65వ రోజు ఉవ్వెత్తున ఎగిసిన నిరసన | 65th day of united andhra protest | Sakshi
Sakshi News home page

65వ రోజు ఉవ్వెత్తున ఎగిసిన నిరసన

Published Fri, Oct 4 2013 3:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM

65th day of united andhra protest

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్:
 సమైక్య రాష్ట్రం కోసం  జిల్లా వాసులు చేస్తున్న ఉద్యమం కట్టలు తెచ్చుకుంది. 65 రోజులుగా విధులు బహిష్కరించి, జీతాలు  లేకుండా  శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న వివిధ వర్గాలకు చెందిన  నిరసనకారులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు.  గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తెలంగాణ నోట్ తయారైందన్న వార్తను విన్న నిరసనకారులు ఒక్కసారిగా తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు అలసత్వం వల్లనే రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితి దాపురించిందంటూ వారి ఇళ్లను ముట్టడించటంతో పాటు వారి తీరును తూర్పారబట్టారు. రాత్రి వరకు తమ పట్టును వీడకుండా నిరసనకారులు ఆందోళన కొనసాగించారు. ప్రధానంగా జిల్లాలో కుటుంబ పాలన సాగిస్తున్న బొత్స సోదరులకు జీవిత కాలం రాజకీయ నిషేధం విధించటంతో పాటు, జిల్లా నుంచి వారిని బహిష్కరించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ విషయంలో జిల్లా ప్రజలంతా సమిష్టిగా  ఉండాలని విజ్ఞప్తిచేశారు. విశాలాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునివ్వటంతో పాటు మంత్రి బొత్స ఇంటి ముట్టడికి తరలిరావాలని పిలుపునిచ్చారు.
 
 సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు జిల్లాలో ఎంపీ ఇళ్ల ముందు చేపటి ్టన 48 గంటల వంటా వార్పు   విజయనగరంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వివిద ఉద్యోగ సంఘాల నేతృత్వంలో ఉదయం 8 గంటలకే  మంత్రి బొత్స ఇంటి వద్దకు చేరుకున్న ఉద్యమకారులు 11 గంటల సమయంలో  తెలంగాణ నోట్ తయారైందన్న వార్త తెలుసుకుని  నిరసనను ఉధృతం చేశారు.  మంత్రి ఇంటిని  ముట్టడించేందుకు యత్నించగా అప్పటికే మోహరించిన పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. అయినా వెనక్కి తగ్గని ఉద్యమకారులు 12 గంటల సమయంలో ఒక్కసారిగా  బారీకేడ్లను, పోలీసులను  తోసుకుని మంత్రి ఇంటి  వద్దకు చేరుకుని  పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ ఘటనలో పోలీసులు, నిరసకారులు మధ్య జరిగిన తోపులాటలో  మొత్తం  ఐదుగురు ఉద్యమకారులకు స్వల్ప గాయాలయ్యాయి. గరివిడిలో  బొత్స క్యాంపు కార్యాలయాన్ని  ఉపాధ్యాయులు, విద్యార్థులు ముట్టడించారు. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య  క్యాంప్ కార్యాలయ ముట్టడి యత్నించిన ఉద్యోగులు, విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యానికి దిగటంతో  ప్రతిఘటించిన నిరసనకారులు  క్యాంప్ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. అంతేకాకుండా కురుపాంలో కేంద్రమంత్రి కిషోర్‌చంద్రదేవ్ ఇంటిని వేల మంది సమైక్యవాదులు ముట్టడించి జేఏసీ పిలుపు మేరకు వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. జోరు వానలోను  ఉద్యమస్ఫూర్తితో ముందుకు కదిలారు.  ఈ నేపథ్యంలో మంత్రి ఇంట్లోకి నిరసనకారులు వెళ్లేందుకు యత్నించగా  కొద్దిపాటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 
 65వ రోజు మిన్నంటిన నిరసనలు
 విజయగనరంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పట్టణంలో కళాజాత నిర్వహించా రు. ఇందులో భాగంగా గంగిరెద్దులు, తప్పెటగుళ్లు, బుఱ్ఱకథ కళాకారులచే పట్టణంలోని అన్ని ప్రధాన జంక్షన్‌లలో ప్రదర్శనలు నిర్వహించి  విభజన వలనే కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. విశాలాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రం రూపొందిం చిన తెలంగాణ నోట్‌ను వ్యతిరేకిస్తూ మంత్రి బొత్స ఇంటి ముందు సోనియా, దిగ్విజయ్, షిండే , బొత్స, కేసీఆర్  దిష్టిబొమ్మలను దహనం చేశారు.  మున్సిపల్ ఉద్యోగులు గంటస్తంభం వద్ద నిరసన చేయగా... వైద్య ఉద్యోగులు మొక్కలు నాటుతూ నిరసన వ్యక్తం చేశారు. చీపురుపల్లిలోని మూడురోడ్ల జంక్షన్‌లో పట్టణంలోని కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్జీఓ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించి విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. నెల్లిమర్ల మండల కేంద్రం లో  నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది.  నగర పంచాయితీ పరిధిలోని ప్రధాన కూడళల్లో  బ్యాండు పార్టీలతో ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని  సమైక్యవాదులపై పోలీసుల దాడికి నిరసనగా జేఏసీ నేతలు తీవ్రంగా స్పందించారు.  విజయనగరం-పాలకొండ రహదారిపై గంటసేపు రాస్తారోకో చేపట్టారు. భోగాపురం మండల కేంద్రంలో కూడా  ఉపాధ్యాయ జేఏసీ, ఏపీఎన్జీఓలు వేర్వేరుగా రాస్తారోకోలు చేపట్టారు.వీరికి మండల కల్లుగీత కార్మిక సంఘం సంఘీబావం తెలిపింది.  పూసపాటిరేగ ప్రధాన రహదారిపై విద్యార్థులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే యోగాసనాలు వేసి నిరసనలు చేపట్టారు. డెంకాడ మండలాల్లో కూడా సమైక్యవాదులు ఆందోళనలు చేపట్టారు. ఎస్.కోటలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో వేర్వేరుగా సోనియా, బొత్స దిష్టి బొమ్మలను దహనం చేశారు.
 
 సాలూరులో జేఏసీ ఆధ్వర్యంలో  జాతీయ రహదారిని దిగ్భందించి నిరసన చేయగా.. మున్సిపల్ ఉద్యోగులు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బొబ్బిలిలో  జేఏసీ ఆధ్వర్యంలో  ఉద్యోగులు రాస్తారోకో చేయగా... బాడంగి మండలంలో  ఉపాధ్యాయ, ఉద్యోగుల జేఏసీ అధ్వర్యంలో  చెవిలో పువ్వులు పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. జోరు  వర్షంలో గొడుగులతో నిలబడి సమైక్య నిరసనలు తెలిపారు. రామభద్రపురంలో ఉపాధ్యాయుల రాస్తారోకో  చేశారు. బెలగాంలో మహిళలు చేతిపై సమైక్యాంధ్ర ఆకారంలో గోరింటాకు పెట్టుకుని నిరసన  చేయగా..  న్యాయవాదులు, కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులు నిరాహారదీక్ష చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement