సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలో ఆందోళనలు
Published Tue, Oct 8 2013 3:44 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
సమైక్య ఉద్యమంతో జిల్లా అట్టుడికిపోతోంది. వైఎస్సార్ సీపీ శ్రేణుల నిరసనలతో అది మరింత ఉధృతమైంది. ఇప్పుడు విద్యుత్ జేఏసీ సమ్మె కూడా తోడైంది. దీంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. ఒక వైపు ఆందోళనలతో మరో వైపు నిలచిన విద్యుత్ సరఫరాతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సమైక్యమే తమ అభిమతమని ప్రజలంతా ప్రతినిబూనారు. ఇందుకోసం ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొంటామంటున్నారు. ఉద్యమానికి సహకరించని ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడించి, వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
గుంటూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు సోమవారం చేపట్టిన ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. విభజనవాదంపై తాడోపేడో తేల్చుకుంటామంటూ నాయకులు జిల్లా వ్యాప్తతంగా ఆందోళన చేపట్టారు. మరోవైపు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, ఎన్జీవోలు, ఉపాధ్యాయ, విద్యార్థి జేఏసీ చేపట్టిన ఆందోళనలతో జిల్లా అట్టుడికిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో జనజీవనం స్తంభించింది. పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అయినా సమైక్య రాష్ర్ట పరిరక్షణ కోసం ఉద్యమంలో వెనుకడుగు వేయబోమని పట్టుదలతో ఉన్నారు.
మాచర్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులతో ప్రదర్శన నిర్వహించారు. 500 మంది కార్మికులకు ఆయన రూ.5 లక్షల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గుంటూరులో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, గుంటూరు నగర కన్వీనరు కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనేతలు మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇంటిని ముట్టడించారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, రావి వెంకటరమణ, నియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ షౌకత్, నసీర్‌అహ్మద్, ఈపూరు అనూఫ్, నాయకులు ముస్తఫా, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గం సమన్వయకర్త కోన రఘుపతి నాయకత్వంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించారు.
నరసరావుపేటలో సెల్ టవర్‌పైకి ఎక్కిన ఆందోళనకారులు రెండు గంటల పాటు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. రెవెన్యూ అధికారులు, వైఎస్సార్ సీపీ నాయకుల జోక్యంతో దిగివచ్చారు. జేఏసీ నాయకులపై ఎంపీ హర్షకుమార్ కుమారులు అమలాపురంలో ఎన్టీవో నాయకులపై చేసిన దాడిని మంగళగిరికి చెందిన వైఎస్సార్ సీపీ నేతలు ఖండించారు. పెదకూరపాడులో 20 మంది వేద పండితులతో సమైక్యాంధ్ర కోరుతూ సుగుణ యాగం నిర్వహించారు. సత్తెనపల్లిలో ఇటలీ సోనియా, వెన్నుపోటు చంద్రబాబు రాష్ట్రానికి శనిగ్రహల్లా దాపురించారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మైనార్టీ విభాగం జిల్లా కన్వీనర్ సయ్యద్ మహబూబ్ విమర్శించారు. పొన్నూరు ఐలాండ్ సెంటరులో పార్టీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేశారు.
గుంటూరులో
రాష్ట్ర విభజనను నిరశిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ఇంజినీరింగ్ కళాశాలల అధ్యాపకులు హిందూ కళాశాల సెంటర్‌లో విద్యార్థులను రోడ్డుపై కూర్చొబెట్టి పాఠాలు చెప్పి నిరసన వ్యక్తం చేశారు. మూడవ రోజు రిలే నిరాహార దీక్షలో వీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు కూర్చున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా హిందూ కళాశాల సెంటర్‌లో గుంటూరు సంగీతకారులు ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో గాయనీ గాయకులు పాటలు పాడి ప్రజలను ఉత్తేజపరిచారు. వైఎస్సార్ సీపీ నాయకులు షేక్ షౌకత్ ఆధ్వర్యంలో గుంటూరులో అర్ధనగ్న ప్రదర్శన, నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో మహిళలతో నిరసన ప్రదర్శన జరిగింది.
Advertisement