
కళ్లలో కారం చల్లి 6 రౌండ్ల కాల్పులు
నల్లగొండ: మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడు, టీఅర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోనపురి రాములును హత్య చేసిన దుండగులు కళ్లలో కారం చల్లి ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు గన్మేన్ చెప్పారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పర్వతాలు కుతురు వివాహానికి వెళ్లిన రాములుని ఎంఏ బేగ్ ఫంక్షన్ హాల్లో హత్య చేసిన విషయం తెలిసిందే.
మొత్తం 10 మంది వచ్చి కాల్పులు జరిపినట్లు గన్మేన్ చెప్పారు. కళ్లల్లో కారం చల్లేసరికి తమకేమీ తెలియలేదన్నారు. తాము కళ్లు తెరిచి చూసేసరికి అంతా అయిపోయిందని చెప్పారు. ఫంక్షన్ హాల్ బయటే పొదల్లో మాటువేసిన దుండుగులు దగ్గర నుంచే కాల్చి చంపారు. కాల్పుల్లో రాములు ఛాతీ, పొట్టలోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి.
మాజీ మావోయిస్ట్ అయిన రాములుపై గతంలో అనేక సార్లు హత్యాయత్నం జరిగింది. దాంతో నయాం గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు నెలల క్రితం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేటలో రాములు ఇంటి వద్ద నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహీం అనుచరుల నుంచి రాములకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చినట్లు తెలిసింది.
మావోయిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటి కార్యదర్శిగా పనిచేన సాంబశివుడు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. ఆ తరువాత అతను లొంగిపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా ఉన్నారు. రెండేళ్ల క్రితం కొందరు దుండగులు ఆయనను నల్గొండ జిల్లా గోకారం గ్రామ సమీపంలో హత్య చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు రాములుని కూడా కాల్చిచంపారు. వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెంకు చెందిన మాజీ మావోయిస్టులైన అన్నదమ్ములు ఇద్దరూ హత్యకు గురికావడం విచారకరం.