దొండపర్తి (విశాఖ దక్షిణ): ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 48 గంటలపాటు ఎంపీ కుటుంబ సభ్యులకు కిడ్నాపర్లు నరకం చూపించారు. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)ను చిత్ర హింసలు పెట్టారు. ఈ వ్యవహారంపై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి.
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. భీమిలి ప్రాంతానికి చెందిన కోలా వెంకట హేమంత్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుసూదనరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. చోరీలు చేసే రాజేష్, ఇతర గ్యాంగ్‌తో అక్కడ అతనికి పరిచయం ఏర్పడింది. చిన్న చిన్న చోరీలు చేసే కంటే ఒకేసారి బిగ్‌షాట్‌ను కిడ్నాప్ చేస్తే సెటిల్ అయిపోవచ్చని హేమంత్ వారికి ఆశపెట్టాడు.
టార్గెట్ ఎంపీ కుటుంబం
బయటకు వెళ్లాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయాలని నిర్ణయించారు. హేమంత్‌కుమార్, రాజేష్, సాయి, చిన్న సాయి, గోవర్ధన్, మరో వ్యక్తి కలిసి ఎంపీ కొత్త ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఇంట్లోకి చొరబడి ఎంపీ కుమారుడు శరత్‌పై దాడి చేశారు. కాళ్లు, చేతులు కట్టేశారు. శరత్‌తో ఫోన్ చేయించి సెక్యూరిటీ గార్డును పంపించేశారు. శరత్ ఒంటిపై ఉన్న బంగారం దోచుకున్నారు.
మరుసటి రోజు ఉదయం శరత్‌తో ఫోన్ చేయించి ఒంట్లో బాగోలేదని చెప్పించి, తల్లి జ్యోతిని ఆ ఇంటికి రప్పించారు. ఆమె వద్ద ఉన్న బంగారాన్ని తీసుకుని, ఆమెనూ బంధించారు. అనంతరం ఎంపీ ఎంవీవీ స్నేహితుడు జీవీ వద్ద డబ్బులు ఉంటాయని భావించి అతనికి బలవంతంగా ఫోన్ చేయించి రప్పించారు. హేమంత్ రాజేష్‌లు అతడిపై దాడి చేసి.. చేతులు, కాళ్లు కట్టేశారు. కారు డ్రైవర్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఫోన్ చేయించారు.
రూ.20 కోట్లు ఇస్తావా? లేదా ఇల్లు, స్థలం రాసిస్తావా?
అసలు ఎందుకు తమను నిర్బంధించారని, ఏం కావాలో చెబితే ఇస్తామని జీవీ కిడ్నాపర్లకు చెప్పగా.. రూ.100 కోట్లు కావాలి ఇస్తావా? అని హేమంత్ ప్రశ్నించాడు. అంత డబ్బు ఉండదని, తమను వదిలేస్తే రూ.5 కోట్ల వరకు సమకూరుస్తామని చెప్పారు. దానికి హేమంత్ అంగీకరించలేదు. ఎవరికి ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయో వారి పేర్లను హేమంత్‌కుమారే సూచించి, ఫోన్లు చేయించారు.
ఇలా జీవీ రూ.కోటి వరకు సమకూర్చి డ్రైవర్ ద్వారా ఆ డబ్బు తెప్పించారు. వచ్చిన డబ్బులో హేమంత్‌కుమార్, రాజేష్‌లకు 40 శాతం చొప్పున, సాయికి 10 శాతం, ఇతర ఖర్చుల కోసం 10 శాతం పంపకాలు చేసుకున్నారు. శరత్ బ్యాంక్ అకౌంట్‌లో రూ.65 లక్షలు జీవీ అకౌంటెంట్ ద్వారా విత్‌డ్రా చేయించి తెప్పించుకున్నారు. వచ్చిన డబ్బులో రూ.21 లక్షలు బెయిల్ కోసం రాజేష్ అనే లాయర్‌కు పంపించారు.
లవర్‌కు రూ.40 లక్షలు నజరానా
హేమంత్‌కుమార్ తన వాటాలో వచ్చిన డబ్బులో రూ.40 లక్షలు తన లవర్ సుబ్బలక్ష్మికి ఇవ్వాలని భావించాడు. అయితే గతంలో చేసిన కిడ్నాప్ వ్యవహారంలో ఇతనితో పాటు సుబ్బలక్ష్మి కూడా జైలుకు వెళ్లింది. ఫలితంగా వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. రూ.40 లక్షలు ఇచ్చి మళ్లీ ఆమెకు దగ్గరవ్వాలని భావించాడు. నేరుగా డబ్బులు ఇస్తానంటే అంగీకరించదని జీవీతో ఫోన్ చేయించి.. రెండు గంటల సేపు మాట్లాడి ఒప్పించేలా చేశాడు. జీవీ కారు డ్రైవర్‌ను రప్పించి రూ.40 లక్షలు ఆమెకు అందేలా చేశారు.
రెండు రోజుల పాటు కిడ్నాపర్లు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. వారికి పెరుగన్నం పెట్టి, కిడ్నాపర్లు మాత్రం బిర్యానీ తినేవారు. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ రాజేష్.. వారి చేతులపై కత్తితో కొడుతూ.. దుర్భాషలాడుతూ వారి చేతికి ఉన్న ఉంగరాలను లాక్కున్నాడు. డబ్బు లేదంటే ఎంపీ ఇల్లు, జీవీకి ఉన్న స్థలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని హేమంత్ డిమాండ్ చేశాడు.
శరత్‌ను డిక్కిలో కుక్కి..
ఫోన్ చేసినప్పుడు జీవీ పొంతన లేని సమాధానాలతో ఎంపీకి అనుమానం వచ్చింది. వెంటనే పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే పోలీసులు జీవీ నెంబర్‌కు వరుసగా ఫోన్ చేస్తుండటంతో.. అనుమానం వస్తుందని భావించిన కిడ్నాపర్లు ఫోన్‌లో మాట్లాడించారు. పోలీసులకు అనుమానం వచ్చినట్లు గ్రహించిన హేమంత్‌కుమార్ గ్యాంగ్ వెంటనే అక్కడి నుంచి శరత్ కారులోనే తప్పించుకోవాలని చూసింది.
చేతులు, కాళ్లు కట్టేసి శరత్‌ను డిక్కీలో కుక్కారు. హేమంత్ కార్ డ్రైవ్ చేయగా ముందు సీట్లో రాజేష్ ఎక్కాడు. జ్యోతి, జీవీతో పాటు సాయి కూర్చున్నాడు. మధ్యలో వీరు తమ వద్ద ఉంటే ప్రమాదమని భావించిన హేమంత్‌కుమార్.. వారిని ఆనందపురం మండలంలో దించేశాడు. దీంతో జ్యోతి, జీవీలు జాతీయ రహదారి వరకు నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కారు. అనంతరం కారు ఆపి మధ్యలోనే సాయి దిగిపారిపోయాడు. అంతలో పోలీసులు వారి కారును వెంబడించి హేమంత్, రాజేష్‌లను పట్టుకుని.. శరత్‌ను విడిపించిన విషయం తెలిసిందే.
ముగ్గురి అరెస్ట్.. రూ.86.6 లక్షలు రికవరీ
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనలో ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వాస్తవానికి గురువారమే కోలా వెంకట హేమంత్‌కుమార్, రాజేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా కిడ్నాప్‌లో పాల్గొన్న వారి వివరాలను వెల్లడించారు.
దీని ప్రకారం శుక్రవారం గాజువాకకు చెందిన సాయిని షీలానగర్ ప్రాంతంలో పట్టుకున్నారు. వీరి ముగ్గురి నుంచి రూ.86.6 లక్షలు రికవరీ చేశారు. ఈ ముగ్గురిని సాయంత్రం కేజీహెచ్‌కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా, మరో ముగ్గురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment