ఈనెల 9న ‘సమైక్య’పరుగు
Published Sun, Feb 2 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
సాక్షి, ఏలూరు :రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా జై సమైక్యాంధ్ర రన్‌ను నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఎంపీ, రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. శనివారం సాయంత్రం ఏలూరు రెవెన్యూ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఏలూరు నగరంలోనూ జై సమైక్యాంధ్ర రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దాదాపు లక్ష మందితో స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి ఇండోర్‌స్టేడియం వరకూ 3 కిలోమీటర్ల సమైక్యాంధ్ర రన్ జరపనున్నట్లు ఆయన వివరించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం చివరి వరకూ అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు.
సమైక్య ఉద్యమంలో ఉద్యోగులు, మీడియా పాత్రను లగడపాటి ప్రశంసించారు. నిరుత్సాహ పడి పోరాటాన్ని ఆపాల్సిన అవసరం లేదని, ఈ నెల 21న విజయోత్సవం చేసుకోవచ్చని రాష్ట్రం ఖచ్చితంగా విడిపోదని అన్నారు. 2004లో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నానని, అనివార్య కారణాల వల్ల విజయవాడ నుంచి పోటీ చేశానని గుర్తుచేశారు. ఇక ముందు కూడా విజయవాడ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ తన సీటు వేరొకరికి ఇచ్చినా రాష్ట్రం సమైక్యంగా ఉంచితే వారికి సహకరిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఎల్.సాగర్, జిల్లా కార్యదర్శి టి.యోగానందం, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బడేటి వెంకటరామయ్య, ఫ్లాష్ సంస్థ నిర్వాహకుడు యర్రంశెట్టి శ్రీనివాస్, ఏపీఎన్జీ సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, కె.రమేష్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement