తనకల్లు, న్యూస్‌లైన్: మండల కేంద్రంలోని ఇందిరానగర్‌లో సీఆర్ పల్లి పంచాయతీ బంట్రోతుగా పని చేస్తున్న శ్రీరాములు కూతురు అనసూయ్యమ్మ ఇంటిలో శనివారం గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో అతనితో పాటు భార్య నాగమ్మ, మనువళ్లు మూడేళ్ల దేవచరణ్ (చంటి), ఏడాది వయసున్న వినయ్ కుమార్(లడ్డు)కు తీవ్రంగా గాయపడ్డారు. అల్లుడు సూరి స్థానికంగా పనులు లేపోవడంతో బెంగళూరుకు వలస వెళ్లాడు.
ఈ క్రమంలో కూతురు, మనువళ్లను స్వగ్రామంలో జరిగే పీర్ల పండుగకు తీసుకు వెళ్లేందుకు శ్రీరాములు, తన భార్య నాగమ్మతో కలసి తనకల్లు వచ్చాడు. మధ్యాహ్న భోజనం చేసి వెళదామని కూతురు చెప్పడంతో అందరూ ఆగిపోయారు. గ్యాస్ స్టౌ వెలిగించిన అనంతరం ఫోన్ రావడంతో అనసూయమ్మ బయటకు వెళ్లి మాట్లాడుతోంది. అంతలోనే గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలి పోయి మిద్దె కుప్ప కూలి పోయింది. బాధితుల్ని చుట్టు పక్కల వారు మంటలను ఆర్పి శిథిలాల నుంచి బయటకు తీశారు. 108 వాహనంలో కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. కాగా శ్రీరాములుతో సహా ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని, నాగమ్మ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వారి బంధువులు తెలిపారు. దాదాపు రూ.2 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు ఇంటి యజమాని ఖాజీపీర్ చెప్పాడు. ఆర్‌ఐ నవీన్‌కుమార్, వీఆర్‌ఓ లత, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితులను కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలో తహశీల్దార్ కళావతి పరామర్శించారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఆమె చెప్పారు.