* రద్దయిన స్పీకర్ అపాయింట్‌మెంట్
* రాజీనామాలు వద్దని నచ్చజెప్పిన సీఎం, బొత్స
సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చుకొనేందుకు కేంద్రం ఏమాత్రం సిద్ధంగా లేకపోవడంతో ఆగస్టు రెండో తేదీన కొందరు ఎంపీలు పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే వాటిని ఆమోదింపజేసుకునే విషయంలో ఏకాభిప్రాయం కొరవడిన ఎంపీలకు కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం తనదైన శైలిలో పరిష్కారాన్ని చూపింది.
బుధ, గురువారాల్లో తన పార్లమెంటరీ నియోజకవర్గ పర్యటనకు, మరో విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు స్వరాష్ట్రం బీహార్ వెళ్లాల్సి ఉన్నందున లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఢిల్లీలోని తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. దీంతో ఎంపీల రాజీనామాల ఆమోదం వ్యవహారం తాత్కాలికంగా వెనక్కువెళ్లింది. కొంతమంది ఎంపీలు మాత్రమే రాజీనామా చేయడం వల్ల ఫలితం ఉండదంటూ వారికి నచ్చజెప్పేందుకు గత 24 గంటల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రయత్నం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో సీఎం ఏర్పాటు చేసిన అల్పాహార విందు సమావేశానంతరం పార్లమెంట్ ప్రాంగణానికి వచ్చిన 9 మంది సీమాంధ్ర ఎంపీలకు స్పీకర్ అపాయింట్‌మెంట్ రద్దయినట్లు తెలిసింది. దీంతో ఉండవల్లి అరుణ్‌కుమార్, జి.వి.హర్షకుమార్, కనుమూరి బాపిరాజు, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, ఎస్పీవై రెడ్డిలతో పాటు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావులు పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లోనే దాదాపు గంటకుపైగా భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకొన్నారు.
బొత్స, రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, కాసు వెంకటకృష్ణారెడ్డి, వట్టి వసంత కుమార్‌లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్పీకర్ బీహార్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత మరోరోజు కలుసుకొని ఆమోదానికి పట్టుబడతామని పార్లమెంట్ ప్రాంగణం వెలుపల విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడిన ఎంపీలు ప్రకటించారు.
రాజీనామాల విషయంలో తాము ఏ క్షణంలోనూ వెనక్కుతగ్గలేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. స్పీకర్ అపాయింట్‌మెంట్ రద్దు కావడం వెనుక ఏం జరిగిందన్నది తమకు తెలియదని, రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌ను వివాదాల్లోకి లాగడం సమంజసం కాదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించేలా చూసేందుకు రాజీనామాలు పరిష్కారం కాదన్నది సీఎం, పీసీసీ చీఫ్‌ల అభిప్రాయమైతే... అయిదున్నర కోట్ల మంది సీమాంధ్రుల మనోభీష్టాన్ని నెరవేర్చేందుకు ఉత్తమమైన మార్గమేమిటో చెప్పాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుందని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు.
ఎంపీల రాజీనామాలకు బ్రేక్!
Published Wed, Sep 25 2013 1:34 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM
Advertisement
Advertisement