కోరిక తీర్చకుంటే కోసుకుని చస్తా!
రెండు నెలలపాటు యువతి నిర్బంధం
బెదిరించి వాంఛ తీర్చుకున్నఇంజినీరింగ్ విద్యార్థి
సహకరించిన రౌడీషీటర్
విజయవాడ సిటీ: ‘కోరిక తీర్చకుంటే కోసుకుని చస్తా.. పారిపోతే నీ కుటుంబాన్ని అంతం చేస్తా..’ అంటూ ఓ శాడిస్టు రెండు నెలలపాటు ఓ విద్యార్థినిని నిర్బంధించి తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఎలాగోలా రెండు రోజుల కిందట అతడిబారి నుంచి తప్పించుకున్న ఆమె.. కుటుంబ పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరోసారి ఆ శాడిస్టు ప్రతాపం చూపుతాడేమోనన్న ఆందోళనతో నగరంలోని పోలీసు విభాగానికి చెందిన ఓ అధికారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆశ్రయించగా.. ఇలాంటి సైకోలకు తగిన శాస్తి చేయాలంటే పోలీసు కేసు పెట్టడమే మంచి దనే సలహా ఇచ్చారు. సంబంధిత పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలంటూ కుటుంబ సభ్యులకు, ఆమెకు ధైర్యం చెప్పి పంపారు.
వివరాల్లోకి వెళితే..
పశ్చిమ కృష్ణా ప్రాంతంలోని నగర పంచాయతీకి చెందిన ఓ యువతి కానూరులోని బీఈడీ కాలేజీలో చదువుతోంది. దీనికి సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజీలో నూజివీడుకు చెందిన ఓ యువకుడు కూడా చదువుతున్నాడు. రోజూ ఇంటికి రాకపోకలు సాగించే క్రమంలో వీరికి బస్టాండ్‌లో పరిచయం ఏర్పడింది. పక్కపక్క కాలేజీల్లోనే చదువుతుండడంతో ఇద్దరూ బస్టాండ్‌లో దిగి ఒకే బస్సులో కాలేజీకి, కాలేజీ నుంచి బస్టాండ్‌కు వెళ్లేవారు. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తన కోరిక తీర్చాలంటూ ఆ యువతిని కోరాడు. దీనికి ఆమె నిరాకరించి మాట్లాడడం మానేసింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత క్షమాపణతో మాటలు కలిపాడు. రెండు నెలల కిందట పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో మంచి మాటలతో మభ్యపెట్టి బిస్కెట్లలో మత్తు కలిపి ఇచ్చాడు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను నేరుగా నూజివీడులోని తన ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించాడు.
అతడి తల్లి మందలించే ప్రయత్నం చేయగా కత్తులతో కోసుకుని బెదిరించాడు. దీంతో కొడుకు మాటకు ఆమె ఎదురుచెప్పలేదు. రెండు నెలలపాటు ఆ యువతిని ఇంట్లోనే బంధించి తన శారీరక వాంఛ తీర్చుకున్నాడు. ఆమె ప్రతిఘటిస్తే చనిపోతానంటూ చేతులు, వంటిపై కోసుకుని బెదిరించేవాడు. తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే.. ఆమె కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె తీవ్ర వ్యధను అనుభవిస్తూ గడిపింది. అక్కడి పరిస్థితి తట్టుకోలేని స్థితిలో రెండు రోజుల కిందట తప్పించుకొని పారిపోయి ఇంటికి వచ్చింది. ఈ సంగతి యువతి కుటుంబసభ్యులకు తెలిసినప్పటికీ అతడికి భయపడి ఎవరికీ చెప్పుకోలేకపోయారని తెలిసింది. యువతి ఇంటికి చేరుకున్నాక పోలీసు శాఖలోని ఓ విభాగంలో పనిచేసే పరిచయస్తుడైన అధికారిని కలిసి జరిగిన విషయాన్ని తెలిపారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే విషయం బయటకు రావడంతోపాటు ఆ శాడిస్టు వల్ల ప్రాణభయం ఏర్పడుతుందనే ఆందోళనను యువతి తాలూకు కుటుంబ సభ్యులు వ్యక్తం చేసినట్టు తెలిసింది.
రౌడీషీటర్ సహకారం
ఇంజినీరింగ్ విద్యార్థి సైకో చర్యలకు నూజివీడు పట్టణానికి చెందిన ఓ రౌడీషీటర్ అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. యువతి కిడ్నాప్ మొదలు ఇంట్లో నిర్బంధించడం వరకు కావాల్సిన సహాయ సహకారాలు రౌడీషీటర్ అందించినట్టు తెలిసింది. ఇతడి దన్నుతోనే కత్తులు చూపించి ఆమెను బెదిరించడం ద్వారా తన వాంఛను తీర్చుకున్నట్టు కుటుంబ సభ్యులు వాపోయినట్టు పోలీసు అధికారి చెప్పిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.