
చంద్రబాబు ఫ్లెక్సీని తొలగిస్తున్న ముద్దరబోయిన
సాక్షి ప్రతినిధి ఏలూరు/నూజివీడు: తెలుగు దేశం పార్టీకి, ఆ పార్టీ నూజివీడు నియోజక వర్గ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ప్రకటించారు. నూజి వీడులోని తన కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటోతో కూడిన ఫ్లెక్సీని మంగళవారం ముద్దరబోయిన వెంకటేశ్వరరావు స్వయంగా తొలగించారు. అనంతరం ఆయన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో పదేళ్ల పాటు పనిచేసి టీడీపీని పటిష్టంగా తయారు చేస్తే ఇప్పుడు చంద్రబాబుకు తాను పనికిరాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
2014లో ఎవరూ లేకపోవడంతో తాను అడగకుండానే యనమల రామకృష్ణుడితో కబురు చేసి నూజివీడు టికెట్ ఇచ్చారని, ఇప్పుడు టికెట్ నిరాకరించడంపై కారణమేమిటో అడుగుతుంటే చంద్రబాబు వద్ద సమాధానమే లేదని చెప్పారు. తనను పదేళ్ల పాటు వాడుకొని బలిపశువును చేశారని ధ్వజమెత్తారు. ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా ఆఖరి కోరిక ఏమిటని జడ్జి అడుగుతారని, టీడీపీలో మాత్రం అలాంటి నైతిక విలువలు ఏమీ లేవని దుయ్యబట్టారు. ‘చంద్రబాబుకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చె¯న్నాయుడికి, యనమల రామకృష్ణుడికి నమస్కారం, టీడీపీకి నమస్కారం’ అంటూ చేతులెత్తి దండం పెట్టారు.
తన అభిమానులు, సానుభూతిపరులు, కలిసివచ్చే కార్యకర్తలు, నాయకులతో చర్చించి వారి నిర్ణయం మేరకు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. నమ్మించి.. మోసం చేశారు: తనను పదేళ్లపాటు వాడుకొని అన్యాయంగా బయటకు గెంటివేసిన వారి అంతు చూస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై పోరాడతానని తెలిపారు. పుట్టగతులు లేకుండా పోయే పరిస్థితి టీడీపీకి వచ్చిందని, తనకు అన్యాయం చేసిన ఆ పార్టీ సంగతి చూస్తానని హెచ్చరించారు.