జనతా పద్దు.. కొత్త పొద్దు | 2020–21 Financial year is designed for a full-fledged budget to fulfill the aspirations of the people | Sakshi
Sakshi News home page

జనతా పద్దు.. కొత్త పొద్దు

Published Wed, Jun 17 2020 3:52 AM | Last Updated on Wed, Jun 17 2020 8:33 AM

2020–21 Financial year is designed for a full-fledged budget to fulfill the aspirations of the people - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19తో ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా నవరత్నాలతో కూడిన జనరంజక బడ్జెట్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శాసనసభకు సమర్పించింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆంకాంక్షలను నేరవేర్చడమే లక్ష్యంగా 2020–21 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. 2019–20 వార్షిక బడ్జెట్‌లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు మిగతా హామీలన్నింటికీ బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. నవరత్నాల్లోని వివిధ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు బదిలీ కోసం ఏకంగా రూ.37,659 కోట్లు కేటాయించింది. 


► పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట మేరకు వారి రుణాల చెల్లింపునకు వైఎస్సార్‌ ఆసరా కింద రూ.6,300 కోట్లు కేటాయించారు. 45–60 ఏళ్లలోపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వైఎస్సార్‌ చేయూత కింద రూ.3 వేల కోట్లు కేటాయించారు.  
► వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు ఏకంగా రూ.16,000 కోట్లు కేటాయించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ గతంలో లేని విధంగా అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచే స్థాయిలో ప్రతిపాదించారు.  
► ఏ రంగాలకు, ఏ వర్గాలకు, ఏ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించారో వివరించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికీ ప్రాధాన్యత ఇచ్చారు.   ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలకు భారీగా నిధులు కేటాయించారు.
► మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 2020–21 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశ       పెట్టారు. 
► అభివృద్ధి, సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ, పట్టణ సచివాలయాలకు బడ్జెట్‌లో రూ.3,798 కోట్లు కేటాయించారు.  
వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం 
► వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ రూ.29,159.97 కోట్లు కేటాయించారు. ఇందులో  వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఒక్కో రైతు కుటుంబానికి పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 (ఇప్పటికే ఒక్కో రైతుకు రైతు భరోసా కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.7,500 ఇచ్చేశారు) చొప్పున ఇచ్చేందుకు వీలుగా బడ్జెట్‌లో రూ.3,615.60 కోట్లు కేటాయించారు. రైతులకు వడ్డీ లేని (సున్నా వడ్డీ) రుణాలకు, రైతులకు ఉచితంగా బోర్లు వేయడానికి, ధరల స్థిరీకరణ నిధి, ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎక్స్‌గ్రేషియా, గోదాముల నిర్మాణం, సబ్సిడీపై విత్తనాలు సరఫరా, పంటల బీమా ప్రీమియంకు   కేటాయింపులు చేశారు.  
► కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్రానికి ఉన్న వాటా నీళ్లను వినియోగించుకుని దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు  పెద్ద పీట వేశారు. జల వనరుల శాఖకు రూ.11,805.85 కోట్లు కేటాయించారు.  


విద్యా రంగానికి ప్రాధాన్యత 
► పట్టణ, గ్రామీణ పేదల గృహ నిర్మాణాలకు  భారీగా కేటాయించారు. అన్ని రకాల గృహాల నిర్మాణాలకు రూ.6,190.33 కోట్లు కేటాయించారు. ఇందులో వైఎస్సార్‌ గృహ వసతికి రూ.3 వేల కోట్లు కేటాయించారు.  
► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనకు (ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు)  రూ. 5 వేల కోట్లు కేటాయించారు.  
► విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణ విద్యకు బడ్జెట్‌లో 25,201.35 కోట్ల రూపాయలు కేటాయించారు. జగనన్న అమ్మ ఒడి కింద సాయం అందించేందుకు రూ. 6,000 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు–నేడు కింద రూ.3,000 కోట్లు కేటాయించారు.  
► వైద్య రంగానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. ఏకంగా రూ.11,418 కోట్ల కేటాయింపులు చేశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీకి బడ్జెట్‌లో రూ.2,100 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు నాడు–నేడు కింద రూ.1,528 కోట్లు కేటాయించారు.   
► కాపుల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.2,845.60 కోట్లు కేటాయించారు. ఎస్సీ ఉప ప్రణాళిక కింద 15,735.68 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.5,177.53 కోట్లు, బీసీ ఉప ప్రణాళిక కింద రూ.25,331.30 కోట్లు కేటాయింపులు చేశారు. 
► కడపలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుకు బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించారు.  
► మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కలిపి రూ.1,365.08 కోట్లు కేటాయించారు. 
గ్రామీణాభివృద్ధికి రూ.15,112.74 కోట్లు, సంక్షేమానికి రూ.41,456.29 కోట్లు కేటాయించారు. 

ఇటు సంక్షేమం
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 90 శాతం నెరవేర్చిన ప్రభుత్వం మిగతా హామీలన్నింటికీ నిధులు కేటాయించింది. నవరత్నాల్లోని వివిధ పథకాల ద్వారా ప్రజలకు సాయం అందించేందుకు రూ. వేలాది కోట్లు కేటాయించింది. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేసింది.

అటు అభివృద్ధి
కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన వాటా నీళ్లను వినియోగించుకుని దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు
బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. అలాగే గ్రామీణాభివృద్ధితో పాటు పలు రంగాలకు భారీగా నిధులు కేటాయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement