‘మంగళగిరి’లో లాకప్‌డెత్?
► గుండెపోటుతో మృతి చెందినట్లుగా సెటిల్‌మెంట్
► పోస్ట్‌మార్టం నిర్వహించకుండానే మృతదేహం తరలింపు
మంగళగిరి: మంగళగిరి పట్టణంలోని రూరల్ స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒక యువకుడు అనుమానాద స్థితిలో మృతి చెందడం, పోలీసులు కొట్టడం కారణంగానే మృతి చెందినట్లు ఆరోపణలు రావడం, లాకప్‌డెత్ అంటూ జరిగిన ప్రచారం కలకలం సృష్టించింది. మంగళగిరి మండలంలోని కురగల్లు గ్రామానికి చెందిన నల్లిబోయిన వెంకటేశ్వరరావు(36)కు గంగమ్మతో పదేళ్ల కిందట వివాహం జరిగింది.
పొలం పనులు చేసుకునే వెంకటేశ్వరరావుకు గంగమ్మకు ఈ నెల ఐదో తేదీ రాత్రి గొడవ జరిగింది. ఆవేశంలో వెంకటేశ్వరరావు భార్యపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. దీంతో గంగమ్మ గాయాలపాలై ప్రాణాలతో బయటపడగా ఆమె సోదరుడు ఈ నెల 6వ తేదీ ఉదయం మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు 6వ తేదీ ఉదయం 11 గంటలకు వెంకటేశ్వరరావుని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
అదే రోజు రాత్రి స్టేషన్‌లో ఏం జరిగిందో తెలియదు కాని వెంకటేశ్వరరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని చినకాకాని గ్రామంలోని ప్రైవేటు ఆసుపత్రి మార్చురీకి తరలించి కురగల్లు గ్రామ సర్పంచ్‌కు ఫోన్ చేసి వెంకటేశ్వరరావు గుండెపోటుతో రాత్రి మృతి చెందడంతో ఆసుపత్రికి తరలించామని సమాచారమిచ్చారు. సర్పంచ్ వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులకు చెప్పడంతో వారంతా ఆసుపత్రికి చేరుకున్నారు.
వెంకటేశ్వరరావు మృతి చెందిన సమాచారం గ్రామంలో అందరికి తెలియడంతో శుక్రవారం గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు ఉపక్రమించారు. మృతుడు తల్లి మంగమ్మతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణ మిన్నంటింది. దీంతో ఆందోళన చెందిన పోలీసులు కొందరు టీడీపీ పెద్దలను రంగంలోకి దించి సెటెల్‌మెంట్ చేసి మృతుడు గుండెపోటుతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులను, గ్రామస్తులను ఒప్పించి మృతదేహానికి పంచనామా కూడా లేకుండా తప్పించుకున్నారని సమాచారం.
దీనిపై సీఐ రావూరి సురేష్‌బాబును వివరణ కోరగా గురువారం అరెస్ట్ చేశామని ఆరోగ్యం బాగాలేదని చెబితే ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందాడన్నారు.