‘అంబా’ అంటే అరణ్యరోదనే.. | 45 Livestock posts of doctors, hospitals, empty | Sakshi
Sakshi News home page

‘అంబా’ అంటే అరణ్యరోదనే..

Published Sun, Feb 2 2014 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

45 Livestock posts of doctors, hospitals, empty

సాక్షి, కాకినాడ :‘మనసు మూగదే గానీ బాసున్నది దానికి..’ ఇది ‘మూగమనసులు’ సినిమా కోసం ‘మనసు’ కవి ఆత్రేయ విరచించిన అజరామర గీతంలోని ఓ పంక్తి. మూగదైన మనసుకే కాదు.. మూగజీవాలకూ భాష ఉంటుంది. అక్షరరూపం లేనంత మాత్రాన.. అది భాష కాకుండా పోదు. వినగలిగే మనసుంటే.. వాటి అరుపుల్లోనే.. ఆర్తితో ఒకలా.. ఆనందంతో మరోలా, ఆకలితో ఇంకోలా.. ఇలా అనేక అవస్థాభేదాలు వినిపిస్తాయి. మనుషుల గోడే పట్టని మన సర్కారుకు.. ఇక మూగజీవుల రోగబాధలు ఏమి వినిపిస్తాయి? అదిగో.. ‘ఇదీ బాధ’ అని చెప్పుకోలేని ఆ జీవుల పట్ల అవధి లేని ప్రభుత్వ అలసత్వానికి అద్దం పడుతోంది జిల్లాలో పశువైద్యశాలల దుస్థితి.
 
 జిల్లాలోని పశువుల ఆస్పత్రుల్లో మూడోవంతు.. వైద్యుల్లేక ‘వట్టిపోయిన గొడ్ల’ మాదిరి నిరుపయోగంగా ఉన్నాయి. ఇక మిగిలిన ఆస్పత్రులు ఎప్పుడు పనిచేస్తాయో, ఎప్పుడు మూసి ఉంటాయో ఆ దేవుడికే ఎరుక. వైద్యులే కాదు.. పై నుంచి కింద వరకు అన్ని స్థాయిల సిబ్బంది పోస్టుల్లో ఎన్నో ఖాళీలున్నాయి. వీటికి తోడు సరైన సదుపాయాలు, మందులు లేక గ్రామాల్లో పశువైద్యం అందని ద్రాక్షగా మారిపోయింది. ప్రస్తుతం పశుసంవర్ధక శాఖనూ నిర్వర్తిస్తున్న మంత్రి తోట నరసింహం ప్రాతినిధ్యం వహిస్తున్న జగ్గంపేట నియోజకవర్గంలోనూ పరిస్థితి తీసికట్టుగానే ఉంది.
 జిల్లాలో ఒక వెటరినరీ పోలీ క్లినిక్ సహా 15 ఆస్పత్రులు, 143 డిస్పెన్సరీలు, 76 గ్రామీణ పశు వైద్యశాలలు (రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్స్) ఉన్నాయి. జిల్లా, రీజనల్, రాష్ర్ట స్థాయి ట్రైనింగ్ సెంటర్లు కూడా జిల్లాలో ఉన్నాయి.
 
 ఈ వైద్యశాలల పరిధిలో సుమారు 15 లక్షలకుపైగా పశుపక్ష్యాదులుండగా వీటిలో 10లక్షల వరకు పశువులు, 4 లక్షల వరకు గొర్రెలు, మేకలు, మరో లక్ష ఇతర జీవులు ఉన్నాయి. జిల్లా స్థాయిలో కాకినాడలో పోలీ క్లినిక్ ఉంది. వెటరినరీ ఆస్పత్రుల్లో ఏడీ స్థాయి వైద్యాధికారులు,  డిస్పెన్సరీల్లో అసిస్టెంట్ సర్జన్లు, రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్లలో లైవ్‌స్టాక్ ఆఫీసర్లు, లైవ్ స్టాక్ అసిస్టెంట్లు ఉండాలి. జిల్లా 159 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు ఉండాల్సి ఉండగా 114 మంది  మాత్రమే ఉన్నారు. దీంతో 45 వరకు డిస్పెన్సరీల్లో వైద్యుల్లేని పరిస్థితి నెలకొంది. 18 మంది వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్లకు 15 మంది, 37 మంది జూనియర్ వెటరినరీ ఆఫీసర్లకు 34 మంది ఉన్నారు. గ్రామీణ పశు వైద్యశాలల్లో కీలకపాత్ర పోషించే లైవ్‌స్టాక్ అసిస్టెంట్లు 61 మంది ఉండాల్సి ఉండగా కేవలం 25 మంది మాత్రమే ఉన్నారు. 125 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు 102 మందే ఉన్నారు.
 
 పరిపాలనా పోస్టులదీ అదే స్థితి..
 ఇక పరిపాలనాపరంగా చూస్తే నాలుగు డిప్యూటీ డెరైక్టర్ పోస్టులకు ఒక పోస్టు, 122 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 67 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 12మంది సీనియర్ అసిస్టెంట్లకు 10 మంది ఉన్నారు. ఉన్న ఒకే ఒక్క స్టెనో పోస్ట్ ఖాళీగా ఉంటే, ఏడుగురు టైపిస్ట్‌లకు ముగ్గురే ఉన్నారు. ఏడు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో నాలుగు ఖాళీగా ఉన్నాయి. టైపిస్ట్ కమ్ క్లర్క్ పోస్టులు మూడూ ఖాళీగానే ఉన్నాయి. ఒక్కొక్కరు ఉండాల్సిన లైబ్రేరియన్, రిఫ్రిజిరేటర్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. త్వరలో వెటరినరీ అసిస్టెంట్లకు లైవ్‌స్టాక్ సూపర్‌వైజర్లుగా పదోన్నతి కల్పించనున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఇబ్బందులు తలెత్తనున్నాయి.
 
 మంజూరే.. భర్తీ లేదు
 గతేడాది 400కు పైగా వెటరినరీ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం వాటి భర్తీకి చర్యలు  మాత్రం చేపట్టలేదు. దీంతో వైద్యుల కొరత వెన్నాడుతోంది. ప్రతి ఐదు వేల పశుపక్ష్యాదులకూ ఒక లైవ్‌స్టాక్ యూనిట్, 10 వేలకు ఒక ఆస్పత్రి ఉండాల్సి ఉన్నా ఎక్కడా ఆ పరిస్థితి లేదు. డిస్పెన్సరీలతో పాటు రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లను కూడా పశువుల ఆస్పత్రి స్థాయికి పెంచాలన్న ప్రతిపాదనలు వైద్యుల కొరత కారణంగా కార్యరూపం దాల్చడం లేదు. గతేడాది 40 లైవ్ స్టాక్ యూనిట్ల స్థాయిని పెంచినా ఆ స్థాయిలో వైద్యుల నియామకం మాత్రం జరగలేదు. ఇప్పటికైనా వైద్యుల కొరతను తీర్చడంతో పాటు ఈ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేయాలని రైతాంగం కోరుతోంది.
 
 రెండేళ్లుగా వైద్యుడు లేని ప్రధాన ఆస్పత్రి
 మండల కేంద్రమైన అంబాజీపేట ప్రధాన పశువుల ఆస్పత్రిలో రెండేళ్ల నుంచి వైద్యుడు లేరు. ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న అవిడి వైద్యుడు ఎప్పుడు వస్తారో తెలియక  రైతులు ఇబ్బందులెదుర్కొంటున్నారు. పూర్తిస్థాయి వైద్యుడిని నియమించడంతో పాటు అసంపూర్తిగా ఉన్న పశువైద్యశాల నూతన భవనాన్ని పూర్తిస్థాయిలో నిర్మించాలి.
 - ముత్యాలు జమ్మీలు, పోతాయిలంక
 ఉసురు పోసుకుంటున్నామనిపిస్తోంది..
 వరద సమయాల్లో పశువులు రోగాల బారిన పడుతున్నాయి. ఆ సమయంలో కనీసం వైద్యం చేసే నాథుడు లేక పశువుల ప్రాణాలు గాలిలో కలిసి రైతులు నష్టపోవడంతో పాటు వాటి ఉసురు పోసుకుంటున్నామని మనేద పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా వీరవల్లిపాలెం లైవ్ స్టాక్ యూనిట్లో వైద్యులను నియమించాలి.
 - అడపా రాజు, వీరవల్లిపాలెం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement