
సాక్షి, అమరావతి: వలస కూలీలు, కార్మికులు ఆందోళన చెందవద్దని, శ్రామిక్ రైళ్లకు ఆయా రాష్ట్రాల నుంచి అనుమతులు రాగానే వారిని పంపిస్తున్నట్లు కోవిడ్ టాస్క్‌ఫోర్సు చైర్మన్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక రిలీఫ్ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. వలస కూలీలకు కల్పిస్తున్న వసతులు, ప్రయాణ ఏర్పాట్లపై కృష్ణబాబు ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు.
సరిహద్దుల్లో ఇతర భాషల్లో బ్యానర్లు..
► గత 15 రోజులుగా రాష్ట్రంలోని జాతీయ రహదారులపై వారి రాష్ట్రాలకు వెళుతున్న 6 వేల మంది వలస కార్మికులను గుర్తించాం. సీఎం జగన్ సూచనల మేరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఒడిశా, బెంగాలీ, హిందీ భాషల్లో ‘మిమ్మల్ని మీ రాష్ట్రాలకు చేరుస్తాం’ అని బ్యానర్లు పెడుతున్నాం.
► ఇప్పటివరకు 24 శ్రామిక్ రైళ్ల ద్వారా 27,458 మంది వలస కూలీలను బిహార్, యూపీ, జార్ఘండ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లకు పంపించాం. 2 రోజుల్లో మరో 30,392 మందిని తరలిస్తాం.
దారి ఖర్చుల కింద రూ.500
► ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే కూలీలకు అన్ని సదుపాయాలు కల్పించి రూ.500 దారి ఖర్చుల కింద అందించాలని సీఎం వైఎస్ జగన్ సూచించిన నేపథ్యంలో ఆ మేరకు ఏర్పాట్లు చేశాం. వలస కూలీలకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.
► రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు 80,669 మంది వలస కూలీలను 2,748 ఆర్టీసీ బస్సుల్లో తరలించాం. గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా 42,135 మందిని ఇతర జిల్లాలకు తరలించాం. కర్నూలు నుంచి 13,143 మందిని ఇతర జిల్లాలకు పంపించాం.