హోలీ వేళ.. మృత్యుకేళి | Three engineering students engulfed kishnamma a huge tragedy for three families | Sakshi
Sakshi News home page

హోలీ వేళ.. మృత్యుకేళి

Published Thu, Mar 24 2016 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

హోలీ వేళ.. మృత్యుకేళి

హోలీ వేళ.. మృత్యుకేళి

ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల్ని  మింగిన కృష్ణమ్మ
మూడు కుటుంబాల్లో పెను విషాదం

 
సాక్షి, విజయవాడ/వన్‌టౌన్/పటమట  : ఆ ముగ్గురూ ప్రతిభావంతులైన విద్యార్థులు.. ఎప్పుడూ చదువుల్లో మేటిగా ఉంటారు. విజయవాడ వీఆర్ సిద్ధార్థలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం హోలీ వేడుక చేసుకుందామని మరో ముగ్గురు స్నేహితులతో కలసి కృష్ణానదికి వెళ్లారు. సరదాగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. సెల్ఫీలు తీసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు.  అప్పటివరకు  నీటిలో కేరింతలు కొట్టినవారిలో ముగ్గురిని ఊహించని రీతిలో మృత్యువు కబళించింది. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ సంఘటన ఆయా కుటుంబాలతోపాటు వారు చదివే కళాశాలలో  పెనువిషాదాన్ని నింపింది.  మరణించిన ముగ్గురిలో ఇద్దరు తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం కావడంతో వారి రోదన చూపరులను కంటతడిపెట్టించింది. విజయవాడ నగరంలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన చింతలపూడి శ్రీకాంత్ (18), పటమటకు చెందిన దేవినేని సాయికృష్ణ (18), పోతన సుభాష్ (19) బాగా చురుకైన విద్యార్థులు. ఇంటర్‌లో 80 శాతానికి పైగా మార్కులు సాధించి  కానూరులో  బీటెక్ (ఐటీ) మొదటి సంవత్సరం చదువుతున్నారు.

బుధవారం హోలీ రావడంతో మరణించిన ముగ్గురు తమ స్నేహితులు వి.గుణశేఖర్, సాకేత్ ఓజాకుమార్, పూర్ణసాయికిరణ్‌లతో కలిసి  కృష్ణాతీరంలో పండుగ చేసుకోవాలని  నిర్ణయించి ఉదయమే సీతానగరంలోని కృష్ణానదికి చేరుకున్నారు. రంగులు చల్లుకుంటూ, ఆనందోత్సాహలతో స్నానాలు చేయడానికి నదిలోకి దిగారు. మంచినీళ్ల సీసాతో ఆడుకుంటూ లోతు తెలియక నదిలోకి వెళ్లి మరణించి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు.

 అక్కరకు వస్తాడునుకుంటే..
ఒరేయ్ శ్రీకాంత్ లేవరా...నువ్వు నవ్వుతూనే పడుకున్నావు. నన్నూ చెల్లినీ ఆటపట్టించింది చాలు.. ఇక లేవరా... అంటూ చింతలపూడిశ్రీకాంత్ తల్లి  బాలత్రిపుర సుందరి రోదించిన తీరు చూపరులకు కంటతడి పెట్టించింది.  కొత్తపేట బావిపంపుల సెంటర్ కొండ ప్రాంతంలో ఈ కుటుంబం నివాసముంటుంది. శ్రీకాంత్ తండ్రి చిన్నతనంలోనే వారిని వదిలి వెళ్లిపోయారు. అప్పటినుంచి తల్లి కష్టపడి పిల్లలిద్దరినీ చదివిస్తున్నారు.  కొడుకు బీటెక్ పూర్తిచేసి చేతికి అందివస్తే తన కష్టానికి ఫలితం దక్కుతుందని అపురూపంగా చూసుకుంటూ చదివిస్తున్నారు.  ఇలాంటి దుర్ఘటన వారి ఆశల్ని చిదిమేయడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

 ఒక్కగానొక్క కొడుకు
అమ్మా.. స్నేహితులతో కలిసి ఆడుకుని వచ్చాక కాలేజీకి వెళ్తా.. అంటూ అమ్మకు బై బై చెప్పి వెళ్లిన దేవినేని సాయికృష్ణ విగతజీవిగా తిరిగిరావడంతో ఆ తల్లిదండ్రులు హృదయవిదారకంగా రోదిస్తున్నారు. చదువుల్లో మెరిక.. బాధ్యత తెలిసిన ఒక్కగానొక్క కొడుకు అంటే వారికి అమితమైన ప్రేమ. ఎంతో బాధ్యతగా, సున్నితంగా ఉండే కృష్ణ ఇలాంటి ఊహించని ఘటనలో మరణించాడనే వార్తను తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

కృష్ణ తండ్రి వాసుదేవరావు పటమట కెనరా బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతని సోదరి కొంత కాలం కిందట వివాహం చేసుకొని అమెరికా వెళ్లిపోయింది. ఇక కొడుకును బాగా చదివించి అమెరికా పంపి మంచి ఉద్యోగంలో స్థిరపడితే చూడాలని తల్లిదండ్రులు ఎంతగానో ఆశ పడ్డారు. కాని విధి చిన్నచూపు చూసింది.

 చదువుల కోసం వచ్చి..
తన కుమారుడు పోతన సుభాష్ చదువు కోసం వారి కుటుంబం కృష్ణా జిల్లా శ్రీకాకుళం నుంచి విజయవాడ వచ్చి పటమటలో ఉంటున్నారు. సుభాష్‌ను, అతని సోదరిని చదివిస్తూ తల్లి లలిత ఇక్కడే ఉంటుండగా, భర్త శివాజీ ఉద్యోగరీత్యా వరంగల్‌లో ఉంటున్నారు.కొడుకు మృతి వార్త విని ఆ తల్లి  తల్లడిల్లిపోతోంది. ఒక్కడే కొడుకు కావడంతో చదివించి ప్రయోజకుడ్ని చేద్దామనుకుంటే అందనంత దూరానికి వెళ్లిపోయాడని రోదిస్తోంది. సుభాష్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులు, బంధువులు మృతదేహాన్ని శ్రీకాకుళం తీసుకెళ్లారు.
 
 40 నిమిషాలకు వచ్చిన 108
ఫోన్ చేసిన 10 నిమిషాల్లో రావాల్సిన 108 వాహనం 40 నిమిషాల తర్వాత వచ్చింది. వాస్తవానికి నదిలో మునిగిపోయిన వారిలో సుభాష్ నదిలోనే మరణించాడు. మిగిలిన ఇద్దరినీ స్థానికులు రక్షించి  కొనఊపిరితో ఒడ్డుకు తెచ్చారు. వీరిలో కృష్ణ 20 నిమిషాలు, శ్రీకాంత్ 30 నిమిషాలకుపైగా  కొట్టుకొని మరణించారు. 108 వాహనం 10 నిమిషాల వ్యవధిలో వస్తే ప్రాణాలు దక్కేవని బంధువుల ఆవేదన వ్యక్తం చేశారు.

 వీఆర్ సిద్ధార్థలో విషాదం
 కానూరు (పెనమలూరు) :  ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి ఘటన కానూరు వీఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో తీవ్ర విషాదం నింపింది. కాలేజీలో సరదాగా ఉండే ఇంజనీరింగ్ మొదటి ఏడాది ఐటీ చదువుతున్న చింతలపూడి మనోజ్‌దార్గాసాయిశ్రీకాంత్, దేవినేని జయనాగసాయికృష్ణ,పోతన సుభాష్‌లు నదిలో మునిగి చనిపోయారనే వార్తను సహ విద్యార్థులు, అధ్యాపకులు జీర్ణించుకోలేకపోతున్నారు. హోలీ అయినప్పటికీ కళాశాల బుధవారం యథావిధిగా పనిచేసింది. ఆ ముగ్గురూ తరగతులకు హాజరైనా బతికేవారేమోనని మిత్రులు కంటతడి పెట్టారు.

బాధ్యతతో ఉండాలి : డీన్ పాండురంగారావు
ఇంజినీరింగ్ విద్యార్థులపై చాలా బాధ్యత ఉందని, వారు జీవితాన్ని తేలికగా తీసుకోరాదని డీన్ బావినేని పాండురంగారావు అన్నారు. విద్యార్థులపై తల్లితండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుంటారని, దీన్ని విద్యార్థులు గుర్తించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement