కిరోసిన్ మాయ ! | Aadhaar exposed to bogus cards | Sakshi
Sakshi News home page

కిరోసిన్ మాయ !

Published Wed, Nov 19 2014 2:22 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM

Aadhaar exposed to bogus cards

పలమనేరు: ఆధార్ అనుసంధానంతో జిల్లాలోని కిరోసిన్ దొంగలు బయటపడ్డారు. ఇన్నాళ్లు ప్రతినెలా లక్ష లీటర్ల నీలి కిరోసిన్ నల్ల మార్కెట్‌కు తరలుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల లెక్కలు సరిలేని కారణంగా ఇప్పటికీ భారీగానే పక్కదారి పడుతోంది. క్షేత్ర స్థాయిలో అధికారులు నడుం బిగిస్తే గానీ ఈ అక్రమాలకు చెక్‌పెట్టే పరిస్థితి కనిపించడం లేదు.
 
ఆధార్‌తో వెలుగుచూసిన బోగస్‌కార్డులు
రేషన్‌కార్డులతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ ద్వారా సుమారు లక్ష బోగస్ కార్డులున్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 94 శాతం మాత్రమే ఆధార్‌ప్రక్రియ పూర్తయింది. మరో 50వేల మందికి పైగా ఆధార్‌కార్డులు అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. వీరిలోనూ బోగస్‌తోపాటు వలస వెళ్లిన వారు ఉన్నారు. ఆధార్ ప్రక్రియతో కిరోసిన్ కోటాను ప్రభుత్వం రెండు నెలలుగా ఆపేసింది. ఇంకా తేలాల్సిన కార్డులు పెండింగ్ ఉండడంతో వీటి పేరునే డీలర్లు ఎంట్రీలు వేసుకొని కిరోసిన్‌ను నొక్కేస్తున్నట్లు అర్థమవుతోంది.

ప్రతినెలా పక్కదారి పడుతున్న లక్ష లీటర్ల కిరోసిన్
జిల్లాలో 2,828 చౌక దుకాణాలున్నాయి. వీటి ద్వారా 9,91,018 కార్డుదారులు ప్రతినెలా ఎల్‌పీజీ లేనివారు రెండు లీటర్లు, ఎల్‌పీజీ ఉన్న వారు ఓ లీటర్ కిరోసిన్ పొందుతున్నారు. కొందరు డీలర్లు రెండు లీటర్లు పొందేవారికి లీటరు, మరికొంత మందికి అసలు కిరోసిన్ పంపిణీ చేయడం లేదని తెలుస్తోంది. బియ్యం కొనుగోలు చేసేపుడు కార్డులు అందజేస్తే అందులో కిరోసిన్ కూడా తీసుకున్నట్లు ఎంట్రీ చేసిదాన్ని నొక్కేస్తున్నట్లు సమాచారం. ప్రతినెలా దాదాపు లక్ష లీటర్లకు పైగా పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిగో సాక్ష్యం..
పలమనేరు మండలానికి సంబంధించి అన్ని రకాల కార్డులు కలిపి 21వేలున్నాయి. వీటిలో 12 వేల మందికి రెండు లీటర్లు, ఏడువేల మంది (గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు)కి ఓ లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ అవుతున్నట్లు రికార్డుల్లో ఉంది. ఆ లెక్కన ఏడువేల మందికి మాత్రమే ఇక్కడ గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు లెక్క. కానీ గ్యాస్ పొందుతున్న వారు పదివేలకు పైగా ఉన్నట్లు ఈ మధ్యనే గ్యాస్ నిర్వాహకులు చేపట్టిన ఆధార్ సీడింగ్‌లో నమోదైంది. దీని ప్రకారం మూడు వేల మంది గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ రేషన్‌కార్డుల ద్వారా కిరోసిన్ పొందినట్టే లెక్క. ఈ అవకాశాన్ని డీలర్లు వాడుకుని కిరోసిన్ తస్కరిస్తున్నట్లు తెలుస్తోంది.

పొంతన లేని అధికారుల లెక్కలు..
జిల్లాలో 9,91,018 కార్డులున్నాయి. ఇందులో వితౌట్ ఎల్‌పీజీ కార్పొరేషన్లలో 23,977, మున్సిపాలిటీల్లో 66,394, మండల హెడ్‌క్వార్టర్స్‌లో 72,343, గ్రామీణ ప్రాంతాల్లో 6.90 లక్షలు మొత్తం 8.52 లక్షల కార్డులున్నాయి. ఒక లీటర్ పొందే కార్డుదారులు కార్పొరేషన్లలో 31,921, మున్సిపాలిటీల్లో 50,332, గ్రామీణ ప్రాంతాల్లో 1,45 లక్షలు మొత్తం 2.28 లక్షల కార్డులున్నాయి. అన్నీ కలుపుకుంటే 10.80 లక్షల కార్డులు ఉన్నట్లుగా ఉంది. కానీ జిల్లాలోని మొత్తం కార్డులు 9.91 లక్షలే. ఈ విషయమేందో అధికారులే తేల్చాల్సి ఉంది.

పూర్తి స్థాయిలో చెక్ పెట్టలేని అధికారులు..
అక్రమాలకు పూర్తిగా చెక్ పెట్టాలంటే సీఎస్‌డీటీలు వారి వద్దనున్న డైనమిక్ కీ రిజిస్టర్‌ను, ఎల్‌పీజీ వాడుతున్న కార్డుదారుల వివరాల రిజిస్టర్‌ను సరిచూడాల్సి ఉంది. దీని ప్రకారం అనర్హులను తొలగించి, ప్రతినెలా అలాట్‌మెంట్ అందజేస్తే గానీ బ్లాక్‌మార్కెట్‌కు తరలే కిరోసిన్‌ను అరికట్టలేని పరిస్థితి ఉంది. ఈ విషయమై డీఎస్‌వో విజయరాణిని వివరణ కోర గా కిరోసిన్ అలాట్‌మెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి మంజూరవుతుందన్నారు. దీనిపై తమకెటువంటి సమాచారమూ ఉండదని తెలిపారు. పూర్తిస్థాయిలో రేషన్‌కార్డులు, గ్యాస్ సీడింగ్ జరిగితే ఈ అక్రమాలకు చెక్‌పెట్టొచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement