Kaanuru
-
కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి
కానూరు(పెనమలూరు) : విద్యార్థులు కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారని ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు. కానూరులోని పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం వ్యక్తిత్వ వికాసంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కోపం, అసూయ, బద్దకం, అతి నిద్ర, అతిగా ఆహారం తీసుకోవటం, అమర్యాదగా ప్రవర్తించటం ఉండరాదన్నారు. వారంలో ఆరు రోజులు జీవితం కోసం తినాలని, ఏడో రోజు మాత్రం తమకు ఇష్టమైంది తినాలని సూచించారు. పోటీతత్వం లేకపోతే రాణించలేరని, కోపాన్ని అదుపులో ఉంచుకుని క్రమశిక్షణతో ఉండాలని అన్నారు. ఐశ్వర్యారాయ్ కావాలంటే అదృష్టం ఉండాలని, మదర్‌థెరిసా కావాలంటే మనస్సు ఉంటే సరిపోతుందని వివరించారు. కార్యక్రమంలో కాలేజీ కన్వీనర్ బోయపాటి శ్రీరాములు, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శివాజీబాబు, ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పద్మనాభరాజు, అధ్యాపకురాలు రుద్రమదేవి తదితరులు పాల్గొన్నారు. -
భయపడవద్దు..
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కుటుంబీకులకు పోలీసు అధికారుల భరోసా ఇంటి ఆవరణలో పరిశీలన ఎఫ్ఐఆర్ నమోదు పోలీస్ పికెట్ ఏర్పాటు పెనమలూరు : కానూరు సనత్‌నగర్‌లో ఉన్న శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్ ఇంటిని శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు. గురువారం వేకువజామున ఈ ఇంటిలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడిన విషయం తెలిసిందే. ఎస్పీ ఖాన్ ఇంటికి శుక్రవారం క్రైం అదనపు డీసీపీ రామకోటేశ్వరరావు, ఇన్చార్జి ఏసీపీ గుణ్ణం రామకృష్ణ, తూర్పు డివిజన్ ఏసీపీ మహేశ్వరరాజు వచ్చారు. ఆగంతకుల రెక్కీ గురించి ఎస్పీ కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. గురువారం వేకువజామున గుర్తుతెలియని వ్యక్తులు ముఖాలకు వస్త్రాలు కట్టుకుని గోడ దూకి ఇంటి ఆవరణలోకి చొరబడ్డారని ఎస్పీ కుటుంబసభ్యులు తెలిపారు. ఆగంతకులు వరండాలో లైట్లు తీసి తలుపు గడియ విరగ్గొట్టి, ఇంట్లోకి చొరబడేందుకు యత్నించారని వివరించారు. ఆ శబ్దాలకు ఎదురింట్లో వారికి మెలకువ వచ్చి బయటకు వచ్చారన్నారు. వారిని చూసి ఆ వ్యక్తులు పారిపోయారని తెలిపారు. ఖాన్ ఇంటి ఆవరణను పోలీసు ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. భయపడాల్సింది లేదని ఎస్పీ కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో పోలీసు నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇక్కడ సంచరించినా.. ఏదైనా అనుమానం ఉన్నా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. కేసు నమోదు పెనమలూరు సీఐ మురళీకృష్ణ శుక్రవారం శోధన బృందంతో ఎస్పీ ఖాన్ ఇంటికి వచ్చి, విచారణ నిర్వహించారు. ఆయన కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు శోధన టీం కేసు నమోదు చేసింది. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. దుండగులు ఇంట్లోకి వచ్చి ఉంటే ఏమయ్యేదో..? కాగా ఈ విషయమై ఎస్పీ భార్య నసీమా ‘సాక్షి’తో మాట్లాడుతూ, నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులు శ్రీకాకుళం వెళ్లారని తెలిపారు. ఇంట్లో తాను, కుమార్తె ఉన్నామన్నారు. తాము నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఉండి ఉంటే తమ పరిస్థితి ఏమయ్యేదోనని ఆందోళ వ్యక్తం చేశారు. అదృష్టం బాగుండి అలికిడి అవ్వటంతో ఎదురింటి వారు బయటకు రావడాన్ని చూసి దుండగులు పారిపోయారని తెలిపారు. -
కోరిక తీర్చకుంటే కోసుకుని చస్తా!
రెండు నెలలపాటు యువతి నిర్బంధం బెదిరించి వాంఛ తీర్చుకున్నఇంజినీరింగ్ విద్యార్థి సహకరించిన రౌడీషీటర్ విజయవాడ సిటీ: ‘కోరిక తీర్చకుంటే కోసుకుని చస్తా.. పారిపోతే నీ కుటుంబాన్ని అంతం చేస్తా..’ అంటూ ఓ శాడిస్టు రెండు నెలలపాటు ఓ విద్యార్థినిని నిర్బంధించి తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఎలాగోలా రెండు రోజుల కిందట అతడిబారి నుంచి తప్పించుకున్న ఆమె.. కుటుంబ పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరోసారి ఆ శాడిస్టు ప్రతాపం చూపుతాడేమోనన్న ఆందోళనతో నగరంలోని పోలీసు విభాగానికి చెందిన ఓ అధికారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆశ్రయించగా.. ఇలాంటి సైకోలకు తగిన శాస్తి చేయాలంటే పోలీసు కేసు పెట్టడమే మంచి దనే సలహా ఇచ్చారు. సంబంధిత పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలంటూ కుటుంబ సభ్యులకు, ఆమెకు ధైర్యం చెప్పి పంపారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ కృష్ణా ప్రాంతంలోని నగర పంచాయతీకి చెందిన ఓ యువతి కానూరులోని బీఈడీ కాలేజీలో చదువుతోంది. దీనికి సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజీలో నూజివీడుకు చెందిన ఓ యువకుడు కూడా చదువుతున్నాడు. రోజూ ఇంటికి రాకపోకలు సాగించే క్రమంలో వీరికి బస్టాండ్‌లో పరిచయం ఏర్పడింది. పక్కపక్క కాలేజీల్లోనే చదువుతుండడంతో ఇద్దరూ బస్టాండ్‌లో దిగి ఒకే బస్సులో కాలేజీకి, కాలేజీ నుంచి బస్టాండ్‌కు వెళ్లేవారు. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తన కోరిక తీర్చాలంటూ ఆ యువతిని కోరాడు. దీనికి ఆమె నిరాకరించి మాట్లాడడం మానేసింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత క్షమాపణతో మాటలు కలిపాడు. రెండు నెలల కిందట పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో మంచి మాటలతో మభ్యపెట్టి బిస్కెట్లలో మత్తు కలిపి ఇచ్చాడు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను నేరుగా నూజివీడులోని తన ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించాడు. అతడి తల్లి మందలించే ప్రయత్నం చేయగా కత్తులతో కోసుకుని బెదిరించాడు. దీంతో కొడుకు మాటకు ఆమె ఎదురుచెప్పలేదు. రెండు నెలలపాటు ఆ యువతిని ఇంట్లోనే బంధించి తన శారీరక వాంఛ తీర్చుకున్నాడు. ఆమె ప్రతిఘటిస్తే చనిపోతానంటూ చేతులు, వంటిపై కోసుకుని బెదిరించేవాడు. తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే.. ఆమె కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె తీవ్ర వ్యధను అనుభవిస్తూ గడిపింది. అక్కడి పరిస్థితి తట్టుకోలేని స్థితిలో రెండు రోజుల కిందట తప్పించుకొని పారిపోయి ఇంటికి వచ్చింది. ఈ సంగతి యువతి కుటుంబసభ్యులకు తెలిసినప్పటికీ అతడికి భయపడి ఎవరికీ చెప్పుకోలేకపోయారని తెలిసింది. యువతి ఇంటికి చేరుకున్నాక పోలీసు శాఖలోని ఓ విభాగంలో పనిచేసే పరిచయస్తుడైన అధికారిని కలిసి జరిగిన విషయాన్ని తెలిపారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే విషయం బయటకు రావడంతోపాటు ఆ శాడిస్టు వల్ల ప్రాణభయం ఏర్పడుతుందనే ఆందోళనను యువతి తాలూకు కుటుంబ సభ్యులు వ్యక్తం చేసినట్టు తెలిసింది. రౌడీషీటర్ సహకారం