Siddhartha Engineering College
-
నా గదిని గర్ల్స్ హాస్టల్ చేసేశారు : వర్మ
సాక్షి, విజయవాడ : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను విద్యనభ్యసించిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్నప్పుడు రెండు సంవత్సరాలు ఇదే గదిలో ఉండేవాడినని, దీనిని ఇప్పుడు గర్ల్స్ హాస్టల్‌గా మార్చారని ట్విటర్లో పేర్కొన్నారు. ఇదిగో ఈ లవ్లీ గర్లే ఇప్పుడు ఈ గదిలో రూమ్మేట్స్గా ఉంటున్నారు అంటూ వారితో దిగిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. నేను నిలుచుకున్న వెనకాలే శ్రీదేవి ఫొటో ఒకటి ఉండేది, దాన్ని నేనే అంటించాను అంటూ తన కాలేజీ స్మృతులను వర్మ గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వర్మ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రాహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వర్మతో పాటు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి కూడా ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిని వర్మ ఎన్టీఆర్ ఆశీస్సులతో తన పంతం నెగ్గిందన్నారు. వర్మ, అగస్త్య మంజులు సంయుక్తంగా డైరెక్ట్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మే 31న ఆంధ్ర ప్రదేశ్‌లో విడుదల కానుంది. -
కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి
కానూరు(పెనమలూరు) : విద్యార్థులు కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారని ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు. కానూరులోని పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం వ్యక్తిత్వ వికాసంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కోపం, అసూయ, బద్దకం, అతి నిద్ర, అతిగా ఆహారం తీసుకోవటం, అమర్యాదగా ప్రవర్తించటం ఉండరాదన్నారు. వారంలో ఆరు రోజులు జీవితం కోసం తినాలని, ఏడో రోజు మాత్రం తమకు ఇష్టమైంది తినాలని సూచించారు. పోటీతత్వం లేకపోతే రాణించలేరని, కోపాన్ని అదుపులో ఉంచుకుని క్రమశిక్షణతో ఉండాలని అన్నారు. ఐశ్వర్యారాయ్ కావాలంటే అదృష్టం ఉండాలని, మదర్‌థెరిసా కావాలంటే మనస్సు ఉంటే సరిపోతుందని వివరించారు. కార్యక్రమంలో కాలేజీ కన్వీనర్ బోయపాటి శ్రీరాములు, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శివాజీబాబు, ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పద్మనాభరాజు, అధ్యాపకురాలు రుద్రమదేవి తదితరులు పాల్గొన్నారు. -
హోలీ వేళ.. మృత్యుకేళి
► ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల్ని మింగిన కృష్ణమ్మ ► మూడు కుటుంబాల్లో పెను విషాదం సాక్షి, విజయవాడ/వన్‌టౌన్/పటమట : ఆ ముగ్గురూ ప్రతిభావంతులైన విద్యార్థులు.. ఎప్పుడూ చదువుల్లో మేటిగా ఉంటారు. విజయవాడ వీఆర్ సిద్ధార్థలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం హోలీ వేడుక చేసుకుందామని మరో ముగ్గురు స్నేహితులతో కలసి కృష్ణానదికి వెళ్లారు. సరదాగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. సెల్ఫీలు తీసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు. అప్పటివరకు నీటిలో కేరింతలు కొట్టినవారిలో ముగ్గురిని ఊహించని రీతిలో మృత్యువు కబళించింది. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ఆయా కుటుంబాలతోపాటు వారు చదివే కళాశాలలో పెనువిషాదాన్ని నింపింది. మరణించిన ముగ్గురిలో ఇద్దరు తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం కావడంతో వారి రోదన చూపరులను కంటతడిపెట్టించింది. విజయవాడ నగరంలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన చింతలపూడి శ్రీకాంత్ (18), పటమటకు చెందిన దేవినేని సాయికృష్ణ (18), పోతన సుభాష్ (19) బాగా చురుకైన విద్యార్థులు. ఇంటర్లో 80 శాతానికి పైగా మార్కులు సాధించి కానూరులో బీటెక్ (ఐటీ) మొదటి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం హోలీ రావడంతో మరణించిన ముగ్గురు తమ స్నేహితులు వి.