పాల్వంచ, న్యూస్‌లైన్: పంటచేలో విద్యుత్ వైరు ఆ అక్కాచెల్లెళ్ల కుటుంబాల్లో చీకట్లను నింపింది. విద్యుదాఘాతానికి గురైన మరిదిని కాపాడబోయి వదినకూడా మృత్యువుపాలు కాగా....వీరి మృతదేహాలవద్దకు వస్తున్న ఆమె కొడుకునూ అదే విద్యుత్‌వైరు బలితీసుకుంది. భర్త లేకపోవడంతో తానే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని సాదుకుంటున్న ఆమె చేలోనే కొడుకుతో సహా ప్రాణాలు కోల్పోవడం, పక్క ఇంట్లో ఉండే చెల్లెలి భర్త కూడా అదే ఘటనలో మృతి చెందడంతో కారేగట్టు గ్రామంలో విషాదం కట్టలు తెంచుకుంది.
పాల్వంచ మండలం కారేగట్టు గ్రామానికి చెందిన మాడే తిరుపతమ్మ(42) భర్త పాపయ్య పదేళ్ల క్రితం మృతి చెందాడు. ముగ్గురు పిల్లల పోషణ భారాన్ని తనపై వేసుకున్న తిరుపతమ్మ తనకున్న ఐదెకరాల చేనును సాగు చేసుకుంటూ పిల్లల్ని సాకుతోంది. తిరుపతమ్మ పెద్ద కుమారుడు నరేష్ చినప్పుడే చదువు మానేసి తల్లితో పొలం పనులు చూసుకుంటుండగా... రెండో కొడుకు మహేష్(22) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. గత రెండు సంవత్సరాలుగా మహేష్ కూడా తల్లితోపాటు చేలో పనులకు వెళుతున్నాడు. కాగా తిరుపతమ్మ మూడో కుమారుడు సురేష్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాగా, మొక్క జొన్న చేను ఏపుగా పెరగడంతో రెండు నెలలుగా అక్కడ మంచె ఏర్పాటు చేసుకున్న మహేష్ చేనుకు కాపలాగా ఉంటున్నాడు.
వెలుగు కోసం పెట్టుకున్న వైరు ప్రాణాలు తీసింది...
మొక్కజొన్న చేలో కాపలా ఉంటున్న మహేష్ మంచె వద్ద రాత్రి పూట లైటు వెలిగించేందుకు పక్కనే ఉన్న విద్యుత్ లైన్ నుంచి జీఏ వైరు సహాయంతో కరెంట్ తీసుకున్నాడు. అయితే మంగళవారం వర్షం రావడంతో జీఏ వైరు కట్టిన గడ (కర్ర)కిందకు వాలిపోయింది. పక్క చేలో వ్యవసాయం చేస్తున్న తిరుపతమ్మ చెల్లెలి భర్త కోరెం లక్ష్మయ్య(45) జీఏ వైరును పొరబాటున పట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అక్కడే ఉండి గమనించిన తిరుపతమ్మ అతనిని రక్షించేందుకు వెళ్లి విద్యుత్‌షాక్‌కు గురైంది. తల్లి, బాబాయిలు చేలో పడిపోయి ఉండటం చూసి వారికి ఏమైందోనని వచ్చిన మహేష్ సైతం కిందపడి ఉన్న వైరుకు తగిలి మృత్యువాతపడ్డాడు. వెలుగులు నింపేందుకు చేలో పెట్టుకున్న విద్యుత్ వైరు ఈముగ్గురి పాలిట మృత్యుపాశమైంది.
విషాదంలో కారేగట్టు...
తమ గ్రామానికి చెందిన ముగ్గురు విద్యుత్‌షాక్‌కు గురై ఒకేసారి మరణించడంతో కారేగట్టు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నా యి. కాయకష్టం చేస్తూ తమను సాకుతున్న తల్లి, సోదరుడు మృత్యువాతపడటంతో నరేష్, సురేష్‌లు చేసే రోదన చూసి అక్కడున్న వారు కంటతడిపెట్టారు. మరోవైపు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కోరెం లక్ష్మయ్య మృతి చెందడంతో భార్య వెంకటనర్సమ్మ, కుమారులు రాజశేఖర్, నాగేంద్రబాబు, కూతురు నాగలక్ష్మి రోదన అంతాఇంతా కాదు. గ్రామానికి చెందిన వారంతా దగ్గరి బంధువులు కావడంతో అంతా మృతదేహాల వద్దకు చేరుకుని శోకంలో మునిగిపోయారు.
మృతదేహాలను సందర్శించిన పలువురు నాయకులు...
కారేగట్టు గ్రామంలో జరిగిన విద్యుత్ ప్రమాదం విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, మండల కన్వీనర్ పిట్టల వెంకటనర్సయ్య గ్రామానికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబీకులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన సమాచారం తెలుసుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అక్కడకు చేరుకుని మృతదేహాలను సందర్శించారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.
ముగ్గురిని బలితీసుకున్న విద్యుత్ వైరు
Published Wed, Oct 2 2013 3:41 AM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM
Advertisement
Advertisement