ఇంజినీరింగ్ విద్యార్థి సైకో చర్యలకు నూజివీడు పట్టణానికి చెందిన ఓ రౌడీషీటర్ అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. యువతి కిడ్నాప్ మొదలు ఇంట్లో నిర్బంధించడం వరకు కావాల్సిన సహాయ సహకారాలు రౌడీషీటర్ అందించినట్టు తెలిసింది. ఇతడి దన్నుతోనే కత్తులు చూపించి ఆమెను బెదిరించడం ద్వారా తన వాంఛను తీర్చుకున్నట్టు కుటుంబ సభ్యులు వాపోయినట్టు పోలీసు అధికారి చెప్పిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. -
దక్షిణాఫ్రికాలో కానూరు వాసి హత్య
=శరీరంపై తీవ్ర గాయాలు =వారానికి కానూరు చేరిన మృతదేహం =మృతుడు ఇంజినీర్ పెనమలూరు, న్యూస్‌లైన్ : కానూరుకు చెందిన యువ ఇంజినీర్ దక్షిణాఫ్రికాలో ఈనెల 23 వేకువజామున హత్యకు గురయ్యా డు. అతని మృతదేహాన్ని ఆదివారం కానూరులోని ఇంటికి తీసుకువచ్చారు. వివరాలిలా ఉన్నాయి. ఉయ్యూరు మండలం కడవకొల్లు పంచాయతీ పొట్లపాడుకు చెందిన పోలవరపు రా మారావు కుటుంబం కానూరు మహదేవపురం కాలనీ రోడ్డులో ఉంటోంది. ఆయన కుమారుడు సురేష్(30) విజయవాడలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివాడు. దక్షిణాఫ్రికాలోని ట్యుటోరియాలో ఆరేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు. అప్పుడప్పుడు కానూరు వచ్చి వెళుతుండేవాడు. ఈనెల 22వ తేదీ రాత్రి సురేష్ తండ్రి రామారావు, తల్లి పద్మలతో ఫోన్లో చాలసేపు మాట్లాడాడు. మరుసటి రో జు వేకువజామున సురేష్ ఇంటి ఎదుట లాన్లో తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్న ట్లు అక్కడ ఉన్న అతడి మిత్రులు కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా స మాచారం తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ దేశంలోని భారతీయుల సహకారంతో మృతదేహాన్ని వారం రోజులకు ఆది వారం విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తరలిం చారు. అక్కడి నుంచి కానూరులోని నివాసానికి తీసుకువచ్చారు. కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు కాగా సురేష్ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీ రు మున్నీరుగా విలపించారు. సురేష్ ఉన్నత స్థితికి చేరుకుంటాడని ఆశించానమి, వచ్చే ఏడాది పెళ్లి చేద్దామని అనుకున్నామని, ఈలోపు ఈ ఘటన జరిగిందని తెలిపారు. సురేష్ ఎలా చనిపోయాడనే విషయమై కుటుంబ సభ్యులకు వివరాలు తెలియలేదు. దుండగులు అతడిని హత్య చేసి ఉం టారని భావిస్తున్నారు. విజయవాడ శ్మశానవాటికలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. -
నా చావుకు కళాశాల యాజమాన్యమే కారణం
=మలుపు తిరిగిన ఆత్మహత్య కేసు =సూసైడ్‌నోట్‌లో విద్యార్థిని వేదన పెనమలూరు, న్యూస్‌లైన్ : కానూరులోని ఓ కార్పొరేట్ కళాశాలలో నాలుగు రోజుల క్రితం విద్యార్థిని ఆత్మహత్య ఘటన మలుపు తిరిగింది. తన మరణానికి కారణం కాలేజీలో ఒత్తిడి, అనారోగ్యం అని పేర్కొంటూ ఆమె రాసిన సూసైడ్‌నోట్ గురువారం దొరికింది. దీనిపై న్యాయ వి చారణ చేయాలని మృతురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. కానూరులోని కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న గుత్తికొండ విద్య ఈ నెల 23న ఉరివేసుకుని మృ తి చెందింది. చిల్లకల్లులో ఉంటున్న