
సాక్షి, అమరావతి: రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ 246 ఆధునిక చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనుంది. రైతుల నుంచి పంటను కొనుగోలు చేసిన వ్యాపారులు మార్కెటింగ్ శాఖ కార్యాలయాలకు వెళ్లకుండా వీటిలోనే సెస్ చెల్లించేందుకు అనువుగా వీటిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు రోడ్డు పక్కన చిన్న రేకులషెడ్డులో అరకొర సౌకర్యాలతో చెక్‌పోస్టులు కొనసాగుతున్నాయి. అక్కడ సిబ్బంది పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వాటి స్థానే ఆధునిక చెక్‌పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. మంచి వాతావరణంలో విధులు నిర్వహించేందుకు వీలుగా సౌకర్యాల కల్పనతో పాటు కంప్యూటర్ల వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. సిబ్బందికి వాష్ రూంలు తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
► గత ప్రభుత్వ హయాంలో సాలీనా రూ.400 కోట్లలోపే ఆదాయం కలిగిన మార్కెటింగ్‌శాఖకు గత రెండేళ్ల నుంచి రూ.600 కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. కరోనా విపత్తు సమయంలోనూ లక్ష్యానికి అనువుగా ఆదాయాన్ని సాధించింది. పెరుగుతున్న ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం మార్కెట్ యార్డుల్లో రైతులకు అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
► వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి మార్కెట్‌యార్డులో అరటి రైతులు పంటను నిల్వ చేసుకునేందుకు, ప్యాకింగ్ చేసుకునేందుకు వీలుగా కోల్డుస్టోరేజీ ప్లాంట్, గోదామును నిర్మించనుంది. గత సీజన్‌లో అరటిని నిల్వ చేసుకునే సౌకర్యాల్లేక రాయలసీమ రైతులు నానా ఇబ్బందులుపడ్డారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 600 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కోల్డు స్టోరేజీ ప్లాంట్‌ను నిర్మించనుంది.
► దాదాపు రూ.5 కోట్ల విలువ చేసే ఈ యూనిట్ల నిర్మాణంతో వైఎస్సార్ జిల్లాలోని రైతులు పంటను నిల్వ చేసుకునేందుకు, అమ్ముకునేందుకు ఇక ఇబ్బందులు పడాల్సిన పనిలేదు.
► గత నెలలోనే 70 గోడౌన్ల నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించిన మార్కెటింగ్‌శాఖ.. రాయలసీమ ప్రాంతంలోని మార్కెట్‌యార్డుల్లో సిమెంట్ రోడ్లు, దుకాణాలు, ప్లాట్‌ఫాంలు, ప్రహరీలు, పశువైద్యశాలల నిర్మాణాలకూ టెండర్లు పిలిచింది.
► దాదాపు రూ.20 కోట్ల విలువ చేసే ఈ సౌకర్యాలను వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.ప్రద్యుమ్న చెప్పారు.