72గంటల బంద్ సక్సెస్
Published Mon, Oct 7 2013 4:02 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
సాక్షి, గుంటూరు : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. సమైక్యవాదులు కోపాగ్నిలో జిల్లా అతలాకుతలమవుతోంది. శాంతిభద్రతలు గాడితప్పుతున్నాయి. జిల్లా అంతటా అంధకారం అలముకొంది. విద్య, వైద్యం, వ్యాపార, పారిశ్రామిక, రవాణా రంగాలు ఉద్యమ సెగ తగిలి ఛిన్నాభిన్నమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే....వందేళ్ల చరిత్రగల గుంటూరు జిల్లాలో స్వాతంత్య్రోద్యమం తరువాత అంతటిస్థాయిలో మహోజ్వలంగా జరుగుతున్న సంఘటిత ఉద్యమం ఇదే. తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెల్పిన తరువాత జిల్లాలోని సమైక్య ఉద్యమం పతాకస్థాయికి చేరింది.
టో నోట్‌ను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన 72 గంటల బంద్‌ను పార్టీ నాయకులు, ఏపీఎన్జీవోలు, విద్యుత్ జేఏసీ నాయకులు విజయవంతం చేశారు. గుం టూరు, నరసరావుపేట, తెనాలి, సత్తెనపల్లి, మంగళగిరి, మాచర్ల పట్టణాల్లో అన్ని రకాల దుకాణాలు స్వచ్చందంగా మూతపడ్డాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు చోట్ల సోనియా వైఖరిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో జరిగింది. ఉద్యోగ సంఘ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి టీ నోట్ ప్రతులను దహనం చేశారు. వైఎస్ జగన్ చేపట్టిన నిరశన దీక్ష విజయవంతం కావాలని మంగళగిరి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు నరసింహుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సమైక్యాంధ్ర అవసరాన్ని తెలియజేస్తూ పార్టీ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి, జిల్లా బీసీసెల్ కన్వీనర్ దేవళ్ల రేవతి నిరసన ప్రదర్శన జరిపారు. జగన్ దీక్షకు మద్దతుగా ప్రత్తిపాడులో జరుగుతున్న రిలేదీక్షల్లో ఆదివారం వివిధ మండలాల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కన్వీనర్లు పాల్గొన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో రాస్తారోకో, బైక్ ర్యాలీ జరిగింది. దుర్గిలో మాదిగ దండోరా నేతలు సోనియా దిష్టిబొమ్మను దహనం చే శారు. రెంటచింతలలో పెట్రోలు బంకుల యజమానులు మూడో రోజైన ఆదివారం కూడా బంకుల్ని మూసేశారు. తాళ్లపల్లి పవర్‌గ్రిడ్ దగ్గర వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నర్సరావుపేట, వినుకొండ, గురజాల, రేపల్లె, తెనాలి పట్టణాల్లోనూ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలను చే పట్టి ఉద్యమ సెగల్ని రేకెత్తించారు.
ఆదివారం గుంటూరులోనూ ఆందోళనా కార్యక్రమాలు తీవ్రస్థాయిలో జరిగాయి. అరండల్‌పేట బ్రిడ్జిపై వైఎస్‌ఆర్‌సీపీ నగర కన్వీనర్ ఎల్ అప్పిరెడ్డి, లాల్‌పురం రాము తదితరులు బైఠాయించి నిరసన తెలిపారు. రైల్వేస్టేషన్‌లోనికి చొరబడి కేంద్రంపై నిరసన నినాదాలు చేశారు. మరోవైపు ఏపీఎన్‌జీవోలు కూడా ఆదివారం పలు చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చిలకలూరిపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ సంఘాలనాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీ నోట్ ప్రతుల్ని తగులబెట్టారు. గుంటూరు, నర్సరావుపేట, తెనాలిల్లోనూ వీరు సోనియా దిష్టిబొమ్మల దహనాలు, ర్యాలీలు నిర్వహించారు.
నిప్పులు కక్కిన విద్యుత్ జేఏసీ.
ఇదిలాఉండగా, జిల్లా విద్యుత్ జేఏసీ నాయకులు ఆదివారం టీ నోట్ ఆమోదంపై నిప్పులు కక్కారు. కేంద్రం ఏకపక్ష వైఖరిని ప్రశ్నిస్తూ గుంటూరు, తెనాలి, తాళ్లపల్లి, తాడికొండ, నర్సరావుపేట, తాడేపల్లి ప్రాంతాల్లో కదం తొక్కారు. ఉదయం 6 గంటల నుంచి జిల్లాలోని 4 వేల మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. దీంతో 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ జిల్లా అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా గుంటూరు, నర్సరావుపేట, తెనాలి, సత్తెనపల్లి వైద్యవిధానపరిషత్ ఆస్పత్రుల్లో రోగులకు, చంటిపిల్లల తల్లులు ఉక్కపోతతో విలవిల్లాడారు.
సత్తెనపల్లి, తాడేపల్లి, గురజాల, మాచర్ల, తెనాలి, రేపల్లె, వేమూరు, బాపట్ల నియోజక వర్గాల్లోని వందలాది గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. నర్సరావుపేటకు సమీపంలోని యల్లమంద, చినతురకపాలెం గ్రామాల్లో విద్యుత్ మిషన్లపై పరదా పట్టలు కుట్టే పనివారలకు ఆదివారం పనిలేకుండా పోయింది. కరెంటు లేకపోవడం వీరి ఉపాధిని దెబ్బతీసింది. రాత్రి 8 గంటల వరకూ సుమారు 400 పైగా గ్రామాల్లో అంధకారం అలముకుంది. పల్లెలు, పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. జిల్లాలోని స్పిన్నింగ్, కాటన్, రైస్‌మిల్లుల్లోనూ, ప్టాస్టిక్ పరిశ్రమల్లోనూ ఉత్పత్తులు పడిపోయాయి.
Advertisement