పెద కూరపాడు(గుంటూరు): మా అమ్మను ముగ్గురు వ్యక్తులు చంపారంటూ ఆమె కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. ఓ మహిళను ఆమె భర్త, అత్తమామలు కలసి ఉరేసి చంపారు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే, ఆమె కుమారుడు నిజం చెప్పటంతో దారుణం వెలుగుచూసింది. వివరాలివీ.. రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మకు పెదకూరపాడుకు చెందిన తమ్మిశెట్టి రంగతో పదకొండేళ్ల క్రితం వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు కూడా వెళ్లారు.
ఈ నేపథ్యంలోనే కోటేశ్వరమ్మను భర్త రంగతోపాటు అత్తమామలు శాంతి, వెంకటేశ్వర్లు శనివారం కొట్టి చంపారు. అనంతరం ఇంట్లోనే ఉరివేసి, ఆత్మహత్య చేసుకుందని అందరికీ చెప్పసాగారు. అయితే, కోటేశ్వరమ్మ కుమారుడు మాత్రం.. తన తల్లిని ఆ ముగ్గురూ కలసి కొట్టి చంపారని పోలీసుల ఎదుట వెల్లడించే సరికి అసలు విషయం వెలుగుచూసింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించగా వారు నేరం అంగీకరించారు. వారిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.