ఒక్కో సీటుకు ముగ్గురు
వైద్య కళాశాలల్లో పీజీ సీట్లకు తీవ్ర పోటీ
ప్రభుత్వ, ప్రైవేటులలో కలిపి అందుబాటులో ఉన్న సీట్లు 2,431
ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన వారు 8,100 మంది ఏప్రిల్ మూడో వారం నుంచి కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా పీజీ వైద్యవిద్య సీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. పీజీ వైద్య విద్య ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్యను బట్టి ఒక్కో సీటుకు ముగ్గురికిపైగా పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో 1,139 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో 1,292 సీట్లు మొత్తంగా 2,431 పీజీ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత వైద్య మండలి (ఎంసీఐ) బృందాలు వైద్య కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నందున మరికొన్ని సీట్లు పెరిగేందుకు లేదా కోత పడేందుకు అవకాశముంది. అయితే, ఈ ఏడాది పీజీ వైద్య ప్రవేశ పరీక్షకు 14వేల మందికి పైగా హాజరుకాగా.. 8,100 మంది (57.5 శాతం) మాత్రమే అర్హత సాధించారు.
యాజమాన్య కోటా సీట్లు 646: ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 50% సీట్లు అంటే 646 పీజీ సీట్లను యాజమాన్య కోటా కింద యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి. కౌన్సెలింగ్ నాటికి ఈ సీట్ల సంఖ్య మరికొంత పెరిగే వీలుంది. ప్రైవేటు కళాశాలల్లోని మిగతా సీట్లను, ప్రభుత్వ కళాశాలల్లోని సీట్లను మొత్తంగా 1,825 సీట్లను కన్వీనర్ కోటాకింద భర్తీ చేస్తారు. ఈ లెక్కన చూస్తే ఒక్కో సీటుకు నలుగురుపైనే పోటీపడుతున్నారు.
ఆర్థో, రేడియాలజీకి డిమాండ్: పీజీ వైద్య విద్యలో ఆర్థోపెడిక్, రేడియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, డెర్మటాలజీ సీట్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఓపెన్ కేటగిరీలో మంచి ర్యాంకు వస్తేగానీ సీటు దక్కే పరిస్థితి లేదు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ విభాగాలపై మొగ్గుచూపట్లేదు.
ఏప్రిల్ మూడో వారం నుంచి కౌన్సెలింగ్: పీజీ వైద్య సీట్లకు తొలి విడత కౌన్సెలింగ్ ఏప్రిల్ 3వ వారం నుంచి ప్రారంభమవుతుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రవిరాజు చెప్పారు. మే 30 నాటికి ప్రక్రియ ముగియాల్సి ఉన్నా.. దానిని జూన్ 15 వరకూ పొడిగించామన్నారు. ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న ఏఎఫ్‌ఆర్సీ సమావేశంలో ఫీజులను నిర్ణయిస్తారని తెలిపారు.