
తల్లి శవం వద్ద 9 నెలల బాబు!
హైదరాబాద్: అప్పటివరకు భుజాన ఎత్తుకున్న తల్లి ఒక్కసారిగా రోడ్డుపక్కన కుప్పకూలి కిందపడి చనిపోయింది. చెంత తనవారు ఎవరూ లేరు. చేతిలో నుంచి తల్లి వదిలివేయడంతో 9 నెలల బాబు తల్లి శవం పక్కన కూర్చొని గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్నాడు. వనస్థలిపురం సమీపంలోని ఆటోనగర్ వద్ద మంగళవారం రాత్రి 7.30 గంట సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పెట్రోలింగ్కు వెళ్లిన పోలీసులు ఈ హృదయవిదారక దృశ్యం చూశారు. సమీపంలో ఆమెకు సంబంధించినవారు ఎవరూలేరు. తల్లి మూర్చవచ్చి కిందపడి చనిపోయినట్లు భావిస్తున్నారు.
తాము గుర్తించిన వెంటనే 108 అంబులెన్స్కు ఫోన్ చేసి తల్లి మృతదేహాన్ని ఉస్మానియ ఆస్పత్రికి తరలించినట్లు వనస్థలిపురం సిఐ గోపాలకృష్ణ చెప్పారు. 1098కు ఫోన్ చేసి శిశువిహార్ వారికి విషయం చెప్పి బాబుని వారికి అప్పగించినట్లు తెలిపారు.
ప్రస్తుతం బాబు సారధి స్టూడియో సమీపంలోని శిశువిహార్లో ఉన్నాడు. బాబు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు శిశువిహార్ సూపరింటెండెంట్ స్వరూప చెప్పారు.