదుకోవడం, బాధలో ఉన్న వారికి బాసటగా నిలవడం, చేతనైనంత సహాయం చేయడం ద్వారా ఎంతో తృప్తికలుగుతుంది.
కుటుంబంతో సరదాగా..
ప్రతి వ్యక్తి విజయంలో కుటుంబ పాత్ర ఎంతో ఉంటుంది. విధుల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం ఇవ్వాలి. రోజుకోసారై నా కుటుంబ సభ్యుల తో కలిసి తినాలి. వారానికోసారైనా అలా బయటకు వెళ్లిరావాలి. బయటికెళ్దామని మీ శ్రీమతి అంటే సమయం లేదనడం. పార్కు కో, సినిమాకో పోదామా డాడీ అని పిల్లలంటే తర్వాత వెళ్దాంలే అని దాటేయకండి. వాటిని నెరవేర్చడం ద్వారా మీపై నమ్మకాన్ని పెంచుతాయి.
Advertisement
Advertisement