ఆర్టీసీ కార్మికులకు నూతన వేతనాలు అందించేందుకు సోమవారం అధికారిక ఒప్పందం జరిగింది. దీంతో ఆగస్టు 1న 43 శాతం
అధికారిక ఒప్పందం
పత్రాల్ని ఈయూ నేతలకు అందించిన సంస్థ ఎండీ
ఆగస్టు 1న ఫిట్‌మెంట్‌తో కూడిన వేతనాలు
కాంట్రాక్టు కార్మికులకు
43 శాతం ఫిట్‌మెంట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు నూతన వేతనాలు అందించేందుకు సోమవారం అధికారిక ఒప్పందం జరిగింది. దీంతో ఆగస్టు 1న 43 శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన కొత్త జీతాలు ఆర్టీసీ ఉద్యోగులకు అందనున్నాయి. వేతన సవరణకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘంతో గత నెల 13న కుదిరిన ఒప్పందం ప్రకారం కొత్త వేతన సవరణను ఆర్టీసీ ప్రకటించింది. కాంట్రాక్టు కార్మికులకు కూడా 43 శాతం ఫిట్‌మెంట్ వర్తించనుంది. కాంట్రాక్టు డ్రైవరుకు రూ. 6,519, కండక్టరుకు రూ. 5,966 జీతం పెరుగుతుంది. వీరందరినీ దశల వారీగా క్రమబద్ధీకరించనున్నారు.
కాగా, సవరించిన వేతన స్కేలు 2013, ఏప్రిల్ నుంచి అమలు కానుంది. కొత్త పే స్కేల్స్, సర్వీసు నిబంధనలు, అలవెన్సులకు సంబంధించిన ఒప్పంద పత్రాన్ని బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్ నేతలకు అందించారు. ఈ ఒప్పంద పత్రాలపై ఎండీ సాంబశివరావు, ఈయూ నేతలు సంతకాలు చేశారు. పెండింగ్ సమస్యలను సెప్టెంబరు నెలాఖరు నాటికి పరిష్కరించేందుకు అంగీకారం కుదిరింది. అలవెన్సులకు కేటాయించిన రూ. 18 కోట్లు గుర్తింపు సంఘం ఇచ్చిన ప్రతిపాదనల మేరకు త్వరలో అమలు చేయనున్నారు. ఈ అలవెన్సులు ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి.
ఆర్టీసీ యాజమాన్యంతో కుదిరిన ఒప్పందాలు..
స్టాఫ్ రిటైర్‌మెంటు బెనిఫిట్ స్కీంకు యాజమాన్యం వాటా రూ. 6 కోట్లు, అలవెన్సులకు రూ. 18 కోట్లు మంజూరు
ఆర్టీసీలో మరో కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పెట్టేందుకు అంగీకారం
విజయవాడలో ఆర్టీసీ కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం
అన్ని పట్టణాల్లో దూర ప్రాంత డ్రైవర్లకు ఎ.సి. రెస్ట్ రూంల ఏర్పాటు
సెక్యూరిటీ కానిస్టేబుల్‌కు కండక్టర్ స్కేలు, హెడ్‌కానిస్టేబుల్‌కు అసిస్టెంట్ డిపో క్లర్కు స్కేలుతో సమానంగా మార్పులు
మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం
ప్రధాన పట్టణాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు తక్కువ రేట్లకు కోఆపరేటివ్ స్టోర్స్ ద్వారా సరుకుల పంపిణీ