గుణశేఖర్, సాకేత్ ఓజాకుమార్, పూర్ణసాయికిరణ్‌లతో కలిసి కృష్ణాతీరంలో పండుగ చేసుకోవాలని నిర్ణయించి ఉదయమే సీతానగరంలోని కృష్ణానదికి చేరుకున్నారు. రంగులు చల్లుకుంటూ, ఆనందోత్సాహలతో స్నానాలు చేయడానికి నదిలోకి దిగారు. మంచినీళ్ల సీసాతో ఆడుకుంటూ లోతు తెలియక నదిలోకి వెళ్లి మరణించి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు. అక్కరకు వస్తాడునుకుంటే.. ఒరేయ్ శ్రీకాంత్ లేవరా...నువ్వు నవ్వుతూనే పడుకున్నావు. నన్నూ చెల్లినీ ఆటపట్టించింది చాలు.. ఇక లేవరా... అంటూ చింతలపూడిశ్రీకాంత్ తల్లి బాలత్రిపుర సుందరి రోదించిన తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. కొత్తపేట బావిపంపుల సెంటర్ కొండ ప్రాంతంలో ఈ కుటుంబం నివాసముంటుంది. శ్రీకాంత్ తండ్రి చిన్నతనంలోనే వారిని వదిలి వెళ్లిపోయారు. అప్పటినుంచి తల్లి కష్టపడి పిల్లలిద్దరినీ చదివిస్తున్నారు. కొడుకు బీటెక్ పూర్తిచేసి చేతికి అందివస్తే తన కష్టానికి ఫలితం దక్కుతుందని అపురూపంగా చూసుకుంటూ చదివిస్తున్నారు. ఇలాంటి దుర్ఘటన వారి ఆశల్ని చిదిమేయడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్కగానొక్క కొడుకు అమ్మా.. స్నేహితులతో కలిసి ఆడుకుని వచ్చాక కాలేజీకి వెళ్తా.. అంటూ అమ్మకు బై బై చెప్పి వెళ్లిన దేవినేని సాయికృష్ణ విగతజీవిగా తిరిగిరావడంతో ఆ తల్లిదండ్రులు హృదయవిదారకంగా రోదిస్తున్నారు. చదువుల్లో మెరిక.. బాధ్యత తెలిసిన ఒక్కగానొక్క కొడుకు అంటే వారికి అమితమైన ప్రేమ. ఎంతో బాధ్యతగా, సున్నితంగా ఉండే కృష్ణ ఇలాంటి ఊహించని ఘటనలో మరణించాడనే వార్తను తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ తండ్రి వాసుదేవరావు పటమట కెనరా బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతని సోదరి కొంత కాలం కిందట వివాహం చేసుకొని అమెరికా వెళ్లిపోయింది. ఇక కొడుకును బాగా చదివించి అమెరికా పంపి మంచి ఉద్యోగంలో స్థిరపడితే చూడాలని తల్లిదండ్రులు ఎంతగానో ఆశ పడ్డారు. కాని విధి చిన్నచూపు చూసింది. చదువుల కోసం వచ్చి.. తన కుమారుడు పోతన సుభాష్ చదువు కోసం వారి కుటుంబం కృష్ణా జిల్లా శ్రీకాకుళం నుంచి విజయవాడ వచ్చి పటమటలో ఉంటున్నారు. సుభాష్‌ను, అతని సోదరిని చదివిస్తూ తల్లి లలిత ఇక్కడే ఉంటుండగా, భర్త శివాజీ ఉద్యోగరీత్యా వరంగల్‌లో ఉంటున్నారు.కొడుకు మృతి వార్త విని ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. ఒక్కడే కొడుకు కావడంతో చదివించి ప్రయోజకుడ్ని చేద్దామనుకుంటే అందనంత దూరానికి వెళ్లిపోయాడని రోదిస్తోంది. సుభాష్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులు, బంధువులు మృతదేహాన్ని శ్రీకాకుళం తీసుకెళ్లారు. 40 నిమిషాలకు వచ్చిన 108 ఫోన్ చేసిన 10 నిమిషాల్లో రావాల్సిన 108 వాహనం 40 నిమిషాల తర్వాత వచ్చింది. వాస్తవానికి నదిలో మునిగిపోయిన వారిలో సుభాష్ నదిలోనే మరణించాడు. మిగిలిన ఇద్దరినీ స్థానికులు రక్షించి కొనఊపిరితో ఒడ్డుకు తెచ్చారు. వీరిలో కృష్ణ 20 నిమిషాలు, శ్రీకాంత్ 30 నిమిషాలకుపైగా కొట్టుకొని మరణించారు. 108 వాహనం 10 నిమిషాల వ్యవధిలో వస్తే ప్రాణాలు దక్కేవని బంధువుల ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ సిద్ధార్థలో విషాదం కానూరు (పెనమలూరు) : ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి ఘటన కానూరు వీఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో తీవ్ర విషాదం నింపింది. కాలేజీలో సరదాగా ఉండే ఇంజనీరింగ్ మొదటి ఏడాది ఐటీ చదువుతున్న చింతలపూడి మనోజ్‌దార్గాసాయిశ్రీకాంత్, దేవినేని జయనాగసాయికృష్ణ,పోతన సుభాష్‌లు నదిలో మునిగి చనిపోయారనే వార్తను సహ విద్యార్థులు, అధ్యాపకులు జీర్ణించుకోలేకపోతున్నారు. హోలీ అయినప్పటికీ కళాశాల బుధవారం యథావిధిగా పనిచేసింది. ఆ ముగ్గురూ తరగతులకు హాజరైనా బతికేవారేమోనని మిత్రులు కంటతడి పెట్టారు. బాధ్యతతో ఉండాలి : డీన్ పాండురంగారావు ఇంజినీరింగ్ విద్యార్థులపై చాలా బాధ్యత ఉందని, వారు జీవితాన్ని తేలికగా తీసుకోరాదని డీన్ బావినేని పాండురంగారావు అన్నారు. విద్యార్థులపై తల్లితండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుంటారని, దీన్ని విద్యార్థులు గుర్తించాలని కోరారు. -
సిటీకే ‘మెట్రో’ పరిమితం
ఎట్టకేలకు స్పష్టత తొలి విడత 26 కిలోమీటర్లు బందరు, ఏలూరు రోడ్ల ఎంపిక విస్తృతంగా పర్యటించిన శ్రీధరన్ కమిటీ విజయవాడ సెంట్రల్ : ప్రతిష్టాత్మక మెట్రోరైల్ ప్రాజెక్టుపై స్పష్టత వచ్చింది. మెట్రో ప్రాజెక్ట్ ముఖ్య సలహాదారు శ్రీధరన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ శనివారం విజయవాడలో విస్తృతంగా పర్యటించింది. తొలి విడతగా నగరంలో 26 కిలో మీటర్ల మేర మెట్రోరైల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. బందరురోడ్డులోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్, అక్కడ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా ఏలూరు రోడ్డును అనుసంధానం చేస్తూ రామవరప్పాడు రింగ్ వరకు రైల్ లైన్ ఏర్పాటుచేయాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. జన సమ్మర్థం ఆధారంగా ఈ రెండు రోడ్లను శ్రీధరన్ బృందం ఎంపిక చేసింది. బెజవాడకు మీడియం రైలు చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ నగరాల్లో ఏర్పాటు చేసిన తరహాలో మీడియం మెట్రోను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 45వేల నుంచి 50 వేల మంది ప్రయాణించేందుకు వీలుగా ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. రూ.7,500 కోట్ల నుంచి రూ.8 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను ప్రభుత్వం ఆమోదించి, నిధులు విడుదల చేస్తే మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తీరనున్న ప్రయాణికుల కష్టాలు మెట్రో రైలు అందుబాటులోకి వస్తే విజయవాడలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రయాణ కష్టాలు తీరే అవకాశం ఉంది. నగర జనాభా ఇప్పటికే 12లక్షలకు చేరింది. రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే స్థాయిలో ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో 250 సిటీ బస్సులు, 13 వేలకు పైగా ఆటోలు నడుస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలకు ప్రయాణ కష్టాలు తప్పడంలేదు. మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తయితే తక్కువ ఖర్చుతో సమయం వృథా కాకుండా గమ్యస్థానాన్ని చేరుకొనే అవకాశం ఉంటుంది. బస్సులో గంటసేపు వెళ్లే దూరాన్ని మెట్రో రైలులో కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సులు, ఆటోల సంఖ్య తగ్గిస్తే నగరంలో కాలుష్యాన్ని కొంత మేర అరికట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
విద్యార్థి ఆత్మహత్య
