సాక్షి, నాగర్‌కర్నూల్: మాయలు, మంత్రాలు తెలుసునని నమ్మిస్తూ, మంత్ర శక్తితో గుప్తనిధులు వెలికితీస్తానంటూ ఆస్తులు కాజేసి, ప్రాణాలు తీస్తున్న సైకో కిల్లర్ రామెట్టి సత్యనారాయణను నాగర్‌కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నిందితుడిని అరెస్ట్ చూపుతూ, మీడియాకు వివరాలను వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ ఇప్పటివరకు 11 మందిని హత్యచేసినట్టు వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ హత్యలకు పాల్పడ్డాడని వెల్లడించారు.
నిర్మానుష్య ప్రాంతాల్లో హత్యలు..
‘‘నిందితుడు సత్యనారాయణ యాదవ్ తన మంత్రశక్తితో గుప్తనిధులను వెలికితీస్తానని అమాయకులను నమ్మిస్తూ వారి పేరిట ఉన్న ప్లాట్లు, వ్యవసాయ భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించాం. గుప్తనిధులు వెలికితీస్తానని ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాలకు రప్పించి వారికి జిల్లేడు పాలు, ఇతర చెట్ల మందులను తాగిస్తాడు. వారు అపస్మారక స్థితిలోకి చేరుకోగానే బండ రాళ్లతో మోది హత్యకు పాల్పడ్డాడ’’ని డీఐజీ చౌహాన్ వివరించారు. మొత్తం 11 మందిని హత్య చేయగా, ముగ్గురి మృతదేహాలు ఇప్పటివరకు దొరకలేదని చెప్పారు.
11 మంది అమాయకులు బలి..
2020 ఆగస్టు 14న వనపర్తి జిల్లా నాగాపూర్‌లో గుప్తనిధు ల కోసం పూజల పేరుతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశాడు. వీరిలో హజిరాబీ(60), ఆష్మాబేగం(32), ఖాజా(35), ఆశ్రీన్(10) ఉన్నారు. 2021లో నాగర్‌కర్నూల్ జిల్లా ఎండబెట్లకు చెందిన సలీం పాషా(38), కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన ఆరెపల్లి శ్రీనివాసులు(52), 2022లో నాగర్‌కర్నూల్ మండలం గన్యాగులకు చెందిన వాసర్ల లింగస్వామి(50), 2023లో కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లికి చెందిన సంపతి శ్రీధర్‌రెడ్డి(43), కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి(70), తిరుపతమ్మ(42), వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన గోవుల వెంకటేశ్(32)ను హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు.
నిందితుడు సత్యనారాయణకు పోలీస్ అధికారులతో సంబంధాలు?
మూడేళ్ల నుంచి తరచుగా హత్యలు, మోసాలకు పాల్పడుతూ ఇప్పటివరకు 11 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న మాంత్రికుడు సత్యనారాయణ యాదవ్.. కొంతమంది ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారుల అండదండలతోనే ఇన్నాళ్లు తప్పించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్‌లో నివసిస్తున్న ఓ మహిళ తమ కుటుంబ సమస్య పరిష్కారం కోసం సత్య నారాయణను ఆశ్రయించగా, ఆమె భూమిని కూడా తన అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.
దీనిపై సదరు మహిళ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నాగర్‌కర్నూల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అయితే అప్పటి దర్యాప్తు అధికారి నిందితుడు సత్యనారాయణ యాద వ్ నుంచి రెండు ప్లాట్లను.. తన మామ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. తాజాగా వీపనగండ్ల మండలం బొల్లారానికి చెందిన వెంకటేశ్ భార్య ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టడంతో విషయం బయటపడింది.
అప్పుడే పట్టుకుంటే నలుగురు బతికేవారు..
వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్‌లో 2020 ఆగస్టు 14న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణహత్యకు గురికాగా, మూడేళ్లుగా పోలీసులు నిందితుడిని గుర్తించలేదన్న విమర్శలు ఉన్నాయి. మాయలు, మంత్రాల పేరుతో భూ రిజిస్ట్రేషన్లు, ఆ తర్వాత హత్యలకు పాల్పడుతున్న సత్యనారాయణ బాగోతాలను వెలుగులోకి తెస్తూ గత ఏప్రిల్ 5న ‘మాయగాళ్లు’శీర్షికన ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. ఆ సమయంలోనూ పోలీసులు సత్యనారాయణ కేసులో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆ తర్వాత 2023 జూలైలో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లికి చెందిన సంపతి శ్రీధర్‌రెడ్డి, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన తండ్రీకూతుళ్లు బీంరెడ్డి రాంరెడ్డి, తిరుపతమ్మ, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన గోవుల వెంకటేశ్ హత్యకు గురయ్యారు. ఆరు నెలల ముందే పోలీసులు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని ఉంటే ఆ నలుగురు ప్రాణాలతో బయటపడేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment