ప్రభుత్వ బడి పదిలం
గుంటూరు ఎడ్యుకేషన్ : జిల్లాలో ప్రభుత్వ, గుర్తిం పు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 54 వేల మంది హాజ రు కానున్నారు.ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో అవగాహన పెరగడం, విద్యా హక్కు చట్టం
ప్రభావం వంటి కారణాలను గుర్తింపు పొందిన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు దోహదపడినట్టుగా చెప్పుకోవచ్చు.గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతూ రెగ్యులర్‌గా పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య మూడేళ్ల నుంచి క్రమేణా పెరుగుతోంది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 10 వేల మంది విద్యార్థులు పెరిగారు.
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల నుంచి పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేశారు. 2012 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 60 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల నుంచి 45 వేలు, ప్రైవేటుగా 15 వేల మంది విద్యార్థులు ఉన్నారు.2013లో 60,216 మంది దరఖాస్తు చేయగా వారిలో 52,047 మంది రెగ్యులర్ కాగా, 8,169 మంది మాత్రమే ప్రైవేటు విద్యార్థులు.
గుర్తింపు లేని స్కూళ్లతో చదివితే
ప్రైవేటు విద్యార్థులే...
పరీక్షల్లో ఒకసారి తప్పిన విద్యార్థులతో పాటు ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చదువుతూ పరీక్షలకు దరఖాస్తు చేసే విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటుగా పరిగణిస్తోంది. జిల్లాలోని కార్పొరేట్ పాఠశాలల్లో కొన్నిటికి ప్రభుత్వ గుర్తింపు లేకపోవడంతో ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటుగా పరిగణించడాన్ని వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తున్న తల్లిదండ్రులు అవమానంగా భావిస్తున్నారు.
గుర్తింపు పొందని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షల అనంతరం ప్రభుత్వం జారీ చేసే మార్కుల జాబితాపై ప్రైవేటు అభ్యర్థి అని ముద్రిస్తోంది. అలాగే గుర్తింపు లేని పాఠశాలలు జారీ చేసే టీసీలకు ప్రభుత్వపరంగా ఎలాంటి విలువ ఉండదని విద్యాహక్కు చట్టం స్పష్టం చేస్తోంది. అంతేగాకుండా గుర్తింపు లేని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పదో తరగతి అనంతరం పై చదువులకు వెళ్లే సమయంలో ఇబ్బందులు వస్తాయి.
9,10 తరగతులను ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివితేనే పదో తరగతి విద్యార్థులను రెగ్యులర్‌గా పరిగణించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. గుర్తింపు లేని పాఠశాలలను మూసివేయిస్తామని ప్రభుత్వం ప్రకటించడం, ఆయా పాఠశాలల్లో చదివినా ప్రయోజనం లేదని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించేందుకు వెనకాడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య...
పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ పాఠశాలల నుంచి హాజరు కానున్న విద్యార్థుల సంఖ్య గత ఏడాది కంటే మూడు వేలు పెరిగింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివితేనే విద్యార్థుల సర్టిఫికెట్లకు విలువ ఉంటుందని విద్యాహక్కు చట్టం స్పష్టం చేస్తోంది. గుర్తింపు లేని పాఠశాలలను మూసి వేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పైసా ఖర్చు లేకుండా ఉచిత విద్య అందిస్తూ, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్నాం.
- కేవీ శ్రీనివాసులురెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి