kishtappa
-
సైకో కిల్లర్ అరెస్టు
తాండూరు టౌన్: ఏడు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ సైకో కిల్లర్‌ను తాండూరు పోలీసులు అరెస్టు చేశారు. మహిళా అడ్డా కూలీలే అతని టార్గెట్. వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసి, ఒంటిపై ఉన్న నగలు, నగదుతో పరారయ్యేవాడు. తాజాగా తాండూరు పట్టణంలో ఓ మహిళా కూలీ అదృశ్యం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి శుక్రవారం ఆ వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా మడ్కల్ గ్రామానికి చెందిన సర్వాబి(42) తన భర్తతో కలిసి తాండూరు పట్టణంలోని ధన్గర్ గల్లీలో నివాసం ఉంటూ కూలి పనిచేస్తుండేది. గత నెల 29న పని నిమిత్తం వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో భర్త మహ్మద్ ఈ నెల 1న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా స్థానిక శాంత్‌మహల్ చౌరస్తా నుంచి సర్వాబి, ఓ వ్యక్తితో కలిసి ఇందిరాచౌక్ వెళ్తున్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తి వికారాబాద్ జిల్లా ధారూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన కూలి పనిచేసే మాల కిష్టప్పగా(50) పోలీసులు గుర్తించారు. గురువారం అదుపులోకి తీసుకుని కిష్టప్పను విచారించగా తానే హత్య చేశానని చెప్పడంతో, ఘటనా స్థలానికి నిందితున్ని తీసుకెళ్లి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. రెండు నెలల క్రితమే జైలు నుంచి బయటికొచ్చి.. గత నెల 29న సర్వాబికి మాయమాటలు చెప్పి తట్టేపల్లి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి ఆమె కొంగుతోనే మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్, రూ.1000 నగదు, కాళ్ల పట్టీలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితునిపై వికారాబాద్ పీఎస్‌లో 4 కేసులు, ధారూరులో ఒకటి, యాలాలలో ఒక హత్య కేసు నమోదైంది. తాజాగా పట్టణంలో మరో కేసు నమోదు చేశారు. ఓ కేసులో 2021 నుంచి జైలులో ఉన్న కిష్టప్ప రెండు నెలల క్రితమే బయటకు వచ్చి సర్వాబిని హత్య చేశాడు. -
19 గొర్రెలు మృత్యువాత
శింగనమల : శింగనమల కాపర్లకు చెందిన 19 గొర్రెలు అకాల మృత్యువాతపడ్డాయి. కాపరి కిష్టప్పకు చెందిన గొర్రెలు శింగనమల చెరువులో వేసిన గడ్డిజొన్న మొలకలను శనివారం సాయంత్రం తిన్నాయి. అందులో 13 గొర్రెలు నాముకొని ఆదివారం ఉదయం మృతి చెందాయి. శింగనమలకు చెందిన కాయల చలమయ్య అనే కాపరికి చెందిన గొర్రెల మంద రాగులకుంట కొండ ప్రాంతానికి వెళ్లగా.. రాత్రి మందపై గుర్తు తెలియని జంతువులు దాడి చేసి ఆరు గొర్రెలను చంపేశాయి. మృతి చెందిన గొర్రెలకు ఆదివారం ఉదయం పశువైద్యాధికారులు పోస్టుమార్టు నిర్వహించారు. ఘటనపై అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. -
రైతు హత్య మిస్టరీ వీడింది
