సాక్షి, అనంతపురం: కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోతున్నాయి. ఈ సూక్ష్మక్రిమి మనుషులనే మింగేస్తోంది. కానీ ‘అనంత’ వాసులు ఈ వైరస్‌పై విజయం సాధిస్తున్నారు. జిల్లా యంత్రాంగం చూపిస్తున్న శ్రద్ధ.. వైద్యులు అందిస్తున్న మెరుగైన చికిత్స ఫలితంగా.. కరోనా బారిన పడిన వారు త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతున్నారు. జిల్లాలో మార్చి 29న మొదటి కేసు నమోదుకాగా, ఇప్పటి వరకు 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మెరుగైన వైద్యంతో 24 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 38 మంది బాధితులు కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. (లాక్‌డౌన్: ఇల్లు చేరకుండానే ఆగిన కార్మికుడి గుండె)
హిందూపురంలోనే అధికం
కరోనా పాజిటివ్ కేసులు హిందూపురంలోనే అధికంగా ఉన్నాయి. కానీ వైరస్‌పై యుద్ధం చేసి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పురంలోనే అధికం. హిందూపురం అర్బన్, రూరల్ పరిధిలో మొత్తం 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 12 మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. 50 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న నలుగురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 22 మంది పురం వాసులు కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక అనంతపురం అనంతపురం అర్బన్, రూరల్ పరిధిలో 19 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏడుగురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
ప్రస్తుతం 12 మంది చికిత్స పొందుతున్నారు. శెట్టూరు మండలంలో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా...అతను కూడా పూర్తిగా కోలుకుని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యాడు. మిగతా చోట్ల ఒకటీ రెండు కేసులు మించి నమోదు కాలేదు. పాటిటివ్ కేసుల్లోనూ చాలా మందికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, అందరూ త్వరలోనే కోలుకుని డిశార్చ్ అవుతారని వైద్యులు చెబుతున్నారు.
మెరుగైన చికిత్సతోనే రికవరీ
కరోనా బాధితులకు మెరుగైన వైద్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నాం. అందువల్లే బాధితులంతా త్వరగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో రోజురోజుకూ డిశ్చార్చ్‌ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికి 24 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బాధితులకు వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. – గంధం చంద్రుడు, కలెక్టర్
మూడు రెడ్‌జోన్లు
అనంతపురం: ‘‘అనంతపురం అర్బన్‌తోపాటు హిందూపురం అర్బన్, రూరల్ ప్రాంతాలను రెడ్‌జోన్లుగా గుర్తించాం. రెడ్‌జోన్‌లో నిబంధనలు యథావిధిగా అమలు చేస్తాం. కరోనా కట్టడిలో భాగంగా అనుమానిత లక్షణాలు కలిగిన వారిని గుర్తించి రక్షించడమే లక్ష్యం. అనుమానిత లక్షణాలుంటే 1800 4256 246 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలిపితే పరీక్షలు చేయిస్తాం.’’ అని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కరోనాపై ఎవరూ పెద్దగా ఆందోళన చెందవద్దని, పాజిటివ్ బాధిత కుటుంబాలను వెలివేసినట్లుగా చూడకూదన్నారు. వారి వద్ద భౌతిక దూరం పాటిస్తే చాలన్నారు.
కరోనా లక్షణాలు ఉన్న వారికి, 60 ఏళ్ల వయసు దాటిన వారికి మొదటగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరోగ్య దృష్ట్యా గర్భిణులకు తప్పనిసరిగా పరీక్షలు చేయిస్తామన్నారు. ప్రత్యేకంగా 1,000 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. లక్షణాల స్థాయి తక్కువగా ఉన్న కరోనా పాజిటివ్ వ్యక్తులు హోమ్ ఐసోలేషన్‌లో(స్వీయ నిర్భందం) ఉండేందుకు సమ్మతిస్తామన్నారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. రెడ్‌జోన్‌లో 14 రోజుల్లో ఒక్క కేసూ నమోదు కాకపోతే ఆరెంజ్ జోన్‌గా మారుస్తామని.. 28 రోజుల్లో ఒక్క కేసూ నమోదవ్వకపోతే గ్రీన్‌జోన్‌గా మారుస్తామన్నారు.
- రెడ్‌జోన్: 4 కేసులకు మించిన ప్రాంతాలు
- (అనంతపురం అర్బన్, హిందూపురం రూరల్, అర్బన్ )
- యథావిధిగా లాక్‌డౌన్ నిబంధనలు
- ఆరెంజ్ జోన్: నాలుగు కంటే తక్కువ కేసులు
- (రాప్తాడు, శెట్టూరు, కళ్యాణదుర్గం, గుంతకల్లు, లేపాక్షి )
- మెడికల్ ఎమర్జెన్సీ పనులు. వ్యవసాయం. అనుబంధ పనులు
- గ్రీన్ జోన్: జిల్లాలోని మిగిలిన ప్రాంతాలు
- వ్యవసాయం. పరిశ్రమలు. వ్యవసాయ కూలీలు. కారి్మకులు.
- మెడికల్ ఎమర్జెన్సీలో భాగంగా సొంత వాహనాల్లో వెళ్లేందుకు అవకాశం.
Comments
Please login to add a commentAdd a comment