నారాయణవనం, న్యూస్‌లైన్: మండలంలోని సిద్ధార్థ ఇం జినీరింగ్ కళాశాలకు చెందిన డిప్లొమా విద్యార్థి బి.క్రాంతి కుమార్(17) వ్యవసాయ బావిలో ఆదివారం సాయత్రం శవమై తేలాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లా సోంపేట వాసిగా గుర్తించారు. ఎస్ఐ ప్రసాదరావు కథనం మేరకు..నారాయణవనం మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమో రెండో ఏడాది క్రాంతి కుమార్ చదువుతున్నాడు. స్థాని కంగా హాస్టల్లోనే ఉంటున్నాడు. ఇతను కళాశాలకు సమీపం ఎరికంబట్టు పంచాయతీ పరిధిలోని వ్యవసాయ బావిలో ఆదివారం సాయంత్రం శవమై తేలాడు. రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు సిద్ధార్థ కళాశాల విద్యార్థిగా గుర్తించారు. కళాశాల ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్‌రెడ్డి, కుమార్‌బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా క్రాంతికుమార్ జూలై 15న కళాశాల నుంచి ఇంటికి వెళ్లిపోయాడన్నారు. ఈ నెల 14వ తేదీన కళాశాలకు వచ్చి హాస్టల్లో ఉంటున్నాడని తెలిపారు. క్రాంతికుమార్ గురించి అతని తల్లి కరుణాదేవి శనివారం వాకబు చే సిందన్నారు. ఈ క్రమంలో ఇతను తరగతులకు హాజరుకావడం లేదని, మూడు రోజులుగా హాస్టల్లోనూ లేడని తెలిసిందన్నారు. కాంత్రికుమార్ తనతో గొడవ పడ్డాడని, కొన్ని రోజులుగా మాట్లాడడం లేదని, మీరే చూసుకోవాలని అతని తల్లి కరుణాదేవి తమకు ఎస్ఎంఎస్ పంపిం దని వివరించారు. ఈ క్రమంలో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందన్నారు. క్రాంతికుమార్ మృతి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశామని ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. ఇతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని, కుటుంబ సభ్యులను, సహచర విద్యార్థులను విచారిస్తే విషయం తెలుస్తుందని అన్నారు. -
విద్యార్థి ఆత్మహత్య
నారాయణవనం(చిత్తూరు), న్యూస్‌లైన్ :మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన డిప్లొమా విద్యార్థి బి.క్రాంతి కుమార్(17) సమీపంలోని వ్యవసాయ బావిలో ఆదివారం సాయత్రం శవమై తేలాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లా సోంపేట వాసిగా గుర్తించారు. ఎస్ఐ ప్రసాదరావు కథనం మేరకు..నారాయణవనం మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో రెండో ఏడాది క్రాంతి కుమార్ చదువుతున్నాడు. స్థానికంగా హాస్టల్లోనే ఉంటున్నాడు. ఇతను కళాశాలకు సమీపం ఎరికంబట్టు పంచాయతీ పరిధిలోని వ్యవసాయ బావిలో ఆదివారం సాయంత్రం శవమై తేలాడు. రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు సిద్ధార్థ కళాశాల విద్యార్థిగా గుర్తించారు. కళాశాల ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్‌రెడ్డి, కుమార్‌బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా క్రాంతికుమార్ జూలై 15న కళాశాల నుంచి ఇంటికి వెళ్లిపోయాడన్నారు. ఈ నెల 14వ తేదీన కళాశాలకు వచ్చి హాస్టల్లో ఉంటున్నాడని తెలిపారు. క్రాంతికుమార్ గురించి అతని తల్లి కరుణాదేవి శనివారం వాకబు చేసిందన్నారు. ఈ క్రమంలో ఇతను తరగతులకు హాజరుకావడం లేదని, మూడు రోజులుగా హాస్టల్లోనూ లేడని తెలిసిందన్నారు. కాంత్రికుమార్ తనతో గొడవ పడ్డాడని, కొన్ని రోజులుగా మాట్లాడడం లేదని, మీరే చూసుకోవాలని అతని తల్లి కరుణాదేవి తమకు ఎస్ఎంఎస్ పంపిందని వివరించారు. ఈ క్రమంలో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందన్నారు. క్రాంతికుమార్ మృతి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశామని ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. ఇతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని, కుటుంబ సభ్యులను, సహచర విద్యార్థులను విచారిస్తే విషయం తెలుస్తుందని అన్నారు.