తాండూరు రూరల్, న్యూస్‌లైన్: రైతును హత్య చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తాండూరు రూరల్ సీఐ రవి, ఎస్ఐ పవన్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని చంద్రవంచ గ్రామానికి చెందిన రైతు కిష్టప్ప(45) వద్ద లక్ష్మప్ప పాలేరుగా పనిచేస్తున్నాడు. గతనెల 15న లక్ష్మప్ప పొలం దున్నుతుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయనతో గొడవపడ్డాడు. సమాచారం అందుకున్న కిష్టప్ప పొలానికి వచ్చాడు. గుర్తుతెలియని వ్యక్తి ఆయనతోనూ వాగ్వాదానికి దిగాడు. గ్రామంలో మాట్లాడుకుందాం.. అని ఇద్దరూ చంద్రవంచకు బయలుదేరారు. గ్రామ శివారులో కిష్టప్ప వద్ద ఉన్న గొడ్డలిని తీసుకున్న గుర్తుతెలియని వ్యకి ఆయనపై దాడి చేసి చంపేసి పరారయ్యాడు. దుండగుడు తన పేరు చెప్పకుండా కరన్కోట్వాసినని చెప్పాడు. మిస్టరీ వీడింది ఇలా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేశారు. కరన్‌కోట్ గ్రామంలోని పాత నేరస్తులపై పోలీసులు దృష్టి సారించారు. ఠాణాలో ఉన్న నేరగాళ్ల ఫొటోలను కిష్టప్ప పాలేరు లక్ష్మప్పకు చూపించా రు. దీంతో కరన్‌కోట్‌కు చెందిన వడ్డె ఈరప్పగా గుర్తించారు. అతణ్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా కిష్టప్పను చంపింది తానేనని అంగీకరించి హత్యకు దారి తీసిన విషయాలు చెప్పాడు. గత నెల 14న రాత్రి ఈరప్ప కుందేళ్ల వేటకు వచ్చి చంద్రవంచకు చెందిన కిష్టప్ప పొలంలో మద్యం తాగి నిద్రించాడు. మరుసటి రోజు దుక్కి దునేందుకు వచ్చిన లక్ష్మప్ప నిద్రలో ఉన్న వడ్డె ఈరప్పను చర్నాకోలతో కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోవాలన్నాడు. దీంతో ఈరప్ప లక్ష్మప్పను సతాయించాడు. లక్ష్మప్ప సమాచారంతో పొలం యజమాని కిష్టప్ప గొడ్డలితో పొలానికి వచ్చాడు. ఈరప్ప ఆయనతో కూడా గొడవపడ్డాడు. గ్రామంలో మాట్లాడుదామని బయలుదేరగా మార్గంమధ్య లో ఆవేశానికి లోనైన ఈరప్ప కిష్టప్ప వద్ద ఉన్న గొడ్డలిని లాక్కొని అతడిపై దాడి చేసి చంపేసి పరారయ్యాడు. గొడ్డలిని కరన్‌కోట్ సమీపంలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న మడుగులో పడేశాడు. అక్కడి నుంచి లారీలో కర్ణాటక రాష్ట్రం వాడీకి వెళ్లాడు. అనంతరం రెండు రోజుల తర్వాత తిరిగి కరన్‌కోట్‌కు చేరుకున్నాడు. పోలీసులు ఈరప్పను అరెస్టు చేసి శనివారం రిమాండుకు తరలించారు. హత్య మిస్టరీని చేధించిన కరన్‌కోట్ ఎస్ఐ పవన్‌ను సీఐ రవి అభినందించారు. పలు హత్యకేసుల్లో నిందితుడు... హంతకుడు ఈరప్ప పలు కేసుల్లో నిందితుడు అని పోలీసులు తెలిపారు. కరన్‌కోట్ గ్రామంలో 2012 డిసెంబర్ నెలలో కూలి డబ్బులు చెల్లించలేదని యజమాని శ్రీనును దారుణంగా హత్య చేశాడు. గత జనవరిలో చంద్రవంచ దర్గా వద్ద కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ వాసి గౌస్‌ను కొట్టి చంపాడు. రౌడిషీట్ ఓపెన్ చేస్తాం.... మూడు హత్య కేసుల్లో నిందితుడైన కరణ్‌కోట్ గ్రామానికి చెందిన వడ్డె ఈరప్పపై రౌడీషీట్ తెరుస్తామని సీఐ రవి పేర్కొన్నారు.