కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి
కానూరు(పెనమలూరు) : విద్యార్థులు కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారని ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు. కానూరులోని పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం వ్యక్తిత్వ వికాసంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కోపం, అసూయ, బద్దకం, అతి నిద్ర, అతిగా ఆహారం తీసుకోవటం, అమర్యాదగా ప్రవర్తించటం ఉండరాదన్నారు. వారంలో ఆరు రోజులు జీవితం కోసం తినాలని, ఏడో రోజు మాత్రం తమకు ఇష్టమైంది తినాలని సూచించారు. పోటీతత్వం లేకపోతే రాణించలేరని, కోపాన్ని అదుపులో ఉంచుకుని క్రమశిక్షణతో ఉండాలని అన్నారు. ఐశ్వర్యారాయ్ కావాలంటే అదృష్టం ఉండాలని, మదర్‌థెరిసా కావాలంటే మనస్సు ఉంటే సరిపోతుందని వివరించారు. కార్యక్రమంలో కాలేజీ కన్వీనర్ బోయపాటి శ్రీరాములు, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శివాజీబాబు, ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పద్మనాభరాజు, అధ్యాపకురాలు రుద్రమదేవి తదితరులు పాల్గొన్నారు.