తల్లిదండ్రుల వద్ద నుంచి వచ్చిన రెండురోజులకే ఆమె చనిపోవటంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కాలేజీ హాస్టల్లో ఉన్న ఆమె వస్తువులు తీసుకు వెళ్లటానికి తండ్రి పూర్ణచంద్రరావు, బంధువులు గురువారం వచ్చారు. ఆమె పుస్తకాలు సర్దుతుండగా నోట్‌బుక్‌లో రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్ కనిపించింది. ‘నేను మెంటల్‌గా చాలా టార్చర్ ఫేస్ చేస్తున్నాను, భవిష్యత్తును ఎదుర్కొనే ధైర్యం లేదు. ర్యాంక్ రాకపోతే మిమ్ములను బాధ పెట్టడం ఇష్టంలేదు. నాలాంటి చాలామంది ఆడపిల్లలు కాలేజీలో ఉండలేక వారిలో వారే ఏడుస్తున్నారు. నా తల లో ఏదో పెద్ద గడ్డ ఉన్నట్లు ఉంది. చాలా నొప్పి గా ఉంది. బాగా చదువుతున్న అక్కను మంచి యూనివర్శిటీలో చదివించండి. నేను చచ్చి పో దామని డిసైడ్ అయ్యాను. నా చావుకు కాలేజీ యా జ మాన్యమే కారణం’ అని అం దులో ఉంది. దీనిపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు సీఐ ధర్మేంద్ర వచ్చి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్య తండ్రి పూర్ణచంద్రరావు మీ డియాతో మాట్లాడుతూ కా లేజీ యాజమాన్యం వైఖ రితోనే తన కుమార్తె చనిపోయిందని అన్నారు. తమకున్న సమాచారం ప్రకారం విద్య చనిపోయినప్పుడు సూసైడ్ నోట్ ఆమె చేతిలో ఉందని, దానిని కాలేజీ యా జమాన్యం దాచిందని ఆరోపించారు. సూసైడ్ నోట్ పోలీసులకు చిక్కకుండా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుందని, ఈ ఘటనపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. -
హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య
=ఉరివేసుకొని మృతి =కానూరులో ఘటన కానూరు(పెనమలూరు), న్యూస్‌లైన్ : కానూరులోని ఓ కార్పొరేట్ కళాశాల హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులోని కేఎస్సార్ నగర్‌కు చెందిన గుత్తికొండ విద్య (16) కానూరు శ్రీ చైతన్య నియోన్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు చెందిన అపరాజిత హాస్టల్ క్యాంపస్‌లో ఉంటోంది. ఈమె రెండు రోజుల క్రితం సిక్ అయ్యానంటూ ఇంటికి వెళ్లి తిరిగి హాస్టల్‌కు వచ్చింది. ఆదివారం రాత్రి పొద్దుపోయేవరకు తన ఐదుగురు రూమ్మెట్స్తో సరదాగా గడిపి నిద్ర పోయింది. కాగా తెల్లవారుజామున 4.45 గంటలకు విద్యార్థులను నిద్ర లేపడానికి వచ్చిన వార్డెన్‌కు విద్య చున్నీతో మెడకు ఉరి బిగించుకొని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో వార్డెన్‌తో పాటు రూమ్‌లో ఉన్న మిగతా విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కళాశాల యాజమాన్యం నుంచి సమాచారం అందడంతో సీఐ ధర్మేంద్ర ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. మృతురాలి తండ్రి పూర్ణచంద్రరావు, తల్లి కల్పన, ఇతర బంధువులు వచ్చిన తరువాత మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ప్రభుత్వాస్పత్రి వద్ద శవపంచనామా చేసే సమయంలో మృతురాలి బంధువులు కళాశాల యాజమాన్యం స్పందించిన తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. చివరకు శవపంచనామా అనంతరం మృతదేహాన్ని తీసుకు వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. సీఐ ధర్మేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.