లక్ష మందితో సమైక్య పరుగు
Published Sun, Feb 2 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
కోటగుమ్మం(రాజమండ్రి), న్యూస్‌లైన్ : జిల్లాలో లక్ష మందితో ‘సమైక్య 5కే రన్’ను ఏర్పాటు చేస్తున్నట్టు విజయవాడ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ తెలిపారు. శనివారం స్థానిక ఎన్‌జీఓ హోంలో ఉద్యోగ జేఏసీ నాయకులతోను, విద్యార్థి సంఘాలతోను, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, న్యాయవాదుల జేఏసీ, మున్సిపల్ జేఏసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సమైక్య 5కే రన్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో లక్ష మందితో కాకినాడ, అమలాపురం, రాజమండ్రిల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.
రాజమండ్రిలో సుబ్రహ్మణ్య మైదానం నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు, అక్కడి నుంచి తిరిగి సుబ్రహ్మణ్య మైదానానికి చేరుకుంటుందని వివరించారు. ఎన్‌జీఓ జేఏసీ నాయకులు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు, వాకర్స్, మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదుల జేఏసీ తదితర అన్ని సంఘాల వారు దీనిని విజయవంతం చేయాలన్నారు. తద్వారా సమైక్యాంధ్ర సెగ కేంద్రానికి తాకేలా చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎన్‌జీఓ జేఏసీ అధ్యక్షుడు గెద్దాడ హరిబాబు, విద్యుత్ ఉద్యోగుల తరఫున పద్మనాభం, నర్శింహారావు, విద్యార్థి సంఘాల తరఫున అర్షద్, మున్సిపల్ జేఏసీ తరఫున శ్రీనివాసరావు, రమణారావు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement