ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచించిన చంద్రబాబు
అన్ని నియోజకవర్గాల్లోని పోలీస్ స్టేషన్ల ఎదుట ఆందోళన
వైఎస్సార్ సీపీ జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జి పెద్దిరెడ్డి
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేసినందుకు జూన్ రెండో తేదీని వంచన దినంగా నిర్వహిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆ రోజు అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో గెలుపు కోసం అనేక హామీలు ఇచ్చిందని, అయితే నేటికీ వాటిని నెరవేర్చకుండా రైతులు, డ్వాక్రా మహిళలు, ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుపతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల హామీలన్నీ నెరవేర్చామని, హామీ ఇవ్వని అనేక కార్యక్రమాలను కూడా అమలు చేశామని చెప్పడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చని ప్రభుత్వంపై పోరు సాగించేందుకే వంచన దినం పాటిస్తున్నామని పేర్కొన్నారు.
అవాక్కవుతున్న టీడీపీ నేతలు
రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా రుణాల పేరిట మహిళలను, ఉద్యోగాలు, భృతి పేరిట నిరుద్యోగులను చంద్రబాబు వంచనకు గురిచేశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఒక్క హామీ నెరవేర్చకుండా, అన్నీ పూర్తిచేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పడంతో తెలుగుదేశం పార్టీ నేతలే అవాక్కయ్యారని ఎద్దేవాచేశారు. చంద్రబాబు చేస్తున్న వంచనకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జూన్ 2న వంచన దినంగా పాటిస్తోందని చెప్పారు. 2వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్నాచేసి, హామీలు నెరవేర్చని సీఎం చంద్రబాబుపై ఆయా స్టేషన్ల సీఐలకు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు కొలసు పార్థసారథి, వంగవీటి రాధా, పార్టీ నగర వ్యవహారాల ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.