
జన్మనిచ్చిన మూడు గంటలకే బీఈడీ పరీక్ష
హిందూపురం, న్యూస్‌లైన్: తన ప్రతిరూపానికి జన్మనివ్వడానికి తల్లి పడే బాధ, వేదన వర్ణించలేనిది. అంతటి బాధను భరించి కవల పిల్లలకు జన్మనిచ్చి ‘అమ్మ’గా నెగ్గిన ఓ మహిళ.. కాన్పు అయిన మూడు గంటలు కూడా గడవకుండానే బీఈడీ పరీక్షకు హాజరై జీవిత పోరాటంలోనూ ముందు వరుసలో నిలిచింది. హిందూపురం పట్టణంలోని సత్యసాయినగర్‌కు చెందిన తిప్పన్న కుమార్తె గీతావాణి(28) శుక్రవారం ఓప్రయివేట్ ఆస్పత్రిలో ఉదయం 10.20 గంటలకు ఒక పాప, 10.30 గంటలకు మరో పాపకు సాధారణ కాన్పుతో జన్మనిచ్చింది.
బాధను పంటి బిగువన భరిస్తూ.. స్థానిక ఎస్‌డిజిఎస్ కళాశాలలో బీఈడీలో చివరి పరీక్ష ఇంగ్లిష్ రాసేందుకు బయలు దేరింది. ఆస్పత్రి సిబ్బంది, బంధువులు తొలుత వాణిని వారించినా, ఆమె పట్టుదల చూసి అంబులెన్స్ తెప్పించారు. బంధువుల సహకారంతో ఇద్దరు పిల్లలనూ వెంట బెట్టుకుని మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష కేంద్రం చేరుకుంది. మధ్యలో పిల్లలకు పాలు పట్టిస్తూ.. నిర్ణీత గడువులోగా పరీక్ష రాసింది. ఆమె పరీక్ష రాస్తుండగా గది బయట ఆమె బంధువులు కవలలను లాలించారు. ఆమెకు ఇది రెండవ కాన్పు. తొలి కాన్పులో బాబు పుట్టాడు. భర్త స్థానిక సూపర్ స్మిన్నింగ్ మిల్లులో పని చేస్తున్నారు.