
ఏపీలో 8,662 ఏకోపాధ్యాయ పాఠశాలలు
న్యూఢిల్లీ: ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు(ఏకోపాధ్యాయ పాఠశాలలు) ప్రాథమిక స్థాయిలో దేశంలో 97,923 ఉన్నాయని, మాధ్యమిక స్థాయిలో 11.05 లక్షల పాఠశాలలు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. గురువారం రాజ్యసభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సంబంధిత మానవ వనరుల శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ) లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. అలాగే, ఈ పాఠశాలల్లో శాతంవారిగా చూస్తే ఏపీకి చెందినవి 8.84శాతం ఉన్నాయని, సంఖ్యవారీగా 8662 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయని కూడా ఎంహెచ్‌ఆర్‌డీ తెలిపింది.
అయితే ఇలాంటి పాఠశాలల్లో మరింతమంది విద్యార్థులను పెంపొందించేందుకు ఆర్థిక సహాయాన్ని సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) కింద అందిస్తామని తెలిపారు. ఈ సంస్థల సహాయంతో విద్యార్థులు టీచర్ల నిష్పత్తి సమానంగా ఉండేలా చూస్తామని అందులో పేర్కొన్నారు. మరోపక్క, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కారీ బడులను కార్పొరేట్ సంస్థలకు, కార్పొరేట్ స్కూళ్లకు, ప్రైవేట్ సంస్థలకు కేటాయించే అనుమతులు కోరిందా అన్న ప్రశ్నకు అలాంటిదేం లేదని, తమ వద్దకు ఇంకా ఆ విషయం రాలేదని మానవ వనరుల శాఖ తెలిపింది.
మరోపక్క, ఏపీలోని నెల్లూరు జిల్లా కావలిలో అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేయనున్నారా అన్న ప్రశ్నకు అదేం లేదని కూడా కేంద్రం విజయసాయిరెడ్డికి ఇచ్చిన లిఖితపూర్వక వివరణలో బదులిచ్చింది.