జీతాలతో అలవెన్స్‌లు కలపకూడదని ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నైట్ డ్యూటీ అలవెన్స్‌లు, టీఏ, ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్‌లను జీతాల బిల్లులతో కలిపి ఇవ్వకూడదని నిర్ణయించింది. దాంతో రాష్ట్రంలోని దాదాపు 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతిననున్నాయి. తమకు జీతాలతోపాటే నైట్ డ్యూటీ అలవెన్స్‌లు, టీఏ, ఇతర అలవెన్స్‌లు చెల్లించాలని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే నిధుల కొరత లేదా ఇతర కారణాలతో అలవెన్స్‌లు ఏళ్ల తరబడి చెల్లించేవారు కాదు.
ఉద్యోగ సంఘాల కోరిక మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ అంశంపై కూడా సానుకూలంగా స్పందించింది. అలవెన్స్‌లను కూడా గ్రేడ్–1 ఉద్యోగులకు రూ.600 నుంచి రూ.800కు, గ్రేడ్–2 ఉద్యోగులకు రూ.400 నుంచి రూ.600కు, గ్రేడ్–3 ఉద్యోగులకు రూ.300 నుంచి రూ.400కు పెంచింది. ఆ అలవెన్స్‌లను జీతాల బిల్లులతోపాటే ఆమోదించి ప్రతి నెలా జీతాలతోపాటే చెల్లించాలని నిర్ణయించింది. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డ్రైవర్లు, కండక్టర్లకు జీతాలతోపాటు అలవెన్స్‌లను కూడా చెల్లిస్తూ వచ్చారు.
కాగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించింది. ఆగస్టు నెల జీతాల బిల్లులతో నైట్‌డ్యూటీ అలవెన్స్‌లు, టీఏలు, ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్‌లను కలపవద్దని విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు షాక్‌కు గురయ్యారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో తమకు అలవెన్స్‌లు ఏళ్లకు ఏళ్లు పెండింగులో ఉండే విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అదే పరిస్థితి పునరావృతమయ్యేలా ఆందోళన చెందుతున్నారు.
నేడు నిరసన
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని డిపోల్లో ఉద్యోగులు ఈ నెల 30న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని నిర్ణయించాం. నిరసన ప్రదర్శన నిర్వహిస్తాం. రిటైరైన ఉద్యోగులకు సకాలంలో సెటిల్మెంట్ చేయకుండా ట్రెజరీ శాఖ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఈ అంశంపై కూడా నిరసన తెలుపుతాం. – పీవీ రమణారెడ్డి, అధ్యక్షుడు, – వై.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి, నేషనల్ మజ్దూర్ యూనియన్
Comments
Please login to add a commentAdd a comment