తాండూరు టౌన్: ఏడు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ సైకో కిల్లర్‌ను తాండూరు పోలీసులు అరెస్టు చేశారు. మహిళా అడ్డా కూలీలే అతని టార్గెట్. వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసి, ఒంటిపై ఉన్న నగలు, నగదుతో పరారయ్యేవాడు. తాజాగా తాండూరు పట్టణంలో ఓ మహిళా కూలీ అదృశ్యం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి శుక్రవారం ఆ వివరాలు వెల్లడించారు.
కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా మడ్కల్ గ్రామానికి చెందిన సర్వాబి(42) తన భర్తతో కలిసి తాండూరు పట్టణంలోని ధన్‌గర్ గల్లీలో నివాసం ఉంటూ కూలి పనిచేస్తుండేది. గత నెల 29న పని నిమిత్తం వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో భర్త మహ్మద్ ఈ నెల 1న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా స్థానిక శాంత్‌మహల్ చౌరస్తా నుంచి సర్వాబి, ఓ వ్యక్తితో కలిసి ఇందిరాచౌక్ వెళ్తున్నట్లు గుర్తించారు.
ఆ వ్యక్తి వికారాబాద్ జిల్లా ధారూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన కూలి పనిచేసే మాల కిష్టప్పగా(50) పోలీసులు గుర్తించారు. గురువారం అదుపులోకి తీసుకుని కిష్టప్పను విచారించగా తానే హత్య చేశానని చెప్పడంతో, ఘటనా స్థలానికి నిందితున్ని తీసుకెళ్లి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు.
రెండు నెలల క్రితమే జైలు నుంచి బయటికొచ్చి..
గత నెల 29న సర్వాబికి మాయమాటలు చెప్పి తట్టేపల్లి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి ఆమె కొంగుతోనే మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్, రూ.1000 నగదు, కాళ్ల పట్టీలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితునిపై వికారాబాద్ పీఎస్‌లో 4 కేసులు, ధారూరులో ఒకటి, యాలాలలో ఒక హత్య కేసు నమోదైంది. తాజాగా పట్టణంలో మరో కేసు నమోదు చేశారు. ఓ కేసులో 2021 నుంచి జైలులో ఉన్న కిష్టప్ప రెండు నెలల క్రితమే బయటకు వచ్చి సర్వాబిని హత్య చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment