పసిగుండెల్లో ‘సైకో’ కత్తి
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ఆ చిన్నారి కళ్లల్లో మామయ్య పెళ్లికి వెళ్తున్నానన్న ఆనందం.. కాసేపట్లో రైలెక్కుతానన్న ఉత్సాహం.. మాటల్లో చెప్పలేనంత సంతోషం.. హాయిగా ఆడుతోంది.. లేడి పిల్లలా పరుగులు పెడుతోంది.. అంతలోనే ఎక్కడ్నుంచి వచ్చాడో ఆ కర్కశుడు.. అన్నెంపున్నెం తెలియని ఆ పసిపాపను అమాంతంగా ఎత్తుకుపోయాడు.. వెంట తెచ్చుకున్న రెండు కత్తులతో దారుణంగా పొడిచి ఫ్లాట్‌ఫామ్‌పై పడేశాడు..! అమ్మ చేతిలో అందంగా ముస్తాబైన ఆ గారాలపట్టి కొద్ది గంటలకే నాన్న ఒడిలో ప్రాణాలు విడిచింది!! అప్పటివరకు తమ కళ్లముందే ఆడిపాడిన చిన్నారిని రక్తపు మడుగులో విగత జీవిగా చూసిన వారి గుండెలు తరుక్కుపోయాయి. మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన తేలు శ్రీనివాస్, సోనూ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ప్రియదర్శిని (07), సింథియా (02). ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులు ఉపాధి కోసం కొద్ది సంవత్సరాల క్రితమే హైదరాబాద్ వచ్చి ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో స్థిరపడ్డారు. శ్రీనివాస్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. సోను ఆంధ్ర మహిళా సభలో స్పీచ్ థెరపిస్ట్‌గా ఉద్యోగం చేస్తోంది. ప్రియదర్శిని స్థానిక సెయింట్ మార్టిన్స్ పాఠశాలలో ఫస్ట్‌క్లాస్ చదువుకుంటోంది.
షోలాపూర్‌లో మేనమామ కుమారుడి వివాహం కోసం శ్రీనివాస్ తన కూతురు ప్రియదర్శిని, తల్లి సత్తెమ్మతో మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. తల్లి, కూతురును పదో నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద ఉంచి తాను బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. 2.54 గంటలకు బయలుదేరాల్సిన రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. అప్పటి వరకు నాయనమ్మ సత్తెమ్మ వద్దే కూర్చున్న ప్రియదర్శిని ఆడుకుంటూ అటుఇటూ తిరుగుతోంది. వచ్చిపోయే రైళ్లను చూస్తూ కేరింతలు కొడుతోంది. ఇంతలోనే ఉన్మాది అక్కడకు వచ్చి ప్రియదర్శినిని ఎత్తుకొని కొంతదూరం పరుగెత్తాడు.
రెండు కత్తులతో చిన్నారిపై ఎనిమిది సార్లు పొడిచి కింద పడేశాడు. చిన్నారికి తలపై రెండుచోట్ల, మెడ వెనుక భాగంలో బలమైన గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ప్లాట్‌ఫామ్‌పై విలవిల్లాడుతున్న ప్రియదర్శిని చుట్టూ రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకుని ఉన్మాది గెంతులు వేశాడు. ఆ సైకోను ఆపడం ఎవరివల్లా కాలేదు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ హరిప్రసాద్ అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆయనపైనా కత్తులతో దాడి చేసేందుకు యత్నించాడు. చివరికి ప్రియదర్శిని నానమ్మ సత్తెమ్మ కేకలు విని.. ఇద్దరు రైల్వే కూలీలు, మరికొందరు ప్రయాణికులు సైకోను బంధించి చితకబాది పట్టుకున్నారు. టికెట్ కౌంటర్ నుంచి వచ్చిన శ్రీనివాస్.. బిడ్డ రక్తపు మడుగులో పడి ఉండడం చూసి గుండెలు పగిలాయి. వెంటనే కూతురుని ఆటోలో గాంధీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ చిన్నారి మార్గం మధ్యలోనే నాన్న ఒడిలో కన్నుమూసింది. ప్రేమ వివాహం చేసుకుని ఎనిమిదేళ్లుగా సరదాగా సాగిపోతున్న శ్రీనివాస్, సోను జీవితంలో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది. తమ పాప ఇక లేదన్న విషయాన్ని దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు.
పొంతన లేని సైకో మాటలు..
రైల్వే పోలీసులు సైకోను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ విచారణలో ఒక్కోసారి ఒక్కో మాట చెప్పాడు. తన ది చిత్తూరు జిల్లా పుత్తూరు అని, పేరు కోల కరణ్‌కుమార్ (26) అని చెప్పాడు. తనకు ఎయిడ్స్ సోకిందని, కుటుంబీకులు వెలివేసిన కారణంగానే ఏం చేయాలో అర్థం కాక చిన్నారిని గాయపరిచానని ఒకసారి, తమ ఇంటిపక్కన ఇలాంటి అమ్మాయే ఉండేదని అలాంటి అమ్మాయి నాకెందుకులేదన్న నెపంతో చంపేశానని మరోసారి చెప్పాడు. ఇతడు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నట్టు సమాచారం. పుత్తూరు నుంచి సోమవారం అరకొణ ప్యాసింజర్ రైల్లో విజయవాడకు చేరిన కరణ్‌కుమార్ మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరినట్టు తెలుస్తుంది. కరణ్‌కుమార్‌కు హెచ్‌ఐవీ సోకిన విషయం తన స్నేహితులకు తెలిసి హేళన చేస్తున్న క్రమంలోనే.. నగరానికి చేరుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు వివరాలు సేకరించారు.
చంపుతాననడం అతడి అలవాటు..
విజయపురం, న్యూస్‌లైన్: సైకో కరణ్‌కుమార్ చిత్తూరు జిల్లా వాసి. విజయపురం మండలం పన్నూరుకు చెందిన వ్యవసాయ కూలీ గోవిందస్వామి కుమారుడు. అతనికి చాలా కాలంగా మతిస్థిమితం లేదు. ఒకప్పుడు తెలివైన విద్యార్థి. ప్రేమించిన అమ్మాయికి ప్రాణాంతకమైన వ్యాధి ఉందని తెలియడంతో ఉన్మాదిలా మారాడు. కత్తి చేతిలో పట్టుకుని చంపుతానంటూ ఊళ్లో వాళ్లను బెదిరించేవాడు. బంధువులు అతనికి ఆరు నెలలు చెన్నైలో చికిత్స చేయించారు. తర్వాత ఇంట్లోనే బంధించి ఉంచేవారు. ఆరోగ్యం కుదుటపడడంతో పుత్తూరులోని ఎస్‌ఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో చేరాడు. గతంలో అతని వెంట ఎప్పుడూ ఇద్దరు వ్యక్తులు కాపలా ఉండేవారు. అయితే ఈ మధ్య అతని ప్రవర్తన బాగానే ఉండడంతో వాళ్లు అతన్ని ఒంటరిగా వదిలేశారు. రెండు రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన కుమార్ తర్వాత కనిపించలేదు.