ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రబీ సీజన్‌లో కరువు మండలాలను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 228 మండలాలను తీవ్రమైన కరువు మండలాలుగా ప్రకటించగా అందులో ప్రకాశం జిల్లాలో 40 మండలాలు ఉన్నాయి. తీవ్రమైన కరువు జిల్లాల్లో ప్రకాశం రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. వైఎస్సార్ కడప జిల్లా 43 తీవ్ర కరువు మండలాలతో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ప్రకాశం 40, చిత్తూరులో 37, కర్నూలు 33, అనంతపురం 32, విజయనగరంలో 22 మండలాలలో తీవ్రమైన కరువు ఉన్నట్లు ప్రకటించారు.
విశాఖపట్నం జిల్లా ఒకమోస్తరు కరువు ఉన్నట్లు 29 మండలాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డి.వరప్రసాదు బుధవారం జీఓ ఎంఎస్ నంబర్–2 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఖరీఫ్ సీజన్‌లో ప్రకాశం జిల్లాలోని మొత్తం 56 మండలాలనుకరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం రబీలో ఏం వర్షాలు పడి పంటలు పండాయో గాని 16 మండలాలను తాజా జాబితాలో చేర్చలేదు. వర్షపాతం కూడా పూర్తి లోటుగా ఉన్నా కరువు మండలాల ప్రకటనలో మాత్రం ప్రభుత్వం పూర్తి అధ్యయనం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో కరువు మండలాలు ఇవే..
అద్దంకి, అర్ధవీడు, బేస్తవారిపేట, సీఎస్ పురం, చీమకుర్తి, కంభం, దొనకొండ, పెదదోర్నాల, గిద్దలూరు, హనుమంతునిపాడు, గుడ్లూరు, లింగసముద్రం, కొనకనమిట్ల, కారంచేడు, కొమరోలు, కనిగిరి, కొండపి, కొరిశపాడు, కొత్తపట్నం, మార్కాపురం, మర్రిపూడి, మార్టూరు, ఒంగోలు, పామూరు, పెద్దారవీడు, పీసీపల్లి, పొదిలి, పొన్నలూరు, పుల్లలచెరువు, సంతనూతలపాడు, సింగరాయకొండ, రాచర్ల, టంగుటూరు, తర్లుపాడు, తాళ్ళూరు, ఉలవపాడు, వెలిగండ్ల, వలేటివారిపాలెం, యద్దనపూడి, యర్రగొండపాలెం.
Comments
Please login to add a commentAdd a comment