67వ రోజూ కొనసాగిన సమైక్య నిరసనలు | 67th day samaikyandhra Continued Protests | Sakshi
Sakshi News home page

67వ రోజూ కొనసాగిన సమైక్య నిరసనలు

Published Sun, Oct 6 2013 2:40 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

రాష్ట్ర విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. తెలంగాణ నోట్‌ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించడాన్ని

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. తెలంగాణ నోట్‌ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ 67వ రోజైన శనివారం కూడా ఉద్యమం ఉద్ధృతంగా సాగింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, నాన్‌పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన బంద్ రెండో రోజు విజయవంతంగా ముగిసింది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు బ్యాంకులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. జాతీయ రహదారులతో పాటు అన్ని ప్రధాన రహదారులను సమైక్యవాదులు దిగ్బంధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రహదారుల్లో నిరసనకారులు టైర్లు కాల్చి రహదారులను దిగ్బంధించారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్ 144 సెక్షన్ విధించినప్పటికీ  ప్రయోజనం లేకపోయింది. 
 
 తెలంగాణ నోట్‌ను ఉపసంహరించుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు ఉద్యమం ఆగదని ఉద్యమకారులు స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తక్షణమే పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో కేంద్ర కార్యాలయాలను మూసివే యించగా.. కేంద్రాస్పత్రి వద్ద  వైద్య ఉద్యోగులు ధర్నా చేశారు. ఉడాకాలనీలో బైక్‌లు అడ్డంగా పెట్టి రహదారిని దిగ్బంధించగా.. కణపాకలో రోడ్డుకు అడ్డంగా చెట్లు వేసి ప్రయాణికులను అడ్డుకున్నారు. చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్‌లో జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు నిరాహార దీక్షలు చేయగా... లావేరు రోడ్డులో చిన్నారులు మంత్రి బొత్స దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి మూడు రోడ్ల జంక్షన్‌లో దహనంచేశారు.
 
 కొత్త అగ్రహారంలో సోనియా గాంధీ శవయాత్ర నిర్వహించారు. గరివిడిలో పలువురు సమైక్యవాదులు రైల్‌రోకో నిర్వహించారు. మంత్రి బొత్స క్యాంప్ కార్యాలయంపై రాళ్లతో దాడి  చేయగా.... ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. భోగాపురం మండల కేంద్రంలో ఏపీఎన్జీఓ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టారు. పూసపాటిరేగలో ఉన్న జాతీయ రహదారిని సమైక్యవాదులు రోజంతా దిగ్బంధించారు. నెల్లిమర్లలో సమైక్యవాదులు అష్ట దిగ్బంధనం చేశారు. డెంకాడలో బంద్ విజయవంతమైంది. సాలూరులో వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గరుడబిల్లి ప్రశాంతకుమార్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బోసుబొమ్మ కూడలిలో టీడీపీ నాయకులు జాతీయ రహదారికి అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. బంద్ కారణంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి.
 
 గంట్యాడ, బోనంగి, తామరాపల్లి, పెదమజ్జిపాలెం, రామవరం కూడళ్లలో రాస్తారోకో నిర్వహించారు. గజపతినగరంలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 72 గంటల బంద్ పిలుపులో భాగంగా ఆ పార్టీ అరుకు పార్లమెంటు పరిశీలకుడు బేబీనాయన ఆధ్వర్యంలో బొబ్బిలిలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియా, చంద్రబాబు, బొత్సల దిష్టిబొమ్మలను దహనం చేశారు. విద్యార్థులు రైల్‌రోకో చేపట్టగా... తాండ్రపాపారాయ విద్యాసంస్థల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించా రు. బొబ్బిలిలో  కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించిన సమైక్యవాదులు అక్కడి సామగ్రిని ధ్వంసం చేసి కార్యాలయానికి నిప్పుపెట్టారు. బెలగాంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో తెలుగుతల్లి విగ్రహానికి నివాళులర్పించగా... జియ్యమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్‌లో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసిన అనంతరం సమైక్యద్రోహుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. గరుగుబిల్లి మండలం ఖడ్గవలస జంక్షన్‌లో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement