63 పేజీలు, 13 షెడ్యూళ్లు | 63 pages.. 13 schedules | Sakshi
Sakshi News home page

63 పేజీలు, 13 షెడ్యూళ్లు

Published Tue, Dec 17 2013 5:25 AM | Last Updated on Sat, Mar 9 2019 4:19 PM

63 pages.. 13 schedules

=ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు స్వరూపం
 =పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా జీహెచ్‌ఎంసీ పరిధి


ఉన్నత, సాంకేతిక, వైద్యవిద్య ప్రవేశాలకు పదేళ్ల పాటు ప్రస్తుత విధానమే  పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా  ఇరు రాష్ట్రాల్లో రిజర్వ్‌డ్ నియోజకవర్గాల పునర్విభజన  గోదావరి, కృష్ణా జలాల నిర్వహణకు సర్వోన్నత మండళ్లు  కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్, ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులు  ప్రాజెక్టుల అజమాయిషీకి 2 నదులకు వేర్వేరు బోర్డులు  కృష్ణా బోర్డు ఏపీలో, గోదావరి బోర్డు తెలంగాణలో  వాటి చైర్మన్లు, సభ్యులను నియమించేది కేంద్రమే
 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 సోమవారం అసెంబ్లీకి చేరింది. 13 షెడ్యూళ్లతో కూడిన ఈ 63 పేజీల బిల్లులో కేంద్ర కేబినెట్‌కు కేంద్ర మంత్రుల బృందం ప్రతిపాదించిన ముసాయిదా బిల్లులోని వివరాలే కొన్ని చిన్న సవరణలు మినహా యథాతథంగా ఉన్నాయి. ముసాయిదా బిల్లులో తెలంగాణలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలను పొందుపరచలేదు. వాటిని తాజా బిల్లులో చేర్చారు. అలాగే హైదరాబాద్‌లోని ఉన్నత, సాంకేతిక, వైద్య విద్యల్లో సీమాంధ్రులకు ఐదేళ్ల పాటు అవకాశాలను కల్పిస్తామని ముసాయిదాలో పేర్కొనగా కేబినెట్ నిర్ణయం తర్వాత దాన్ని పదేళ్లకు పెంచారు. ముసాయిదాలోని మిగతా అంశాలన్నిటినీ యథాతథంగా బిల్లులో పొందుపరిచారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి...

= గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధి పదేళ్లకు మించకుండా ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు చట్టం రూపు దాల్చిన తర్వాత 45 రోజులకు మించకుండా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై నిపుణుల కమిటీ సిఫార్సులు చేస్తుంది.
=ప్రస్తుత గవర్నరే ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తారు. ఆయన పదవీ కాల పరిమితిని రాష్ట్రపతి
 నిర్ణయిస్తారు.
=ఉమ్మడి రాజధానిలో నివసించే వారి ప్రాణ, ఆస్తి, స్వేచ్ఛ, భద్రత తదితరాలను కాపాడే ప్రత్యేక బాధ్యత గవర్నర్‌దే. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలిని సంప్రదించి, తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది. దాన్ని ప్రశ్నించేందుకు వీల్లేదు. కేంద్రం నియమించిన ఇద్దరు అధికారులు గవర్నర్‌కు సలహాదారులుగా ఉంటారు.
=ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్‌గా ఉంటారు. తెలంగాణ రాష్ట్ర స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోవాలి.
=ఇరు రాష్ట్రాలకు శాసనమండలి కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ మండలిలో గరిష్టంగా 50 మంది, తెలంగాణ మండలిలో గరిష్టంగా 40 మంది సభ్యులుంటారు.
=ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ అసెంబ్లీ స్థానాలను నిర్ణయించేందుకు ఇరు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనను ఎన్నికల సంఘం చేపడుతుంది
=ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు చేసేదాకా ప్రస్తుత హైకోర్టు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉంటుంది
=జనాభా ప్రాతిపదికన రాష్ర్టం వెలుపలి ఆస్తుల పంపకం
=జనాభా ప్రాతిపదికనే పింఛన్ల భారం పంపకం
=ఐఏఎస్ సహా అఖిల భారత సర్వీసులకు ఇరు రాష్ట్రాలకు రెండు ప్రత్యేక కేడర్లు
=ఉద్యోగుల స్థానిక, జోనల్ వ్యవస్థ కొనసాగుతుంది. ఈ కేటగిరీలో ఎక్కడి ఉద్యోగులక్కడే

= ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటయ్యేదాకా అక్కడి అవసరాలను రాష్ట్రపతి ఆమోదంతో యూపీఎస్సీ తీరుస్తుంది.

= గోదావరి, కృష్ణా జలాల నిర్వహణ కోసం సర్వోన్నత మండళ్ల ఏర్పాటు. కేంద్ర జలవనరుల మంత్రి చైర్‌పర్సన్‌గా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. నదీ జలాలు, ఇతర విషయాల పరిశీలనకు గోదావరి, కృష్ణాలపై వేర్వేరుగా నిర్వహణ బోర్డుల ఏర్పాటు. గోదావరి బోర్డు తెలంగాణ పరిధిలో, కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ పరిధిలో పని చేస్తాయి. ఈ బోర్డులకు చైర్మన్‌ను, సభ్యులను కేంద్రమే నియమిస్తుంది. రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, వాటి నుంచి నీటి విడుదల తదితరాలు ఈ బోర్డుల అజమాయిషీలో ఉంటాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టే వాటికి సంబంధించి కూడా ఈ బోర్డే నిర్ణయం తీసుకుంటుంది.

=పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా
=ఎక్కడి ప్రాంత విద్యుత్ ప్రాజెక్టులు వారికే. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) కొనసాగింపు. సీమాంధ్రలోని మిగులు విద్యుత్‌పై పదేళ్ల పాటు తెలంగాణకే మొదటి తిరస్కార హక్కు (అంటే తొలుత తెలంగాణకు ఇవ్వజూపి, వద్దంటేనే ఇతర రాష్ట్రాలకు విక్రయించాలి)
=ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, మండలితో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయం
=ఉన్నత, సాంకేతిక, వైద్య విద్యలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ కాలేజీల్లోనూ ప్రస్తుతమున్న అడ్మిషన్ల కోటా పదేళ్లపాటు యథాతథం
=ఇరు రాష్ట్రాలకు 371డి వర్తింపు

 ఏ షెడ్యూల్‌లో ఏముందంటే...
 బిల్లులో మొత్తం 13 షెడ్యూళ్లున్నాయి. వాటి వివరాలు...
 1వ షెడ్యూల్: రాష్ట్రంలోని రాజ్యసభ సభ్యుల వివరాలు
 2వ షెడ్యూల్: తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ నియోజకవర్గాల వివరాలు
 3వ షెడ్యూల్: విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్‌లోని శాసనమండలి నియోజకవర్గాల వివరాలు
 4వ షెడ్యూల్: సమైక్య రాష్ట్రంలోని శాసనమండలి సభ్యుల వివరాలు
 5వ షెడ్యూల్: తెలంగాణలోని ఎస్సీ కులాల జాబితా
 6వ షెడ్యూల్: తెలంగాణలోని ఎస్టీ కులాల జాబితా
 7వ షెడ్యూల్: సమైక్య రాష్ట్రంలోని మొత్తం 41 రకాల నిధుల వివరాలు
 8వ షెడ్యూల్: ఉద్యోగుల పింఛన్ల బాధ్యత పంపిణీ
 9వ షెడ్యూల్: ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల వివరాలు
 10వ షెడ్యూల్: 42 శిక్షణ సంస్థలు/కేంద్రాల వివరాలు
 11వ షెడ్యూల్: నదీ జలాల నిర్వహణ బోర్డులు, విధి విధానాలు
 12వ షెడ్యూల్: బొగ్గు, ఇంధన, విద్యుత్ ప్రాజెక్టుల పంపిణీ
 13వ షెడ్యూల్: విద్య, మౌలిక సదుపాయాల వివరాలు

 రాష్ట్రపతి లేఖలో ఉన్నదిదీ..!
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును అసెంబ్లీకి పంపుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాసిన లేఖలో ఏముంది.? అందులో ఆయన ఏం పేర్కొని ఉంటారు? ఆసక్తికరమైన ఆ లేఖను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం సభ ముందుంచారు. రాష్ట్రపతి లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది...

 ‘‘కేంద్ర ప్రభుత్వం స్టేక్ హోల్డర్లందరితో అన్ని అంశాలపై విస్తృతస్థాయిలో సంప్రదింపుల అనంతరం, రాష్ట్ర విభజనకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరవాత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్ల్లు-2013లో తెలంగాణ రాష్ట్ర సమాచారాన్ని తత్సంబంధిత అంశాలతో సాధ్యమైనంత త్వరలో ఆచరణాత్మకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంది.

 ఈ ప్రతిపాదిత బిల్లుతో కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులు ప్రభావితం కానున్నాయి. భారత రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం ఈ ప్రతిపాదిత ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్ల్లు-2013’పై రాష్ట్ర శాసనసభ 2014 జనవరి 23 లోగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని కోరుతున్నాను’’

 ఏడాది వరకే ఉమ్మడి ఉన్నత విద్యామండలి
 సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు పదేళ్లకు మించకుండా ఉన్నత విద్యలో ఉమ్మడి ప్రవేశాలు కల్పించాలని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు.. ఒక ఏడాది వరకు ఉన్నత విద్యామండలి రెండు రాష్ట్రాలకు సేవలు అందిస్తుందని పేర్కొంది. ఏడాదివరకు లేదా రెండు రాష్ట్రాలు అంగీకరించిన వ్యవధి వరకు ప్రస్తుత ఉన్నత విద్యామండలి, ఇంటర్మీడియెట్ బోర్డు, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి తదితర సంస్థలు రెండు రాష్ట్రాలకు సేవలు అందించాలని పేర్కొంది. అయితే పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాలు, ఉమ్మడి ప్రవేశపరీక్షలు ఉండాలనే నిబంధన ఉన్న కారణంగా రెండు రాష్ట్రాలు కలిపి ప్రవేశపరీక్షల నిర్వహణకు, ప్రవేశాల కల్పనకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని నెలకొల్పే అవకాశం ఉంది.

 చెరో గిరిజన విశ్వవిద్యాలయం..
 కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ-బోధనాసుపత్రి ఏర్పాటుచేయడంతో పాటు రెండు రాష్ట్రాల్లో చెరో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయనున్నట్టు బిల్లులో పేర్కొంది. అలాగే తెలంగాణలో ఒక హార్టికల్చరల్ వర్సిటీ ఏర్పాటవుతుందని తెలిపింది. కానీ ఈ వర్సిటీని ఎవరు ఏర్పాటు చేస్తారో పేర్కొనలేదు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement