సాక్షి, విజయనగరం : టీడీపీ నేత, మాజీమంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలపై సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్ సంచయిత గజపతి రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాజా కళాశాలపై అశోక్ గజపతి రాజు చేసిన ఆరోపణలను ట్విటర్ వేదికగా సంచయిత తిప్పికొట్టారు. ‘మహారాజా కాలేజీ గురించి అశోక్ గజపతి గారు చేస్తున్న తప్పుడు సమాచారం నాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఇంతగా దిగజారి మాట్లాడతారని ఊహించలేదు. ఎంఆర్ కాలేజీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రయివేటు కాలేజీ. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఎయిడెడ్ హోదాను 2017లో ఆయనే సరెండర్ చేశారు. అప్పుడు తీసుకున్న విధాన నిర్ణయం కొనసాగుతోంది. ఇందులో ప్రభుత్వం జోక్యంకాని, సంబంధం కాని లేదు. ఈ విషయాన్ని ఆయన విస్మరించి మాట్లాడుతున్నారు. దయచేసి మీ రాజకీయాల్లోకి మాన్సాస్ విద్యాసంస్థలను లాగవద్దు. (అశోక్ గజపతిపై సంచయిత ఘాటు వ్యాఖ్యలు)
అశోక్‌గారు మాన్సాస్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తప్పుడు వివరాలు ఇవ్వటం మూలాన మాన్సాస్ కాలేజీలకు రూ.6.5 కోట్లు నష్టం వచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అశోక్‌గారు డిస్కౌంట్‌గా ఈ డబ్బు ఇచ్చారేమో? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నుంచి ఈ డబ్బును తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సరైన అనుమతులు లేని కారణంగా 2018–2020లో 170 మంది విద్యార్థులకు ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటు కాకుండా పోయాయి. అశోక్ గజపతి గారి హయాంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారు. వారిని జీవితాలను చీకట్లోకి నెట్టేశారు. నేను వచ్చాక ఈ సమస్యపై దృష్టి పెట్టాను. అశోక్‌గారు తన రాజకీయ ఆటల కోసం విజయనగరం పెద్దల వారసత్వాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించారో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. కనీసం గాంధీ జయంతి రోజు అయినా మీరు నిజం మాట్లాడాలి.’ అని సంచయిత గజపతిరాజు వరుస ట్వీట్లు చేశారు. (పవన్ వ్యాఖ్యలకు సంచయిత కౌంటర్)
Comments
Please login to add a commentAdd a comment