
మట్టి పనులే కాదు.. అన్నీ ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగానికి ఆటంకాలు తప్పలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రెండోరోజు నీటిపారుదల రంగంపై అడిగిన ప్రశ్నకు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఇచ్చిన సమాధానంపై వివరణ ఇచ్చేందుకు విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేచి మాట్లాడుతుండగా మధ్యలోనే ఆపి, మరో ప్రశ్నకు వెళ్లిపోయారు. పులివెందులకు నీళ్లిచ్చామని మంత్రి పదే పదే చెబుతున్నారని, దీనిపైనే మాట్లాడతానని అన్నారు. గాలేరు నగరిలో అంతర్భాగామే పులివెందుల అని, దానికి ప్రభుత్వం ఇచ్చిన లెక్కలనే తాను ప్రస్తావిస్తున్నానని తెలిపారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మూడేళ్లలో.. అంటే 2014-15, 15-16, 16-17లో కలిపి గాలేరు నగరి ప్రాజెక్టుకు 400 కోట్ల రూపాయలు కేటాయించారని వైఎస్ జగన్ చెప్పారు. అయితే, ఇదే ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 400 కోట్లు ఖర్చుచేసి 80 శాతం పనులు పూర్తి చేశారని, ఆ విషయం మొత్తం ప్రభుత్వం సభకు ఇచ్చిన కాగితాల్లోనే ఉందని చెప్పారు. అందులో మంత్రి చెప్పినట్లు కేవలం మట్టిపనులే కాక కాంక్రీటు పనులు, లైనింగ్ పనులు, ప్రాజెక్టు పనులు, గేట్లు పెట్టినవి అన్నీ ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ఆయన వివరిస్తుండగానే సప్లిమెంటరీ ప్రశ్నలు మాత్రమే అడగాలని సూచిస్తూ మరో ప్రశ్నకు వెళ్లిపోయారు.